Windows Phone
-
విండోస్ ఫోన్లలోనూ వాట్సాప్ కాలింగ్
న్యూఢిల్లీ: వాట్సాప్ కాలింగ్ సదుపాయం విండోస్ ఫోన్లలోనూ అందుబాటులోకి వచ్చింది. ఆండ్రాయిడ్, బ్లాక్ బెరీ, ఐఓఎస్ ఫోన్లలో ప్రవేశపెట్టిన ఈ ఫీచర్ ను ఇప్పుడు విండోస్ ఫోన్లకు విస్తరించారు. విండోస్ ఫోన్ యాప్(వెర్షన్ 2.12.60.0)ను వాట్సాప్ మంగళవారం అప్ డేట్ చేసింది. దీని ద్వారా ఆడియో ఫైల్స్ కూడా పంపుకోవచ్చు. 8.1 లేదా అంతకంటే ఎక్కువ వెర్షన్ ఫోన్లలో మాత్రమే ఇది పనిచేస్తుంది. ఫోన్ లో ఇంటర్నెట్ ఉంటే వాట్సాప్ వాయిస్ కాలింగ్ తో ఉచితంగా మాట్లాడుకోవచ్చు. -
మైక్రోసాఫ్ట్‌తో సెల్కాన్ జట్టు
విండోస్ ఫోన్ విన్400 ఆవిష్కరణ భారత్‌లో చవకైన విండోస్ ఫోన్ మార్చికల్లా విండోస్ ట్యాబ్లెట్ పీసీ సెల్కాన్ సీఎండీ వై.గురు హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మొబైల్ ఫోన్ల తయారీ సంస్థ సెల్కాన్ విండోస్ విభాగంలోకి ప్రవేశించింది. విన్400 పేరుతో విండోస్ స్మార్ట్‌ఫోన్‌ను సోమవారమిక్కడ ఆవిష్కరించింది. ధర రూ.4,979. ఇంత తక్కువ ధరలో భారత్‌లో లభించే విండోస్ ఫోన్ ఇదే కావడం విశేషం. 4 అంగుళాల డబ్ల్యువీజీఏ డిస్ప్లే, 1.2 గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 200 ప్రాసెసర్, విండోస్ 8.1 ఆపరేటింగ్ సిస్టమ్, 4 జీబీ ఇంటర్నల్ మెమరీ, 512 ఎంబీ ర్యామ్, ఫ్లాష్ లైట్-ఆటో ఫోకస్‌తో 5 ఎంపీ కెమెరా, 1.3 ఎంపీ ముందు కెమెరాను నిక్షిప్తం చేశారు. మైక్రోసాఫ్ట్ క్లౌడ్ వన్‌డ్రైవ్‌లో 15 జీబీ ఉచిత స్టోరేజ్ ఉంది. 3జీ, డ్యూయల్ సిమ్, 1500 ఎంఏహెచ్ బ్యాటరీ, 10.5 మిల్లీమీటర్ల మందం, 120 గ్రాముల బరువు ఇతర విశిష్టతలు. విండోస్‌లో మరిన్ని మోడళ్లు..: మైక్రోసాఫ్ట్ భాగస్వామ్యంతో మార్చికల్లా మరో రెండు విండోస్ ఫోన్లు తేనున్నట్టు సెల్కాన్ సీఎండీ వై.గురు ఈ సందర్భంగా మీడియాకు తెలిపారు. వీటిలో 5 అంగుళాల స్క్రీన్ కలిగిన మోడల్ కూడా ఉంటుందన్నారు. ట్యాబ్లెట్ పీసీని రూ.10 వేల లోపు ధరలో పరిచయం చేస్తామన్నారు. విన్400కు మంచి స్పందన ఉందని, డిసెంబర్లోనే దేశీయ మార్కెట్లో 20 వేల యూనిట్లు విక్రయించే అవకాశముందన్నారు. అక్టాకోర్ ప్రాసెసర్‌తో కూడిన ఫోన్‌ను ఈ నెలలోనే మార్కెట్లో విడుదల చేస్తామని పేర్కొన్నారు. విండోస్ అనగానే ఖరీదైన ఫోన్ అనుకుంటారు. సామాన్యులకూ అందుబాటులో ఉండాలని విన్400 ధర రూ.5 వేల లోపే నిర్ణయించామని సెల్కాన్ ఈడీ మురళి రేతినేని తెలిపారు. స్మార్ట్ఫోన్ల విభాగంలో సెల్కాన్ వాటాను ప్రస్తుతమున్న 4 శాతం నుంచి మార్చికల్లా 7-8 శాతానికి చేర్చాలని లక్ష్యం విధించుకున్నట్టు చెప్పారు. 2015లో 4కె స్క్రీన్..: అత్యంత స్పష్టమైన పిక్చర్ క్వాలిటీ కలిగిన 4కె రిజొల్యూషన్(4096గీ2160) స్క్రీ న్ 2015లో కార్యరూపం దాలుస్తుందని క్వాల్కామ్ ఇండియా బిజినెస్ డెవలప్మెంట్ డెరైక్టర్ రోహిత్ కపూర్ తెలిపారు. విండోస్ ఫోన్ల విపణిలో మరిన్ని కంపెనీలతో జట్టుకడతామని మైక్రోసాఫ్ట్ ఇండియా మొబిలిటీ డెరైక్టర్ రాజీవ్ అహ్లవత్ పేర్కొన్నారు. -
పేరు లేని లుమియా ఫోన్
న్యూయార్క్: మైక్రోసాఫ్ట్ కంపెనీ నోకియా పేరు లేకుండా మైక్రోసాఫ్ట్ లుమియా బ్రాండ్‌తో కొత్త స్మార్ట్‌ఫోన్, లుమియా 535ను మంగళవారం ఆవిష్కరించింది. నోకియా పేరు లేకుండా వస్తోన్న తొలి లుమియా ఫోన్ ఇది. ఈ 3జీ ఫోన్ సింగిల్, డ్యుయల్ సిమ్ వేరియంట్లలో లభిస్తుందని కంపెనీ ఒక బ్లాగులో పేర్కొంది. ధర 110 యూరోలు(రూ.8,400)అని, ధరలు ఆయా దేశాలను బట్టి మారతాయని వివరించింది. మైక్రోసాఫ్ట్ లోగోతో ఉన్న ఈ ఫోన్లో విండోస్ ఫోన్ 8.1 ఆపరేటింగ్ సిస్టమ్, 5 అంగుళాల డిస్ప్లే, 1.2 గిగా హెర్ట్స్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 1 జీబీ ర్యామ్, 8 జీబీ మెమెరీ, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ మెమెరీ, 15 జీబీ ఉచిత వన్‌డ్రైవ్ స్టోరేజ్, 5 మెగా పిక్సెల్ రియర్ కెమెరా, అంతే మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా, 1,905 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ప్రత్యేకతలున్నాయని పేర్కొంది. హై-ఎండ్ ఫోన్లలో ఉండే ఫీచర్లు-స్కైప్ వీడియో కాల్స్, ఆఫీస్ యాప్స్, వర్చువల్ అసిస్టెంట్ కోర్టాన వంటివి కూడా ఈ ఫోన్లో ఉన్నాయని వివరించింది. ఈ నెలలోనే వీటిని ఎంపిక చేసిన దేశాల్లో విక్రయిస్తామని మైక్రోసాఫ్ట్ తెలిపింది. -
మైక్రోసాఫ్ట్‌లో 18 వేల ఉద్యోగాల కోత!
