Wockhardt
-
కోవిడ్-19కు వ్యాక్సిన్- వొకార్డ్.. హైజంప్
ప్రపంచ దేశాలను వణికిస్తున్న కోవిడ్-19 కట్టడికి వీలుగా ఆస్ట్రాజెనెకా రూపొందిస్తున్న వ్యాక్సిన్ తయారీకి ఒప్పందం కుదుర్చుకోవడంతో దేశీ ఫార్మా రంగ కంపెనీ వొకార్డ్ లిమిటెడ్ కౌంటర్ వెలుగులో నిలుస్తోంది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు క్యూకట్టడంతో వరుసగా మూడో రోజు జోరు చూపుతోంది. ప్రస్తుతం ఎన్ఎస్ఈలో 10 శాతం అప్పర్ సర్క్యూట్‌ను తాకింది. రూ. 30 ఎగసి రూ. 334 వద్ద ఫ్రీజయ్యింది. సోమవారం సైతం ఈ షేరు 10 శాతం జంప్‌చేసి రూ. 304 సమీపంలో ముగిసింది. వెరసి గత మూడు రోజుల్లోనే ఈ కౌంటర్ 26 శాతం దూసుకెళ్లింది. కాగా.. గత ఆరు సెషన్లుగా ఈ కౌంటర్ లాభపడుతూ రావడం గమనార్హం! వ్యాక్సిన్ తయారీ కరోనా వైరస్‌ను నిలువరించేందుకు ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీ సహకారంతో బ్రిటిష్ కంపెనీ ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌ను రూపొందిస్తున్న విషయం విదితమే. ఈ వ్యాక్సిన్ తయారీ కోసం బ్రిటిష్ ప్రభుత్వం తాజాగా వొకార్డ్‌తో ఒప్పందాన్ని కుదుర్చుకుంది. దీనిలో భాగంగా యూకే అనుబంధ సంస్థ సీపీ ఫార్మాస్యూటికల్స్ ద్వారా కోవిడ్-19కు చెక్ పెట్టే AZD122 వ్యాక్సిన్‌ను వొకార్డ్ తయారు చేయనుంది. తద్వారా యూకే ప్రభుత్వానికి 3 కోట్ల డోసేజీలను సరఫరా చేయనుంది. తదుపరి దశలో 40 కోట్ల డోసేజీలవరకూ కాంట్రాక్టును పెంచుకునేందుకు వీలున్నట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. -
ముంబై వొఖార్డ్ ఆసుపత్రి సీజ్
ముంబై: ముంబై సెంట్రల్‌లోని వొఖార్డ్ ఆసుపత్రికి చెందిన ముగ్గురు వైద్యులు, 26 మంది నర్సులు, పారామెడికల్ సిబ్బందికి కరోనా పాజిటివ్ రావడంతో ఆసుపత్రిలో వైద్యసేవలను నిలిపివేశారు. వీరికి వైరస్ సోకిందనే విషయాన్ని విచారిస్తున్నట్టు ఆయన వెల్లడించారు. ఆసుపత్రిలో ఉన్న వారందరినీ క్వారంటైన్లో ఉంచారు. ముంబైలో సోమవారం నాటికి 490 పైగా కోవిడ్ కేసులు నమోదుకాగా 34 మంది మరణించారు. -
రెడ్డీస్ చేతికి వొకార్డ్ జనరిక్స్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఔషధ తయారీ సంస్థ డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్.. ఇదే రంగంలోని వొకార్డ్‌కు చెందిన కొన్ని విభాగాల బ్రాండెడ్ జనరిక్స్ దేశీ వ్యాపారాన్ని కొనుగోలు చేయనుంది. ఈ మేరకు వొకార్డ్‌తో ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు డాక్టర్ రెడ్డీస్ బుధవారం వెల్లడించింది. ఇందులో భాగంగా భారత్‌తో పాటు నేపాల్, శ్రీలంక, భూటాన్, మాల్టీవుల బిజినెస్‌ను సైతం చేజిక్కించుకోనుంది. డీల్ విలువ రూ.1,850 కోట్లు. డీల్ ద్వారా వొకార్డ్‌కు చెందిన 62 బ్రాండ్లు డాక్టర్ రెడ్డీస్ పరంకానున్నాయి. శ్వాసకోస, కేంద్ర నాడీ మండల, చర్మ, జీర్ణకోశ, నొప్పుల విభాగాలకు చెందిన పలు బ్రాండ్లను రెడ్డీస్ సొంతం చేసుకోనుంది. వొకార్డ్‌కు చెందిన అమ్మకాలు, మార్కెటింగ్ టీమ్‌లతో పాటు.. హిమాచల్‌ప్రదేశ్‌లోని బడ్డిలో గల తయారీ ప్లాంటు సైతం డాక్టర్ రెడ్డీస్‌కు దక్కుతుంది. స్లంప్‌సేల్ ప్రాతిపదికన ఈ డీల్ కుదుర్చుకున్నట్లు రెడ్డీస్ వెల్లడించింది. భారత మార్కెట్ తమకు ముఖ్యమని, వొకార్డ్ వ్యాపారాల కొనుగోలుతో ఇక్కడ మరింత విస్తరించేందుకు మార్గం సుగమం అయిందని డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ కో–చైర్మన్, ఎండీ జీవీ ప్రసాద్ ఈ సందర్భంగా తెలిపారు. తాజా కొనుగోలుతో అధిక వృద్ధికి ఆస్కారమున్న విభాగాలలో కంపెనీకి మరిన్ని అవకాశాలు లభిస్తాయని వివరించారు. -
