Wildlife Conservation Department
-
దశాబ్దం తర్వాత నల్లమలలో తోడేళ్ల జాడ
మార్కాపురం: పదేళ్ల కాలం అనంతరం నల్లమల అటవీ ప్రాంతంలో తోడేళ్ల కదలికలు కనిపించాయి. ఇటీవల దోర్నాల–ఆత్మకూరు సరిహద్దులోని రోళ్లపాడు వద్ద తోడేళ్లు కనిపించినట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఇవి దోర్నాల– ఆత్మకూరు–శ్రీశైలం అటవీ ప్రాంతాల మధ్య కొద్ది సంఖ్యలో సంచరిస్తున్నాయి. వీటి అరుపు కూడా ప్రత్యేకంగా ఉంటుంది. ఇవి గుంపులుగా సంచరిస్తూ..జింకలు, గొర్రెలు, మేకలు, కుందేళ్లను చంపి తింటాయి. అత్యంత వేగంగా పరిగెడతాయి. పాతికేళ్ల క్రితం మార్కాపురం, పెద్దారవీడు, తర్లుపాడు, అర్థవీడు, దోర్నాల తదితర ప్రాంతాల్లో ఇవి ఉండేవి. పంట పొలాలకు రక్షణ చర్యలో భాగంగా రైతులు కరెంటు తీగలు పెట్టడంతో జంతువుల్ని వేటాడేందుకు పొలాల్లోకి వచ్చి విద్యుత్ వైర్లు తగిలి చనిపోయి వాటి సంఖ్య క్రమేపి తగ్గిపోయింది. గడిచిన పదేళ్ల కాలంలో నల్లమలలో తోడేళ్ల జాడ లేకపోవడంతో పర్యావరణ ప్రేమికులు ఆందోళన చెందుతున్న నేపథ్యంలో నెల క్రితం రోళ్లపాడు అటవీ ప్రాంతంలో తోడేళ్ల జాడ ట్రాప్డ్ కెమెరాల్లో కనిపించింది. వాటి సంరక్షణకు అటవీ శాఖ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. వన్య ప్రాణులను చంపవద్దు వన్య ప్రాణులను ఎవరూ చంపవద్దు. ఉచ్చులేసి వేటాడొద్దు. ఇటీవల రోళ్లపాడు ప్రాంతంలో తోడేళ్లు సంచరించాయి. రైతులు పొలాలకు విద్యుత్ కంచె వేయవద్దు. వన్య ప్రాణులను వేటాడితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. – ఎ.విగ్నేష్, డిప్యూటీ డైరెక్టర్, అటవీ శాఖ -
‘బుస్..స్..స్’ ఇంత పెద్ద పామా..?
సాక్షి, ఆగ్రా: ఎప్పటిలాగే అందరూ ఎవరి పనుల్లో వారు బిజీగా ఉన్నారు. ఫ్యాక్టరీలో కొద్దిసేపటినుంచి ఏదో వింతైన శబ్దం వినిపిస్తోంది. శబ్దం ఏంటో తెలుసుకుందామని అందరూ సైలెంట్ అయిపోయారు. అందరిలో చిన్న కలకలం మొదలైంది. అది పాము బుసలు కొడుతున్న చప్పుడు. ‘బుస్..స్..స్..’ మంటున్న పాము ఎక్కడుందో కనుక్కుందామని అందరూ తలోదిక్కు వెతికారు. స్టోర్ రూమ్‌లో దాక్కున్న దాదాపు ఆరడుగుల భారీ పాము కంటబడడంతో అందరూ షాక్‌కు గురయ్యారు. అది వారిని చూసి పారిపోయేందుకు యత్నించింది. వెంటనే వన్యప్రాణి సంరక్షణ అధికారులకు సమాచారమిచ్చారు. అయితే, భయంతో అది పరుగు పెట్టడం, స్టోర్‌రూమ్‌లో నక్కడంతో దాన్ని పట్టుకునేందుకు అధికారులకు చాలా సమయమే పట్టింది. సుమారు 30 నిముషాలు కష్టపడి వారు పామును బంధించి అడవిలో వదిలిపెట్టారు. ఆగ్రాలోని అవంతి అంతర్జాతీయ షూ తయారీ ఫ్యాక్టరీలో సోమవారం ఈ సంఘటనజరిగింది. పాము కనిపించగానే ప్రాణభయంతో దానికి హానితలపెట్టకుండా చాకచక్యంగా వ్యవహరించి తమకు సమాచారమిచ్చారని అధికారులు అన్నారు. ఫ్యాక్టరీ నిర్వాహకులకు వన్యసంరక్షణాధికారి ఎంవీ బైజురాజ్ కృతఙ్ఞతలు తెలిపారు. పాములను మనం ఏమీ అనని పక్షంలో అవి ఎవరికీ హాని చేయవని, వాటిని బెదరగొడితే కాటు ప్రమాదం ఉందని తెలిపారు. విషరహితమైన పాములు కూడా తమపై దాడి జరుగుతుందనుకుంటే కాటు వేస్తాయని అన్నారు. -
పులుల రక్షణకు ‘టైగర్ ప్రొటెక్షన్ ఫోర్స్’