న్యూయార్క్: అంతర్జాతీయ సాఫ్ట్వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ 39 ఏళ్ల చరిత్రలో అతిపెద్ద ఉద్యోగాల కోతకు తెరతీసింది. వచ్చే ఏడాది వ్యవధిలో 18 వేల మేర సిబ్బందిని తొలగించనున్నట్లు కంపెనీ సీఈఓ, భారత్‌కు చెందిన సత్య నాదెళ్ల గురువారం ప్రకటించారు. ఈ చర్యలు కఠినమైనవే అయినా... కొద్ది నెలల క్రితం కొనుగోలు చేసిన నోకియా మొబైల్ డివైస్ల వ్యాపారాన్ని మైక్రోసాఫ్ట్‌తో అనుసంధానించేందుకు ఇవి తప్పనిసరి అని ఉద్యోగులకు పంపిన ఈ-మెయిల్లో ఆయన పేర్కొన్నారు. మరీ ముఖ్యంగా రానున్న 12 నెలల్లో పన్ను ముందస్తు చార్జీల రూపంలో 1.6 బిలియన్ డాలర్లను(సుమారు రూ.9,600 కోట్లు) చెల్లించాల్సి ఉంటుందని కంపెనీ అంచనా వేస్తోంది. సత్య నాదెళ్ల ఐదు నెలల క్రితం మైక్రోసాఫ్ట్ సీఈఓగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇదే తొలి సిబ్బంది ఉధ్వాసన ప్రకటన కావడం గమనార్హం. అయితే, భారత్ చాలా కీలకమైన మార్కెట్‌గా నిలుస్తున్న నేపథ్యంలో ఇక్కడ ఉద్యోగాల కోతలు పెద్దగా ఉండకపోవచ్చ మైక్రోసాఫ్ట్ ఇండియా ప్రతినిధి ఒకరు అభిప్రాయపడ్డారు. తమకు భారత్‌లో నోకియా డివెజైస్‌తోసహా 6,500 మంది ఉద్యోగులు ఉన్నారని.. మైక్రోసాఫ్ట్ సిబ్బంది పునర్వ్యవస్థీకరణ ప్రభావం చాలా చాలా స్పల్పంగానే ఉంటుందని చెప్పారు. కాగా, ఈ 18,000 కోతల్లో సుమారు 12,500 వరకూ నోకియా డివెజైస్ అండ్ సర్వీసెస్ బిజినెస్‌కు చెందిన నిపుణలు, ఫ్యాక్టరీ సిబ్బందివే ఉంటాయని సమాచారం. ప్రధానంగా మైక్రోసాఫ్ట్, నోకియా డివెజైస్‌ల మధ్య సిబ్బంది పునర్వ్యవస్థీకరణలో భాగంగానే ఈ చర్యలు తీసుకుంటున్నట్లు కంపెనీ పేర్కొంది. తొలి విడతలో భాగంలో 13,000 సిబ్బందిని తగ్గించుకునే చర్యలను ప్రారంభించామని... వచ్చే ఆరు నెలల్లో ఎవరిని తొలగించబోతున్నామనేది ప్రకటిస్తామని నాదెళ్ల వెల్లడించారు. మొత్తానికి 2015 జూన్ నాటికి ఈ మొత్తం సిబ్బంది కోత ప్రక్రియ పూర్తవుతుందన్నారు. గతేడాది జూన్ నాటికి మైక్రోసాఫ్ట్‌లో 99,000 పూర్తిస్థాయి(ఫుల్‌టైమ్) సిబ్బంది పనిచేస్తున్నారు. ఇందులో 58,000 మంది అమెరికాలో, మిగతా 41,000 మంది ప్రపంచవ్యాప్తంగా విధులు నిర్వర్తిస్తున్నారు. నోకియా డీల్ తర్వాత కంపెనీలోకి కొత్తగా వచ్చిచేరిన ఉద్యోగులు ఇందులో లేరు. 7.2 బిలియన్ డాలర్ల మొత్తానికి నోకియా మైబైల్ హ్యాండ్సెట్ల తయారీ విభాగాన్ని మైక్రోసాఫ్ట్ కొనుగోలు చేయడం తెలిసిందే. ప్రధానంగా 2009లో మైక్రోసాఫ్ట్ సుమారు 5,800 మంది ఉద్యోగులను తొలిగించిన తర్వాత మళ్లీ ఇంత భారీ స్థాయిలో కోతలను ప్రకటించడం ఇదే తొలిసారి. -
చౌక స్మార్ట్ఫోన్లకు భలే గిరాకీ
