ప్రస్తుతం ఉన్న స్మార్ట్‌ఫోన్ నుంచి మరో స్మార్ట్‌ఫోన్‌కు మారాలనుకుంటున్నారా? లేదా కొత్తది కొనాలనుకుంటున్నారా? అయితే ఐఫోన్, ఆండ్రాయిడ్ లేదా విండోస్ ఫోన్... ఏ ప్ల్లాట్‌ఫామ్ అయితే బాగుంటుంది? ఈ మూడింటినీ పరిశీలించి సరైన స్మార్ట్‌ఫోన్‌ను ఎలా ఎంపిక చేసుకోవాలి? వీటిలో ముఖ్యంగా పరిశీలించదగ్గ అంశాలేంటి?
తొలిసారి స్మార్ట్‌ఫోన్ కొంటున్నవారికి లేదా ఒక స్మార్ట్‌ఫోన్ నుంచి మరో దానికి మారుతున్నవారికీ ఏ ప్లాట్‌ఫామ్ బెస్ట్ అన్నది మాత్రం ఓ పట్టాన అర్థం కాదు. కానీ స్మార్ట్‌ఫోన్లకు సంబంధించిన ఆపరేషన్ సిస్టమ్స్ (ఓఎస్)ల గురించి తెలుసుకుంటే ఏది మంచిదో సులభంగా నిర్ణయించుకోవచ్చు. ప్రస్తుతం ఉన్న ముఖ్యమైన మూడు స్మార్ట్‌ఫోన్ ఓఎస్‌లు... ఆపిల్ ఐఓఎస్, ఆండ్రాయిడ్, మైక్రోసాఫ్ట్ విండోస్ ఫోన్‌ల ప్లస్సులూ, మైనస్‌లూ తెలుసుకుందాం.
ఆపిల్ ఐఓఎస్
ప్లస్‌లు: స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో ఆపిల్ కంపెనీ హవా కొనసాగుతోందంటే.. అందుకు హార్డ్‌వేర్ కన్నా సాఫ్ట్‌వేరే అతి ముఖ్య కారణంగా చెప్పవచ్చు. ఆపిల్ కంపెనీ ఐఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇతర వాటికన్నా సులభంగా ఉపయోగించేలా ఉండటంతోపాటు ఆకర్షణీయంగా కూడా ఉంటుంది. వేగం మాత్రమే కాకుండా పనితీరు కూడా సమర్థంగా ఉంటుంది. అయితే ఇది ఆపిల్ ఐఫోన్ కోసం మాత్రమే తయారుచేశారు. కాబట్టి ఆపిల్ హార్డ్‌వేర్, ఐఓఎస్‌లు మాత్రమే ఒకదానితో ఒకటి కలిసి పనిచేస్తాయి. ఆపిల్ కంపెనీ ఫస్ట్ జనరేషన్ స్మార్ట్‌ఫోన్‌లు వచ్చి ఏడేళ్లు అయినా.. ఐఫోన్ కెమెరా ఇప్పటికీ బెస్ట్ మొబైల్ కెమెరాల్లో ఒకటిగా ఉండటం విశేషం. ఐట్యూన్స్ ఆప్ స్టోర్‌లో ఇతర ప్ల్లాట్‌ఫామ్‌లకు ఏమాత్రం తీసిపోని విధంగా అనేక అప్లికేషన్లు అందుబాటులో ఉన్నాయి. చాలా మంది తమ ఆప్స్‌ను మొదట ఐఫోన్ కోసమే తయారుచే స్తారంటే ఈ ఆప్ స్టోర్‌కు ఉన్న క్రేజ్‌ను అర్థం చేసుకోవచ్చు. ఆపిల్ పరికరాలు ఇతర ఆపిల్ పరికరాలతోనే బాగా పనిచేస్తాయి. ఉదాహరణకు ఇంట్లో ఎక్కువమంది ఐఫోన్లు, ఐపాడ్లు, మ్యాక్ కంప్యూటర్లు వంటివి ఉపయోగించారనుకోండి.. ఇల్లంతా ఒక ఆపిల్ ఎకోసిస్టమ్‌లా తయారై.. ఆయా డివైస్‌ల మధ్య ఆప్స్ షేర్ చేసుకోవడం నుంచి ఆడియో, వీడియో, ఇతర ఫైళ్లు పంపుకోవడం, ఇతర పనులన్నీ చకచకా వేగంగా జరిగిపోతాయి.
