మాల్యాకి మరో ఎదురు దెబ్బ
బెంగళూరు: మద్యం వ్యాపారి విజయ్ మాల్యా మరో భారీ షాక్ తగిలింది. బ్యాంకుల కన్సార్టియానికి వేలకోట్ల రుణాలు బాకీ పడ్డ ఈ లిక్కర్ టైకూన్ కి చెక్ పెట్టే క్రమంలో రుణ రికవరీ ట్రిబ్యునల్ (డీఆర్టీ) మరో అడుగు ముందు కేసింది. దీంతో యునైటెడ్ బ్రూవరీస్ లిమిటెడ్ (యుబిఎల్) కంపెనీ నుంచి లిక్కర్ కింగ్ విజయ్ మాల్యాకు రావలసిన రూ.9.33 కోట్ల డివిడెండ్ ఆదాయానికి గండి పడింది. 2015-16 ఆర్థిక సంవత్సరానికిగాను మద్యం సంస్థ యునైటెడ్ బ్రూవరీస్ లిమిటెడ్ ...మాల్యాకు చెల్లించాల్సిన డివిడెండ్ నిలుపుదల చేసేలా ఆదేశాలు జారీ చేసింది. తన అనుమతి లేకుండా మాల్యాకు ఈ డివిడెండ్ చెల్లించొద్దని డెట్ రికవరీ ట్రిబ్యునల్ కర్ణాటక ఆదేశించింది. దీంతో కంపెనీ..ఆయన చెల్లింపులను నిలిపి వేసింది. అయితే కంపెనీల చట్టానికి లోబడి అన్ని వివరాలను బహిరంగ పరుస్తాం...ఇంతకుమించి తానేమీ వ్యాఖ్యానించలేనని కంపెనీ సీఈవో శేఖర్ రామమూర్తి వ్యాఖ్యానించగా అతని డివిడెండ్ చెల్లింపును వాయిదా వేసినట్టు మరో ప్రతినిధి ధృవీకరించారు.
మరోవైపు యునైటెడ్ స్పిరిట్స్ (యుఎస్ఎల్) చైర్మన్ పదవి నుంచి తప్పుకున్నందుకు డియాజియో కంపెనీ నుంచి అప్పనంగా వచ్చిన (75 మిలియన్ డాలర్లు) సుమారు రూ 515 కోట్ల రూపాయలకు ఇపుడు ముప్పు ఏర్పడింది. ఈ మొత్తాన్ని మాల్యా చేతికివ్వొద్దని డిఆర్టి ఆ బ్యాంక్‌ను కోరింది. మాల్యా ఖాతాలకు సంబంధించిన వివరాలన్నిటిని కూడా తనకు సమర్పించాలని జెపి మోర్గాన్ బ్యాంక్‌ను డీఆర్టీ ఆదేశించింది.
కాగా మార్చి 31 తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి మే 13 న జరిగిన భేటీలో వాటాదార్లకు ఒక్కో షేరుపై రూ.1.15 చొప్పున డివిడెండ్ చెల్లించాలని యుబిఎల్ కంపెనీ డైరెక్టర్ల బోర్డు ఇటీవల సిఫారసు చేసిన సంగతి తెలిసిందే. దీంతో తదుపరి ఆదేశాలు వెలువడే వరకు మాల్యాకు చెల్లించాల్సిన డివిడెండ్ నిలిపి వేయాలని యుబిఎల్ బోర్డు నిర్ణయం తీసుకుంది. యుబిఎల్‌లో మాల్యాతో పాటు అతడి నిర్వహణలోని తొమ్మిది కంపెనీలకు 8,11,88,930 షేర్లున్నాయి.