న్యూఢిల్లీ: భారత్‌లో స్మార్ట్ఫోన్ల విక్రయాలు ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్నాయి. భారీ సంఖ్యలో భారతీయులు ఫీచర్ల ఫోన్ల నుంచి స్మార్ట్ఫోన్లకు అప్‌గ్రేడ్ అవుతుండడమే దీనికి కారణమని అంతర్జాతీయ రీసెర్చ్ సంస్థ ఐడీసీ వెల్లడించింది. ఈ సంస్థ అంచనాల ప్రకారం ఈ ఏడాది భారత్‌లో 8 కోట్లకు పైగా స్మార్ట్ఫోన్లు అమ్ము డవుతాయి. భారత్‌లో స్మార్ట్‌ఫోన్ విక్రయాలపై ఈ సంస్థ పేర్కొన్న కొన్ని విశేషాలు..., పలు కంపెనీలు చౌక ధరల్లో స్మార్ట్ఫోన్లనందిస్తున్నాయి. దీంతో ఫీచర్ ఫోన్లకు, స్మార్ట్ఫోన్లకు మధ్య ధర వ్యత్యాసాలు తగ్గుతుండటంతో పలువురు స్మార్ట్ఫోన్ల కొనుగోళ్లకే మొగ్గు చూపుతున్నారు. స్మార్ట్‌ఫోన్ అమ్మకాలు రానున్న ఐదేళ్లలో 40 శాతం చొప్పున చక్రగతిన వృద్ధి సాధిస్తాయి. ఈ ఏడాది జనవరి-మార్చి కాలానికి ఆసియా పసిఫిక్ ప్రాంతంలో భారత్‌లోనే స్మార్ట్‌ఫోన్ విక్రయాలు ఎక్కువగా జరిగాయి. ఈ కాలానికి ఈ విక్రయాలు 186 శాతానికి పైగా వృద్ధి సాధించాయి. చైనాలో ఈ వృద్ధి 31 శాతంగానే ఉంది. వార్షిక ప్రాతిపదికన చూస్తే ఈ ఏడాది జనవరి-మార్చి కాలానికి మొత్తం మొబైల్ ఫోన్ల విక్రయాలు 1 శాతం పెరగ్గా, అంతకు ముందటి క్వార్టర్‌తో పోల్చితే 10 శాతం క్షీణించాయి. గత ఏడాది చివరి మూడు నెలల కాలం అమ్మకాలతో పోల్చితే ఈ ఏడాది మొదటి మూడు నెలల కాలంలో మొబైల్ ఫోన్ల విక్రయాలు 18 శాతం తగ్గాయి. స్మార్ట్ఫోన్ల విక్రయాలు మాత్రం 61.4 లక్షల నుంచి 17 శాతం వృద్ధితో 1.75 కోట్లకు పెరిగాయి. వినియోగదారులు స్మార్ట్ఫోన్లకు ప్రాధాన్యత ఇస్తుండడం, ధరల మధ్య వ్యత్యాసం తగ్గుతుండడం తదితర కారణాల వల్ల స్మార్ట్ఫోన్ల విక్రయాలు పెరుగుతున్నాయి. భారత్‌లో స్మార్ట్‌ఫోన్ విస్తరణ 10 శాతంలోపే ఉంది. తక్కువ ధరలకే స్మార్ట్ఫోన్లు లభ్యమవుతుండడం, అమ్మకాల పెంపుపై పెద్ద పెద్ద కంపెనీలు దృష్టి సారించడం వంటి కారణాల వల్ల స్మార్ట్ఫోన్ల విస్తరణ మరింత పెరిగే అవకాశం ఉంది. మొత్తం స్మార్ట్ఫోన్ల విక్రయాల్లో 200 డాలర్లలోపు స్మార్ట్ఫోన్ల విక్రయాలు 78 శాతంగా ఉన్నాయి. ఇక స్మార్ట్ఫోన్ల ఆపరేటింగ్ సిస్టమ్‌లలో ఆండ్రాయిడ్ ఓఎస్దే హవా. అందుబాటు ధరల్లో విండోస్ ఓఎస్ స్మార్ట్ఫోన్లు మార్కెట్లోకి వస్తుండటంతో విండోస్ ఓఎస్ వాటా కూడా పెరుగుతోంది. స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో శామ్సంగ్ కంపెనీ అగ్రస్థానంలో ఉంది. ఈ ఏడాది మొదటి మూడు నెలల కాలంలో శామ్సంగ్ 35 శాతం మార్కెట్ వాటా సాధించింది. ఆ తర్వాతి స్థానాల్లో మైక్రోమ్యాక్స్(15%), కార్బన్(10%), లావా(6%), నోకియా (4శాతం)లు ఉన్నాయి. -
స్మార్ట్‌ఫోన్ ఎంచుకోవడం ఎలా?