మైనస్‌లు: స్థిరత్వం, ఉపయోగించేందుకు సులువుగా ఉన్నా.. ఫీచర్స్ విషయంలో మాత్రం ఆండ్రాయిడ్ తర్వాతే ఐఓఎస్. దీంట్లో కెమెరా సాఫ్ట్‌వేర్ ఫీచర్లు ఎక్కువగా లేకపోవడం ముఖ్యమైన లోపం. ఇక హార్డ్‌వేర్ విషయంలో ఆపిల్ బాగా వెనకబడిందనే చెప్పొచ్చు. ఆండ్రాయిడ్‌తో పనిచేసే శామ్‌సంగ్, హెచ్‌టీసీ, మోటరోలా వంటి ఫోన్లు పెద్ద పెద్ద తెరలతో రూపు మార్చుకుంటుండగా.. ఆపిల్ ఐఫోన్ స్క్రీన్ ఇంకా 4 అంగుళాల దగ్గరే ఉంది. అలాగే మిగతావాటితో పోలిస్తే సౌండ్ పెద్దగా రాకపోవడం కూడా దీనికి మైనస్సే. ఇంట్లో ఆపిల్ డివైస్ ఒకటే ఉంటే మాత్ర ం ఇతర డివైస్‌లతో కలిసి పనిచేయడం కొంచెం ఇబ్బందికరమే.
ఆండ్రాయిడ్
ప్లస్‌లు: గూగుల్ కంపెనీ అభివద్ధిపర్చిన ఈ ఆపరేటింగ్ సిస్టమ్ ఒక ఓపెన్ ప్ల్లాట్‌ఫామ్. అంటే దీనికి కొన్ని పరిమితులు, నిబంధనలు మాత్రమే ఉన్నాయి. ఐట్యూన్స్ ఆప్స్ స్టోర్ కంటే తక్కువ ఆప్స్ ఉన్నా.. భిన్నమైన కొన్ని ప్రత్యేక ఆప్స్ కూడా గూగుల్ ప్లే స్టోర్‌లో ఉన్నాయి. ఫోన్‌ను వైఫై హాట్‌స్పాట్‌గా మార్చగలిగే ఆప్ అందులో ఒకటి. ఆండ్రాయిడ్‌పై పనిచేసే హ్యాండ్‌సెట్ల రకాలు ఎక్కువే. నచ్చిన డిజైన్ బట్టి దేన్నైనా ఎంపిక చేసుకునేందుకు అవకాశం ఉంది. శామ్‌సంగ్, మోటరోలా, సోని, హెచ్‌టీసీ వంటి చాలా కంపెనీల ఫోన్లు ఈ ఓఎస్‌ను సపోర్ట్ చేస్తాయి. అందువల్ల అవసరాన్ని బట్టి.. పెద్ద స్క్రీన్, డిఫరెంట్ ఫీచర్లు ఉన్న ఫోన్లను ఎంపికచేసుకునేందుకు అవకాశం ఉంటుంది. ఆండ్రాయిడ్ ఫోన్‌లో వీడియో, ఆడియో ఫైళ్లను స్టోర్ చేయడం, డిలీట్ చేయడం చాలా సులభం. ఐట్యూన్స్ మాదిరిగా వీటిలో ప్రత్యేకంగా మ్యూజిక్ మేనేజ్‌మెంట్ ప్రోగ్రామ్ అవసరం ఉండదు. విండోస్ యూజర్లకు ఐఫోన్ కన్నా ఆండ్రాయిడ్ ఫోన్లు కొంచెం ఉత్తమమే. ప్రస్తుతం కొత్త కొత్త సాఫ్ట్‌వేర్ ఫీచర్లు ఎక్కువగా ఆండ్రాయిడ్ పైనే వస్తున్నాయి. దీనితో నోటిఫికేషన్ల నుంచే నేరుగా కమాండ్లను కూడా యాక్టివేట్ చేయొచ్చు.
