వొకార్డ్‌కు అమెరికా డ్రగ్ రెగ్యులేటరీ దెబ్బ
న్యూఢిల్లీ: అమెరికా ఔషధ నియంత్రణా సంస్థ (యుఎస్‌ఎఫ్‌డిఎ) దేశీయ ఫార్మా దిగ్గజం వొకార్డ్ కు షాకిచ్చింది. వొకార్డ్‌కు అమెరికా ఇల్లినాయిస్‌లో గల అనుబంధ సంస్థ మోర్టన్ గ్రోవ్ ఫార్మాస్యూటికల్స్‌కు అక్కడి ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ(ఎఫ్‌డీఏ) హెచ్చరికలను జారీ చేస్తూ నోటీసులు జారీ చేసింది. ఈ విషయాన్ని వొకార్డ్ బిఎస్ఇ ఫైలింగ్ లో బుధవారం వెల్లడించింది. అలాగే తదుపరి ఆదేశాలవరకు తమ కొత్త ఆమోదాలకు అనుమతి ఉండదని స్పష్టం చేసింది.
అయితే ఈ వార్నింగ్ లెటర్‌కు సంబంధించిన వివరాలు అందించడానికి నిరాకరించింది. అలాగే మార్కెట్లో అందుబాటులో ఉన్న కరెంట్ పోర్ట్ ఫోలియో లో విక్రయాలకుఎలాంటి ఆటంకం ఉండదని వివరించింది. ఈ హెచ్చరికల కారణంగా సమస్య పరిష్కారమయ్యేంతవరకూ యూఎస్‌ఎఫ్‌డీఏ నుంచి మార్టన్ గ్రోవ్‌కు ఎలాంటి కొత్త అనుమతులూ లభించబోవు. ఈ ప్రకటనతో అసలే వీక్ గా ఉన్నీ కౌంటర్లో అమ్మకాలకు తెరలేచింది. దీంతో దాదాపు 7శాతం నష్టపోయింది.
కాగా గత ఏడాది వొకార్డ్‌కు చెందిన యూకే అనుబంధ సంస్థ సీపీ ఫార్మాస్యూటికల్స్‌కు యూఎస్ ఎఫ్‌ఢీఏ నుంచి ఇలాంటి హెచ్చరికలు అందాయి. కాగా 2014లో క్వాలిఫైడ్ ఇన్‌ఫెక్షియస్ డిసీజ్ ప్రొడక్ట్ (క్యుఐడిపి) హోదా పొందిన తొలి భారతీయ కంపెనీగా వొకార్డ్ చరిత్ర సృష్టించింది.