ప్రస్తుతం ఉన్న స్మార్ట్‌ఫోన్ నుంచి మరో స్మార్ట్‌ఫోన్‌కు మారాలనుకుంటున్నారా? లేదా కొత్తది కొనాలనుకుంటున్నారా? అయితే ఐఫోన్, ఆండ్రాయిడ్ లేదా విండోస్ ఫోన్... ఏ ప్ల్లాట్‌ఫామ్ అయితే బాగుంటుంది? ఈ మూడింటినీ పరిశీలించి సరైన స్మార్ట్‌ఫోన్‌ను ఎలా ఎంపిక చేసుకోవాలి? వీటిలో ముఖ్యంగా పరిశీలించదగ్గ అంశాలేంటి? తొలిసారి స్మార్ట్‌ఫోన్ కొంటున్నవారికి లేదా ఒక స్మార్ట్‌ఫోన్ నుంచి మరో దానికి మారుతున్నవారికీ ఏ ప్లాట్‌ఫామ్ బెస్ట్ అన్నది మాత్రం ఓ పట్టాన అర్థం కాదు. కానీ స్మార్ట్ఫోన్లకు సంబంధించిన ఆపరేషన్ సిస్టమ్స్ (ఓఎస్)ల గురించి తెలుసుకుంటే ఏది మంచిదో సులభంగా నిర్ణయించుకోవచ్చు. ప్రస్తుతం ఉన్న ముఖ్యమైన మూడు స్మార్ట్‌ఫోన్ ఓఎస్‌లు... ఆపిల్ ఐఓఎస్, ఆండ్రాయిడ్, మైక్రోసాఫ్ట్ విండోస్ ఫోన్ల ప్లస్సులూ, మైనస్లూ తెలుసుకుందాం. ఆపిల్ ఐఓఎస్ ప్లస్‌లు: స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో ఆపిల్ కంపెనీ హవా కొనసాగుతోందంటే.. అందుకు హార్డ్‌వేర్ కన్నా సాఫ్ట్‌వేరే అతి ముఖ్య కారణంగా చెప్పవచ్చు. ఆపిల్ కంపెనీ ఐఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇతర వాటికన్నా సులభంగా ఉపయోగించేలా ఉండటంతోపాటు ఆకర్షణీయంగా కూడా ఉంటుంది. వేగం మాత్రమే కాకుండా పనితీరు కూడా సమర్థంగా ఉంటుంది. అయితే ఇది ఆపిల్ ఐఫోన్ కోసం మాత్రమే తయారుచేశారు. కాబట్టి ఆపిల్ హార్డ్‌వేర్, ఐఓఎస్‌లు మాత్రమే ఒకదానితో ఒకటి కలిసి పనిచేస్తాయి. ఆపిల్ కంపెనీ ఫస్ట్ జనరేషన్ స్మార్ట్ఫోన్లు వచ్చి ఏడేళ్లు అయినా.. ఐఫోన్ కెమెరా ఇప్పటికీ బెస్ట్ మొబైల్ కెమెరాల్లో ఒకటిగా ఉండటం విశేషం. ఐట్యూన్స్ ఆప్ స్టోర్‌లో ఇతర ప్ల్లాట్ఫామ్లకు ఏమాత్రం తీసిపోని విధంగా అనేక అప్లికేషన్లు అందుబాటులో ఉన్నాయి. చాలా మంది తమ ఆప్స్‌ను మొదట ఐఫోన్ కోసమే తయారుచే స్తారంటే ఈ ఆప్ స్టోర్‌కు ఉన్న క్రేజ్‌ను అర్థం చేసుకోవచ్చు. ఆపిల్ పరికరాలు ఇతర ఆపిల్ పరికరాలతోనే బాగా పనిచేస్తాయి. ఉదాహరణకు ఇంట్లో ఎక్కువమంది ఐఫోన్లు, ఐపాడ్లు, మ్యాక్ కంప్యూటర్లు వంటివి ఉపయోగించారనుకోండి.. ఇల్లంతా