LLC 2022: దంచికొట్టిన బ్యాటర్లు.. భిల్వారా కింగ్స్ ఘన విజయం! సెహ్వాగ్ సేనకు పరాభవం
Legends League Cricket 2022- Gujarat Giants vs Bhilwara Kings: లెజెండ్స్ లీగ్ క్రికెట్-2022 టోర్నీలో భాగంగా గుజరాత్ జెయింట్స్‌తో మ్యాచ్‌లో భిల్వారా కింగ్స్ ఘన విజయం సాధించింది. వీరేంద్ర సెహ్వాగ్ సేనపై ఇర్ఫాన్ పఠాన్ బృందం ఏకంగా 57 పరుగుల తేడాతో గెలుపొందింది. తద్వారా పఠాన్ సారథ్యంలోని భిల్వారా కింగ్స్ జట్టు రెండో విజయాన్ని నమోదు చేసింది. పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరుకుంది.
దంచికొట్టిన కింగ్స్ బ్యాటర్లు!
ఒడిశాలోని కటక్‌లోని బారాబతి స్టేడియం వేదికగా ఇరు జట్ల మధ్య మంగళవారం మ్యాచ్ జరిగింది. టాస్ గెలిచిన గుజరాత్ జెయింట్స్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. అయితే, జెయింట్స్ బౌలర్లు భిల్వారా కింగ్స్ బ్యాటర్లను ఏమాత్రం కట్టడి చేయలేకపోయారు.
కింగ్స్ ఓపెనర్లు మోర్నీ వాన్ విక్ అర్ధ శతకం(28 బంతుల్లోనే 50 పరుగులు) సాధించగా.. విలియం పోర్టర్‌ఫీల్డ్ 33 బంతుల్లో 64 పరుగులతో చెలరేగాడు. ఇక వన్‌డౌన్ బ్యాటర్, కెప్టెన్ ఇర్ఫాన్ పఠాన్ 34 పరుగులతో రాణించగా.. జేసల్ కారియా 29 బంతుల్లోనే 43 పరుగులు రాబట్టాడు.
ఆఖర్లో యూసఫ్ పఠాన్ మెరుపులు (5 బంతుల్లో రెండు సిక్సర్ల సాయంతో 14 పరుగులు) మెరిపించగా.. రాజేశ్ బిష్ణోయి రెండు బంతుల్లో రెండు సిక్సర్లు కొట్టి 12 పరుగులు సాధించాడు. ఇలా బ్యాటర్లంతా రెచ్చిపోవడంతో భిల్వారా కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 222 పరుగులు స్కోరు చేసింది.
చేతులెత్తేసిన జెయింట్స్ బ్యాటర్లు! గేల్, సెహ్వాగ్ కూడా విఫలం
భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ జెయింట్స్ ఆదిలోనే ఓపెనర్ల వికెట్లు కోల్పోయింది. కెవిన్ ఒ బ్రెయిన్ 2, క్రిస్ గేల్ 15 పరుగులకే నిష్క్రమించారు. కెప్టెన్ సెహ్వాగ్ 20 బంతుల్లో 27 పరుగులు చేశాడు.
ఇక కింగ్స్ బౌలర్ల ధాటికి మిగతా బ్యాటర్లంతా చేతులెత్తేయగా.. తొమ్మిదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన యశ్పాల్ 29 బంతుల్లో 57 పరుగులు చేశాడు. ఆఖర్లో రియాద్, కేపీ అప్పన్న కాసేపు పోరాడినా.. అప్పటికే పరిస్థితి చేజారడంతో 165 పరుగులకే సెహ్వాగ్ సేన కథ ముగిసింది. 57 పరుగుల తేడాతో భిల్వారా కింగ్స్ జయకేతనం ఎగురవేసింది.
ఇక కింగ్స్ బౌలర్లలో శ్రీశాంత్‌కు అత్యధికంగా మూడు వికెట్లు దక్కాయి. జేసల్ కారియా, ఫిడెల్ ఎడ్వర్డ్స్ రెండేసి వికెట్లు పడగొట్టగా.. టినో బెస్ట్ ఒకటి, దినేశ్ ఒకటి, మాంటీ పనేసర్ ఒక వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు. కింగ్స్ భారీ స్కోరు చేయడంలో కీలక పాత్ర పోషించిన విలియం పోర్టర్‌ఫీల్డ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు.
చదవండి: Ind Vs SA 1st T20: దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్.. సొంతగడ్డపై ఒక్కసారి కూడా ట్రోఫీ గెలవని భారత్! వరణుడు కరుణిస్తేనే!
Irfan Pathan: 'ధోని వల్లే కెరీర్ నాశనమైంది'.. ఇర్ఫాన్ పఠాన్ అదిరిపోయే రిప్లై