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పులులు, వన్యప్రాణుల రక్షణకు ప్రభుత్వం ప్రత్యేకంగా ‘స్టేట్ టైగర్ ప్రొటెక్షన్ ఫోర్స్’ను ఏర్పాటు చేయనుంది. కవ్వాల్, అమ్రాబాద్ టైగర్ రిజర్వుల్లో ఉన్న పులులు, వన్యప్రాణులకు రక్షణ కల్పించేందుకు 112 మంది సిబ్బందితో దీనిని ఏర్పాటు చేయనుంది. రెండు చోట్లా అసిస్టెంట్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ స్థాయి అధికారులు దీనికి నేతృత్వం వహిస్తారు. ఇందులో ముగ్గురు రేంజ్ ఆఫీసర్లు, 81 మంది గార్డులు, 26 మంది ఫారెస్ట్ వాచర్లు ఉంటారు. దీని నిర్వహణకు అయ్యే ఖర్చును కేంద్ర ప్రభుత్వం 60 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం చొప్పున భరిస్తాయి. సమీకృత ప్రణాళిక.. అటవీ సంపద రక్షణ కోసం వివిధ ప్రభుత్వ శాఖల సమన్వయంతో సమీకృత ప్రణాళికను అటవీశాఖ సిద్ధం చేస్తోంది. సీఎం కేసీఆర్ సూచనల మేరకు సంబంధిత శాఖల సమన్వయంతో అడవుల రక్షణ కోసం ఈ ప్రణాళికను అమలుచేయనుంది. అడవుల్లో చెట్ల నరికివేత నియంత్రణ, వేటను పూర్తిగా అరికట్టడం, అటవీ నేరాలకు పాల్పడే వారిపై కఠినంగా వ్యవహరించడంతో పాటు పీడీ చట్టం కింద కేసులు నమోదు చేయాలని నిర్ణయించింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి అధ్యక్షతన ఇటీవల జరిగిన రాష్ట్ర స్థాయి అటవీ రక్షణ కమిటీలో ఈ మేరకు నిర్ణయించారు. అడవుల్లో జంతువుల వేటకు విద్యుత్ కంచెను వాడితే, కరెంట్ చౌర్యం, అక్రమ వినియోగం కింద కేసులు పెట్టాలని అటవీ శాఖ నిర్ణయించింది. అటవీ నేరాల్లో విచారణ వేగవంతం చేయడం, నిందితులకు వీలైనంత త్వరగా శిక్ష పడేలా చేసేందుకు ప్రభుత్వపరంగా అటవీ శాఖకు న్యాయ సహకారం అందనుంది. ఇందుకోసం జిల్లాకు ఒక లీగల్ అడ్వయిజర్‌ను నియమించే ప్రతిపాదన పరిశీలనలో ఉంది. టాస్క్‌ఫోర్స్ దాడులు, అటవీ భూముల ఆక్రమణల తొలగింపునకు అవసరమైన చోట అటవీశాఖ పోలీసుల సహకారం తీసుకోనుంది. అటవీ సమీప గ్రామాల్లో గ్రామ సభ ఏర్పాటు చేసి అటవీ రక్షక దళాలను ఏర్పాటు చేయాలని, కొత్తగా ఎన్నికైన సర్పంచ్‌లకు దీనిపై అవగాహన కల్పించేలా అటవీశాఖ చర్యలు చేపట్టనుంది. -
డాక్టర్ ముజాహిద్... సిటీ ‘సల్మాన్’
సాక్షి, హైదరాబాద్: కృష్ణజింకల వేటకు సంబంధించి మరో ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రాజస్తాన్‌లోని జోధ్‌పూర్ సమీపంలో కృష్ణజింకల్ని వేటాడిన కేసులో బాలీవుడ్ నటుడు సల్మాన్‌ఖాన్‌కు ఐదేళ్ల శిక్ష పడటం దేశవ్యాప్తంగా కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారం పూర్తిగా సద్దుమణగకముందే నగరానికి చెందిన ఓ ‘సల్మాన్ ఉదంతం’బయటపడింది. హైదరాబాద్‌కు చెందిన డెంటిస్ట్ డాక్టర్ ముజాహిద్ అలీఖాన్ మరో ముగ్గురితో కలసి కర్ణాటకలోని బీదర్ ప్రాంతంలో ఈ నెల 29న కృష్ణజింకల్ని వేటాడారు. మరునాడు తిరిగి వస్తుండగా బసవకల్యాణ్ ప్రాంతంలో పోలీసులకు చిక్కి జైలుపాలయ్యారు. వేట కోసం సిటీ నుంచి వెళ్లి... ముజాహిద్ అలీఖాన్ వృత్తిరీత్యా దంతవైద్యుడు. దుబాయ్‌లో ఉంటున్న ఈయన ఇటీవలే హైదరాబాద్‌కు వచ్చారు. నగరానికే చెందిన స్నేహితులు సయ్యద్ అజర్, యాకూబ్లతో కలసి జీపులో గత నెల 29న బీదర్ ప్రాంతానికి వెళ్లారు. కర్ణాటకలోని హుమ్నాబాద్‌కు చెందిన శ్రీకాంత్ అనే పరిచయస్తుడి నుంచి కృష్ణ జింకల సమాచారాన్ని సేకరించారు. రాత్రంతా హల్సూర్ గ్రామ సమీపంలో మూడు జింకల్ని వేటాడారు. మరునాడు జీపులో తిరిగి వస్తుండగా బీదర్‌కు 35 కి.