ఒక ఆపిల్ ఎకోసిస్టమ్లా తయారై.. ఆయా డివైస్ల మధ్య ఆప్స్ షేర్ చేసుకోవడం నుంచి ఆడియో, వీడియో, ఇతర ఫైళ్లు పంపుకోవడం, ఇతర పనులన్నీ చకచకా వేగంగా జరిగిపోతాయి. మైనస్‌లు: స్థిరత్వం, ఉపయోగించేందుకు సులువుగా ఉన్నా.. ఫీచర్స్ విషయంలో మాత్రం ఆండ్రాయిడ్ తర్వాతే ఐఓఎస్. దీంట్లో కెమెరా సాఫ్ట్వేర్ ఫీచర్లు ఎక్కువగా లేకపోవడం ముఖ్యమైన లోపం. ఇక హార్డ్‌వేర్ విషయంలో ఆపిల్ బాగా వెనకబడిందనే చెప్పొచ్చు. ఆండ్రాయిడ్‌తో పనిచేసే శామ్సంగ్, హెచ్‌టీసీ, మోటరోలా వంటి ఫోన్లు పెద్ద పెద్ద తెరలతో రూపు మార్చుకుంటుండగా.. ఆపిల్ ఐఫోన్ స్క్రీన్ ఇంకా 4 అంగుళాల దగ్గరే ఉంది. అలాగే మిగతావాటితో పోలిస్తే సౌండ్ పెద్దగా రాకపోవడం కూడా దీనికి మైనస్సే. ఇంట్లో ఆపిల్ డివైస్ ఒకటే ఉంటే మాత్ర ం ఇతర డివైస్లతో కలిసి పనిచేయడం కొంచెం ఇబ్బందికరమే. ఆండ్రాయిడ్ ప్లస్‌లు: గూగుల్ కంపెనీ అభివద్ధిపర్చిన ఈ ఆపరేటింగ్ సిస్టమ్ ఒక ఓపెన్ ప్ల్లాట్‌ఫామ్. అంటే దీనికి కొన్ని పరిమితులు, నిబంధనలు మాత్రమే ఉన్నాయి. ఐట్యూన్స్ ఆప్స్ స్టోర్ కంటే తక్కువ ఆప్స్ ఉన్నా.. భిన్నమైన కొన్ని ప్రత్యేక ఆప్స్ కూడా గూగుల్ ప్లే స్టోర్‌లో ఉన్నాయి. ఫోన్‌ను వైఫై హాట్‌స్పాట్‌గా మార్చగలిగే ఆప్ అందులో ఒకటి. ఆండ్రాయిడ్‌పై పనిచేసే హ్యాండ్సెట్ల రకాలు ఎక్కువే. నచ్చిన డిజైన్ బట్టి దేన్నైనా ఎంపిక చేసుకునేందుకు అవకాశం ఉంది. శామ్సంగ్, మోటరోలా, సోని, హెచ్‌టీసీ వంటి చాలా కంపెనీల ఫోన్లు ఈ ఓఎస్‌ను సపోర్ట్ చేస్తాయి. అందువల్ల అవసరాన్ని బట్టి.. పెద్ద స్క్రీన్, డిఫరెంట్ ఫీచర్లు ఉన్న ఫోన్లను ఎంపికచేసుకునేందుకు అవకాశం ఉంటుంది. ఆండ్రాయిడ్ ఫోన్లో వీడియో, ఆడియో ఫైళ్లను స్టోర్ చేయడం, డిలీట్ చేయడం చాలా సులభం. ఐట్యూన్స్ మాదిరిగా వీటిలో ప్రత్యేకంగా మ్యూజిక్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ అవసరం ఉండదు. విండోస్ యూజర్లకు ఐఫోన్ కన్నా ఆండ్రాయిడ్ ఫోన్లు కొంచెం ఉత్తమమే. ప్రస్తుతం కొత్త కొత్త సాఫ్ట్వేర్ ఫీచర్లు ఎక్కువగా ఆండ్రాయిడ్ పైనే వస్తున్నాయి. దీనితో నోటిఫికేషన్ల నుంచే నేరుగా