మైనస్‌లు: ఆండ్రాయిడ్ ఓపెన్ ఫ్లాట్‌ఫామ్ కావడం వల్ల.. మొబైల్ తయారీదారులు, ఇతరులు కోర్ ఓఎస్‌ను మాత్రమే తీసుకుని దానికి మార్పులు చేర్పులు చేస్తున్నారు. కొత్త కొత్త ఫీచర్లు జతచేస్తున్నారు. దీంతో వాటి ఇంటర్‌ఫేస్ రూపమే మారిపోతోంది. అందువల్ల అన్ని ఆండ్రాయిడ్ ఫోన్లూ వినియోగంలో ఒకేలా ఉంటాయన్న గ్యారంటీ లేదు. ఒక హ్యాండ్‌సెట్ నుంచి ఇంకో హ్యాండ్‌సెట్‌కు మారేసరికి ఆపరేటింగ్ గురించి మళ్లీ కొత్తగా తెలుసుకోవాల్సిన పని పడుతోంది. ఈ మార్పుల కారణంగా ఆండ్రాయిడ్ కోసం అభివృద్ధిపర్చిన అన్ని అప్లికేషన్లు అన్ని ఆండ్రాయిడ్ ఫోన్లలో పనిచేస్తాయని కూడా చెప్పలేం. ఐట్యూన్స్ స్టోర్ మాదిరిగా ఎక్కువ ఆప్స్‌గానీ, బాగా పాపులర్ అయిన కొన్ని ఆప్స్ గానీ లేవు. శామ్ సంగ్ గెలాక్సీ ఎస్4, హెచ్‌టీసీ వన్ వంటి ఆండ్రాయిడ్ ఫోన్లలో శక్తిమంతమైన ప్రాసెసర్లు ఉన్నా.. చాలావరకూ ఐఫోన్ మాదిరిగా వేగంగా పనిచేయవు.
విండోస్ ఫోన్
ప్లస్‌లు: ఇతర అన్ని ప్లాట్‌ఫామ్‌ల కంటే కూడా విండోస్ ఫోన్ ఇంటర్‌ఫేస్ బాగా ఆకర్షణీయంగా ఉంటుంది. ఎప్పటికప్పుడు సమాచారంతో అప్‌డేట్ అవుతూ ఉండే యానిమేటెడ్ టైల్స్ అందరినీ ఆకట్టుకుంటున్నాయి. స్క్రోలింగ్, అప్లికేషన్లను లాంచ్ చేయడంతోపాటు పనితీరు కాస్త మెరుగ్గానే ఉంటుంది. విండోస్ మొబైల్ ప్ల్లాట్‌ఫామ్‌కే పరిమితమైన నోకియా ప్రస్తుతం తక్కువ వెలుతురులోనూ నాణ్యమైన ఫొటోలు తీయగలిగే కెమెరాలను తీసుకొస్తోంది. తాజాగా నోకియా లూమియా 1020 ఫోన్‌లో 41 మెగాపిక్సెల్ కెమెరాను కూడా ఆ కంపెనీ జోడించింది. మైక్రోసాఫ్ట్ ఆఫీస్ నుంచి వచ్చిన పూర్తిస్థాయి మొబైల్ ప్ల్లాట్‌ఫామ్ నేటికీ ఇదొక్కటే.
మైనస్‌లు: మార్కెట్‌లో దీనికి గడ్డుకాలమే నడుస్తోంది. మార్కెట్లోకి దిగుమతవుతున్న ఫోన్లలో విండోస్ ఫోన్ ఆధారిత ఫోన్ల వాటా చాలా తక్కువగా ఉంది. అందువల్ల కొత్త ఆప్స్‌కు ఈ ప్లాట్‌ఫామ్ అంత అనువైనది కాదని ఆప్ డెవలపర్లు భావిస్తున్నారు. ఇతర ఆప్ స్టోర్‌లతో పోలిస్తే.. ఈ ఆప్ స్టోర్‌లో అందుబాటులో ఉన్న అప్లికేషన్లు కూడా చాలా తక్కువే.
- హన్మిరెడ్డి యెద్దుల
స్మార్ట్‌ఫోన్ ఎంచుకోవడం ఎలా?
Published Fri, Nov 22 2013 10:42 PM | Last Updated on Tue, Nov 6 2018 5:26 PM
Advertisement
Advertisement