మీ దూరంలో బసవకల్యాణ్ పోలీసుల తనిఖీల్లో పట్టుబడ్డారు. వారి వద్ద మాంసంతోపాటు చర్మం, విదేశాల్లో తయారైన 0.22 క్యాలిబర్ రైఫిల్, తూటాలు, ఆరు కత్తులు లభించాయి. పోలీసులు ఆ ముగ్గురినీ అదుపులోకి తీసుకుని, జీపును స్వాధీనం చేసుకున్నారు. హుమ్నాబాద్‌లో శ్రీకాంత్‌ను కూడా పట్టుకున్నారు. వన్యప్రాణి సంరక్షణ చట్టంలోని సెక్షన్ 9, 51 ప్రకారం ఈ నలుగురిపై కేసులు నమోదు చేశారు. కేసును శనివారం బీదర్ అటవీ అధికారులకు అప్పగించారు. గతంలో రెండుసార్లు కర్ణాటకలో కృష్ణజింకల్ని వేటాడిన ఈ ముఠా ఎట్టకేలకు మూడోసారి పోలీసులకు చిక్కింది. తరచూ హైదరాబాద్, ఆ చుట్టు పక్కల ప్రాంతాల నుంచి అనేక మంది జింకల్ని వేటాడటం కోసం వస్తుండడంతో ఇటీవల నిఘా ముమ్మరం చేశారు. -
ప్రధాన పర్యాటక కేంద్రంగా కొల్లేరు
కార్యాచరణకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశం అమరావతి : కొల్లేరు సరస్సును రాష్ట్రంలో ప్రధాన పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి చంద్రబాబు వన్యప్రాణి సంరక్షణ శాఖ అధికారులను ఆదేశించారు. సచివాలయంలో మంగళవారం ఏపీ స్టేట్ బోర్డ్ ఫర్ వైల్డ్ లైఫ్ సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం పలు కీలక నిర్ణయాలను తీసుకున్నారు. కొల్లేరును పర్యాటక కేంద్రం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నుంచి అవసరమైన అనుమతులు వారంలోగా పొందేలా కార్యాచరణ రూపొందించాలన్నారు. ఎర్రచందనం అక్రమ రవాణాను ఎట్టిపరిస్థితుల్లో ఉపేక్షించవద్దని, దీనికి అడ్డుకట్ట వేసేందుకు అరికట్టడానికి పటిష్ట చర్యలు చేపట్టాలని సూచించారు. రాష్ట్రంలోని పక్షి సంరక్షణ కేంద్రాలను, జింకలు, ఎలుగుబంటుల పార్కులను మరింత అభివృద్ధి చేసి, ఆకర్షణీయ పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దాలని సీఎం అధికారులను ఆదేశించారు. దేశంలోనే పెద్దదైన పులుల సంరక్షణ కేంద్రం మన రాష్ట్రంలోనే వుందని దానిని టూరిస్ట్ స్పాట్‌గా మార్చాలంటే దేశ, విదేశాల నుంచి వచ్చే పర్యాటకులను అనుమతించాల్సి ఉంటుందన్నారు. ఇందుకోసం అధికారులు కృషి చేయాలని చెప్పారు. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నగర వనాలను త్వరితగతిన పూర్తి చేసి ప్రారంభించాలని ముఖ్యమంత్రి నిర్ధేశించారు. విజయవాడలోని ఓ కొండను నైట్ సఫారీకి అనువుగా తీర్చిదిద్దే అంశాన్ని పరిశీలించి నివేదిక అందజేయాలని సూచించారు. అడవుల్లో పెద్దఎత్తున చెక్ డ్యాంలు నిర్మించి అటవీ విస్తీర్ణం పెంచడానికి చర్యలు తీసుకోవాల్సిందిగా చెప్పారు. రాష్ట్రంలో ఎవరు మొక్కలు పెంచేందుకు ముందుకొచ్చినా, అడిగిన వెంటనే అందించే విధంగా ట్రీ బ్యాంకు ఏర్పాటు చేయాలని, అవసరమైతే ఆన్లైన్లో కూడా మొక్కలు అందించడానికి అటవీ శాఖ సిద్ధంగా ఉండాలని అన్నారు. తీర ప్రాంతంలో మామిడి తోటల పెంపకం చేపట్టాలని చెప్పారు. సమీక్షలో ముఖ్యమంత్రి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీష్ చంద్ర, అటవీశాఖ ముఖ్య కార్యదర్శి అనంతరాము, పర్యాటక శాఖ ముఖ్యకార్యదర్శి శ్రీకాంత్ పాల్గొన్నారు.