కమాండ్లను కూడా యాక్టివేట్ చేయొచ్చు. మైనస్‌లు: ఆండ్రాయిడ్ ఓపెన్ ఫ్లాట్‌ఫామ్ కావడం వల్ల.. మొబైల్ తయారీదారులు, ఇతరులు కోర్ ఓఎస్‌ను మాత్రమే తీసుకుని దానికి మార్పులు చేర్పులు చేస్తున్నారు. కొత్త కొత్త ఫీచర్లు జతచేస్తున్నారు. దీంతో వాటి ఇంటర్ఫేస్ రూపమే మారిపోతోంది. అందువల్ల అన్ని ఆండ్రాయిడ్ ఫోన్లూ వినియోగంలో ఒకేలా ఉంటాయన్న గ్యారంటీ లేదు. ఒక హ్యాండ్సెట్ నుంచి ఇంకో హ్యాండ్‌సెట్‌కు మారేసరికి ఆపరేటింగ్ గురించి మళ్లీ కొత్తగా తెలుసుకోవాల్సిన పని పడుతోంది. ఈ మార్పుల కారణంగా ఆండ్రాయిడ్ కోసం అభివృద్ధిపర్చిన అన్ని అప్లికేషన్లు అన్ని ఆండ్రాయిడ్ ఫోన్లలో పనిచేస్తాయని కూడా చెప్పలేం. ఐట్యూన్స్ స్టోర్ మాదిరిగా ఎక్కువ ఆప్స్గానీ, బాగా పాపులర్ అయిన కొన్ని ఆప్స్ గానీ లేవు. శామ్ సంగ్ గెలాక్సీ ఎస్4, హెచ్‌టీసీ వన్ వంటి ఆండ్రాయిడ్ ఫోన్లలో శక్తిమంతమైన ప్రాసెసర్లు ఉన్నా.. చాలావరకూ ఐఫోన్ మాదిరిగా వేగంగా పనిచేయవు. విండోస్ ఫోన్ ప్లస్‌లు: ఇతర అన్ని ప్లాట్‌ఫామ్‌ల కంటే కూడా విండోస్ ఫోన్ ఇంటర్ఫేస్ బాగా ఆకర్షణీయంగా ఉంటుంది. ఎప్పటికప్పుడు సమాచారంతో అప్డేట్ అవుతూ ఉండే యానిమేటెడ్ టైల్స్ అందరినీ ఆకట్టుకుంటున్నాయి. స్క్రోలింగ్, అప్లికేషన్లను లాంచ్ చేయడంతోపాటు పనితీరు కాస్త మెరుగ్గానే ఉంటుంది. విండోస్ మొబైల్ ప్ల్లాట్ఫామ్కే పరిమితమైన నోకియా ప్రస్తుతం తక్కువ వెలుతురులోనూ నాణ్యమైన ఫొటోలు తీయగలిగే కెమెరాలను తీసుకొస్తోంది. తాజాగా నోకియా లూమియా 1020 ఫోన్లో 41 మెగాపిక్సెల్ కెమెరాను కూడా ఆ కంపెనీ జోడించింది. మైక్రోసాఫ్ట్ ఆఫీస్ నుంచి వచ్చిన పూర్తిస్థాయి మొబైల్ ప్ల్లాట్‌ఫామ్ నేటికీ ఇదొక్కటే. మైనస్‌లు: మార్కెట్లో దీనికి గడ్డుకాలమే నడుస్తోంది. మార్కెట్లోకి దిగుమతవుతున్న ఫోన్లలో విండోస్ ఫోన్ ఆధారిత ఫోన్ల వాటా చాలా తక్కువగా ఉంది. అందువల్ల కొత్త ఆప్స్‌కు ఈ ప్లాట్‌ఫామ్ అంత అనువైనది కాదని ఆప్ డెవలపర్లు భావిస్తున్నారు. ఇతర ఆప్ స్టోర్లతో పోలిస్తే.. ఈ ఆప్ స్టోర్‌లో అందుబాటులో ఉన్న అప్లికేషన్లు కూడా చాలా తక్కువే. - హన్మిరెడ్డి యెద్దుల