వొకార్డ్‌కు అమెరికా డ్రగ్ రెగ్యులేటరీ దెబ్బ
న్యూఢిల్లీ: అమెరికా ఔషధ నియంత్రణా సంస్థ (యుఎస్ఎఫ్డిఎ) దేశీయ ఫార్మా దిగ్గజం వొకార్డ్ కు షాకిచ్చింది. వొకార్డ్‌కు అమెరికా ఇల్లినాయిస్లో గల అనుబంధ సంస్థ మోర్టన్ గ్రోవ్ ఫార్మాస్యూటికల్స్‌కు అక్కడి ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ(ఎఫ్‌డీఏ) హెచ్చరికలను జారీ చేస్తూ నోటీసులు జారీ చేసింది. ఈ విషయాన్ని వొకార్డ్ బిఎస్ఇ ఫైలింగ్ లో బుధవారం వెల్లడించింది. అలాగే తదుపరి ఆదేశాలవరకు తమ కొత్త ఆమోదాలకు అనుమతి ఉండదని స్పష్టం చేసింది. అయితే ఈ వార్నింగ్ లెటర్‌కు సంబంధించిన వివరాలు అందించడానికి నిరాకరించింది. అలాగే మార్కెట్లో అందుబాటులో ఉన్న కరెంట్ పోర్ట్ ఫోలియో లో విక్రయాలకుఎలాంటి ఆటంకం ఉండదని వివరించింది. ఈ హెచ్చరికల కారణంగా సమస్య పరిష్కారమయ్యేంతవరకూ యూఎస్ఎఫ్డీఏ నుంచి మార్టన్ గ్రోవ్కు ఎలాంటి కొత్త అనుమతులూ లభించబోవు. ఈ ప్రకటనతో అసలే వీక్ గా ఉన్నీ కౌంటర్లో అమ్మకాలకు తెరలేచింది. దీంతో దాదాపు 7శాతం నష్టపోయింది. కాగా గత ఏడాది వొకార్డ్‌కు చెందిన యూకే అనుబంధ సంస్థ సీపీ ఫార్మాస్యూటికల్స్‌కు యూఎస్ ఎఫ్ఢీఏ నుంచి ఇలాంటి హెచ్చరికలు అందాయి. కాగా 2014లో క్వాలిఫైడ్ ఇన్ఫెక్షియస్ డిసీజ్ ప్రొడక్ట్ (క్యుఐడిపి) హోదా పొందిన తొలి భారతీయ కంపెనీగా వొకార్డ్ చరిత్ర సృష్టించింది. -
లాభాల్లో నీరసించిన వొకార్డ్
న్యూఢిల్లీ: దేశీయ ఫార్మా దిగ్గజం వొకార్డ్ ఈ ఏడాది ఏకీకృత నికర లాభాల్లో నీరస పడింది. మార్జిన్లు భారీగా క్షీణించాయి. ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం లో నిరుత్సాహకర ఫలితాలు విడుదల చేసింది. క్యూ1(ఏప్రిల్-జూన్)లో నికర లాభం దాదాపు 83 శాతం వరకూ క్షీణించి రూ. 16 కోట్లకు పరిమితమైంది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన ఆదాయం కూడా 4 శాతం నీరసించి రూ. 1091 కోట్లకు చేరింది. గత ఏడాదితో పోలిస్తే ఇండియా వ్యాపారం 10 శాతం పెరిగిందని తెలిపింది. ప్రధానంగా యూఎస్, వర్ధమాన మార్కెట్లలో బిజినెస్ క్షీణించడంతో లాభాలు తగ్గినట్లు కంపెనీ పేర్కొంది. అయితే ఆదాయంలో 62 శాతం అంతర్జాతీయ మార్కెట్ల నుంచే లభించినట్లు కంపెనీ తెలియజేసింది. అమెరికా ఆదాయం 16 శాతం క్షీణించగా, వర్ధమాన మార్కెట్ల నుంచి కూడా ఆదాయం 16 శాతం తగ్గినట్లు వెల్లడించింది. అయితే యూకే బిజినెస్ 26 శాతం వృద్ది చూపినట్లు పేర్కొంది. ఈ కాలంలో దేశీ మార్కెట్లో 11 కొత్త ఉత్పత్తులను విడుదల చేయగా, మూడు కొత్త ఫైలింగ్స్‌ను చేపట్టామని, యూకే మార్కెట్ నుంచి ఒక ఫైలింగ్‌కు అనుమతి లభించిందని వివరించింది. నిర్వహణ లాభం(ఇబిటా) 48.5 శాతం క్షీణించి రూ. 85 కోట్లను తాకగా, ఇబిటా మార్జిన్లు 6.7 శాతం పడిపోయి 7.8 శాతానికి చేరాయి. రూ. 10 కోట్లమేర ఫారెక్స్ నష్టాలు నమోదయ్యాయి. ఇతర ఆదాయం మాత్రం రూ. 6.4 కోట్ల నుంచి రూ. 16.9 కోట్లకు ఎగసింది. కాగా కంపెనీ మూడు యూనిట్లలలో తనిఖీ నివేదికలు అందాయని వొకార్డ్ చెప్పింది. అమెరికా ఫూడ్ అండ్ డ్రగ్ ఎడ్మినిస్ట్రేషన్ ఆరోపించిన సమస్యలను పరిష్కరించేందుకు అవసరమైన దశలను ప్రారంభించిందని, పదార్థం పరిష్కరించడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నట్టు కంపెనీ తెలిపింది.