శ్రీనివాస యాదవ్ నామినేషన్ ఉపసంహరణ
ప్రిన్స్ మహేష్ బాబు బావ, గుంటూరు లోక్‌సభ టీడీపీ అభ్యర్థి గల్లా జయదేవ్‌కు ఎట్టకేలకు లైన్ క్లియర్ అయింది. గుంటూరు లోక్‌సభ స్థానం అదే పార్టీ తరఫున రెబల్ అభ్యర్థిగా బరిలో దిగిన శ్రీనివాస్ యాదవ్ బుధవారం తన నామినేషన్‌ను ఉపసంహరించుకున్నారు. గుంటూరు లోక్‌సభ టీడీపీ అభ్యర్థిగా మాజీ మంత్రి గల్లా అరుణకుమారి కుమారుడు గల్లా జయదేవ్‌ను ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు గతంలో ఖరారు చేశారు.
స్థానికుడికి కాదని చిత్తూరు జిల్లా నుంచి వచ్చిన వ్యక్తికి ఎలా ఇస్తారంటూ ఆ పార్టీకి చెందిన శ్రీనివాస యాదవ్ నిరసన వ్యక్తం చేశారు. అందులోభాగంగా లోక్‌సభ టీడీపీ రెబల్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ఆ పార్టీకి చెందిన జిల్లా, స్థానిక నాయకులు రంగంలో దిగి నామినేషన్ ఉపసంహరించాలని ఆయన్ని కోరారు. అందుకు ఆయన నిరాకరించారు. దాంతో పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు రంగంలోకి దిగి పార్టీ అధికారంలోకి రాగానే మంచి పదవి కట్టబెడగానంటూ శ్రీనివాస యాదవ్‌ను బుజ్జగించారు. దాంతో శ్రీనివాస్ యాదవ్ నామినేషన్ ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించారు.