women population
-
ప్రతి ఏటా 4.6 లక్షల మరణాలు
న్యూఢిల్లీ: సృష్టికి మూలం స్త్రీ అంటారు. ఆడది లేకపోతే మానవజాతి మనుగడే కష్టం అంటారు. అమ్మవారిగా పూజిస్తారు.. అదే ఆడపిల్లగా పుడితే మాత్రం చీదరించుకుంటారు. తల్లి గర్భం నుంచి భూమాత ఓడి చేరేంత వరకు ఆడవారు ఎన్ని కష్టాలు దాటాలో. అసలు అమ్మ కడుపు నుంచి బయటకు రాకుండానే రాలిపోతున్న ప్రాణాలు ఎన్నో. భూమ్మిద పడ్డాక కనిపించకుండా పోతున్న స్త్రీల సంఖ్య లక్షల్లో ఉందంటేనే పరిస్థితి ఎంత భయంకరంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. పాశ్చాత్య దేశాల సంగతి పక్కన పెడితే.. స్త్రీని ఆదిపరాశక్తిగా కొలిచే మన దేశంలో శతాబ్దాలుగా ఆడవారి పట్ల చిన్న చూపు.. చులకన భావం. ఎన్ని చట్టాలు వచ్చినా.. ఎంత అభివృద్ది సాధించిన ఈ తారతమ్యాలు మాత్రం తొలగడం లేదు. యూనైటెడ్ పాపులేషన్ ఫండ్ నివేదిక చూస్తే ఈ మాటలు వాస్తవం అని మరోసారి రుజువు అవుతుంది. యూఎన్ఎఫ్పీఏ 2020 స్టేట్ ఆఫ్ వరల్డ్ పాపులేషన్ నివేదిక ప్రకారం ప్రతి సంవత్సరం భారతదేశం నుంచి 46 లక్షల మంది మహిళలు తప్పిపోతున్నారని తెలిపింది. అందులో 4.6 లక్షల మంది బాలికలు లింగవివక్షత కారణంగా తల్లి గర్భంలోనే లేక పురిట్లోనే కన్ను మూస్తున్నారని వెల్లడించింది. ఈ నివేదిక ప్రకారం భారత్ ఇప్పటికి కూడా మహిళలకు అత్యంత అసురక్షిత దేశాల్లో ఒకటిగా పేర్కొనడం శోచనియం. పుట్టుకలోనే తప్పిపోవడం బాలికల నిష్పత్తిని పెంచడం కోసం గత ఆరు సంవత్సరాలుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భేటీ బచావో.. భేటీ పడావో వంటి పథకాలేన్నో తీసుకొచ్చాయి. కానీ పరిస్థితుల్లో మాత్రం పెద్దగా మార్పు రాలేదు. స్టేట్ ఆఫ్ వరల్డ్ పాపులేషన్(ఎస్‌డబ్ల్యూఓపీ-స్వాప్) యూఎన్ఎఫ్పీఏ 2020 నివేదిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా జెండర్ బేస్డ్ సెక్స్ సెలక్షన్(జీబీఎస్ఎస్-లింగ ఆధారిత ఎంపిక) వల్ల 142 మిలియన్ల మంది ఆడపిల్లలు తప్పిపోతుండగా వీరిలో 46 మిలియన్ల మంది భారతదేశం నుంచే ఉండటం ఆందోళన కల్గించే అంశం. మరి దారుణం ఏంటంటే దాదాపు 4.6 లక్షల మంది బాలికలు తల్లి గర్భంలోనే లేక పుట్టిన వెంటనే కనిపించకుండా(అంటే చంపడం, వదిలించుకోవడం) పోతున్నారని ఈ నివేదిక తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా పురిట్లోనే కనిపించకుండా పోతున్న ప్రతి ముగ్గురు ఆడపిల్లల్లో ఇద్దరు భారతదేశానికి చెందిన వారే కావడం ఆందోళన కల్గిస్తుంది. ప్రతి ఏట ప్రపంచవ్యాప్తంగా జీబీఎస్ఎస్ వల్ల 12 లక్షల మంది ఆడపిల్లలు కనిపించకుండా పోతుండగా.. వీరిలో 40 శాతం మందితో భారత్ రెండో స్థానంలో ఉండగా.. 50 శాతంతో చైనా ప్రథమ స్థానంలో ఉంది. లింగవివక్షతకు వ్యతిరేంకగా ఎన్ని చట్టాలు చేసినా ప్రయోజనం లేదని ఈ నివేదిక వెల్లడిస్తుంది. స్వాప్ నివేదిక ప్రకారం 2016-2018 సంవత్సరానికి గాను ప్రతి 1,000 మంది అబ్బాయిలకు 899 మంది బాలికలు ఉన్నట్లు పేర్కొన్నది. హర్యానాతో సహా తొమ్మిది రాష్ట్రాల్లో(ఉత్తరాఖండ్, ఢిల్లీ, గుజరాత్, రాజస్థాన్, ఉత్తర ప్రదేశ్, మహారాష్ట్ర, పంజాబ్, బిహార్) బాలికల సంఖ్య 900 కన్నా తక్కువ ఉందని నివేదిక తెలిపింది. బాల్య వివాహం, ఇతర వివక్షలు జీబీఎస్ఎస్ మాత్రమే కాక భారతదేశంలో బాలికలు బాల్య వివాహం, కట్నం, గృహ హింసతో పాటు లైంగిక వేధింపులు వంటి ఇతర లింగ ఆధారిత దురాగతాలకు గురవుతున్నారని నివేదిక తెలుపుతోంది. నేషనల్ హెల్త్ అండ్ ఫ్యామిలీ 2015-16 సర్వే గణాంకాల ప్రకారం, భారతదేశంలో ప్రతి నలుగురు అమ్మాయిల్లో ఒకరికి 18 ఏళ్ళలోపే వివాహం జరిగినట్లు నివేదిక వెల్లడించింది. అంతేకాక 20-24 సంవత్సరాల మధ్య వయస్సు గల మహిళలలో 26.8 శాతం మంది 18 సంవత్సరాల వయస్సులోపు వివాహం చేసుకున్నారని నివేదిక తెలిపింది. బాల్య వివాహాలు ఎక్కువగా జరుగుతున్న ఐదు రాష్ట్రాల నుంచి దాదాపు 8,000 మంది మహిళలపై ఎన్హెచ్ఏఎఫ్ నిర్వహించిన ఈ సర్వేలో 18 ఏళ్ళకు ముందే వివాహం చేసుకున్న బాలికలలో 32 శాతం మంది వారి భర్త చేతిలో శారీరక హింసకు గురయినట్లు వెల్లడించింది. అంతేకాక 15 నుంచి 19 సంవత్సరాల మధ్య వయస్సు గల నలుగురు వివాహితల్లో ఒకరు తన భర్త నుంచి లైంగిక హింసను అనుభవించినట్లు సర్వే వెల్లడించింది. బాల్యవివాహాల డాటా వేర్వేరు రాష్ట్రాల్లో వేర్వేరుగా ఉంది. ఉదాహరణకు బిహార్,పశ్చిమ బెంగాల్లో ప్రతి ముగ్గురు బాలికలలో ఇద్దరికి 18 ఏళ్ల లోపే వివాహం కాగా.. ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, జార్ఖండ్ రాష్ట్రాల్లో ముగ్గురిలో ఒకరికి బాల్య వివాహం జరిగినట్లు సర్వే వెల్లడించింది. అబ్బాయే ముద్దు.. ఆడపిల్ల వద్దు భారతదేశంలో కొడుకు అంటే వల్లమాలిన అభిమానం. ఆడపిల్ల పుడితే పెంచి, పెద్ద చేసి కట్నం ఇచ్చి ఒకరింటికి పంపాలి. అదే కొడుకయితే.. ఖర్చు పెట్టినప్పటికి కట్నం వస్తుందనే ఉద్దేశంతో భారతీయులు కొడుకు పట్ల వల్లమాలిన అభిమానం ప్రదర్శిస్తారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ ధోరణి వల్లే ఇండియాలో ఆడపిల్లల సంఖ్య బాలుర కంటే తక్కువగా ఉంటుంది. బాల్య వివాహాలకు ఇది కూడా ఓ కారణం అవుతుందని సర్వే తెలిపింది. ప్రస్తుతం చిన్న కుటుంబాలు ఏర్పడటం.. ఆదాయం పెరగటంతో పట్టణాల్లో లింగనిర్థారణ పరీక్షలు ఎక్కువగా జరుగుతున్నాయి. గర్భంలో ఉన్నది ఆడపిల్లని తెలిస్తే.. వెంటనే హతమారుస్తున్నారు. ఒక్క భారతదేశంలోనే కాదని ప్రపంచవ్యాప్తంగా ఇదే పద్దతి కొనసాగుతుందని నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా 142 మిలియన్ల మంది ఆడపిల్లలు తప్పిపోతుండగా.. వీరిలో భారత్‌కు చెదిన వారే 46 మిలియన్ల మంది ఉండటం శోచనీయం. తల్లిదండ్రుల ఆలోచన విధానంలో మార్పు వస్తేనే ఆడపిల్లల మనుగడ కొనసాగుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇందుకు నిదర్శనంగా గత కొన్ని సంవత్సరాలుగా దేశంలో బాల్య వివాహాలు తగ్గుముఖం పట్టాయని.. ఉన్నత విద్యనభ్యసించే బాలికల సంఖ్య కూడా పెరిగిందని నివేదిక తెలిపింది. అయితే కరోనా మహమ్మారి కారణంగా ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా మహిళల సంక్షేమం కోసం చేపట్టిన కార్యక్రమాలు కుంటుపడుతున్నట్లు ఐక్యరాజ్య సమితి ఆందోళన వ్యక్తం చేసింది. -
చైనాను భయపెడుతున్న మహిళల సంఖ్య
2019 సంవత్సరం అంతానికి చైనా జనాభా 140.05 కోట్లకు చేరుకుందని ఆ దేశ జాతీయ గణాంకాల విభాగం శుక్రవారం ప్రకటించింది. చైనాలో కమ్యూనిస్టు పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఆ దేశంలో శిశు జననాలు ఎన్నడు లేనంతగా కనిష్ట స్థాయికి చేరుకున్నప్పటికీ జనాభా 140 కోట్లను దాటింది. చైనాలో గత మూడేళ్లుగా శిశు జననాల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తోంది. దీని వల్ల చైనాలో స్త్రీ, పురుషుల సంఖ్య మధ్య వ్యత్యాసం పెరుగుతూ వస్తోంది. ప్రస్తుతం అక్కడ స్త్రీలకన్నా పురుషులు మూడు కోట్ల మంది ఎక్కువగా ఉన్నారు. స్త్రీ, పురుషుల మధ్య వ్యత్యాసం ఎక్కువైతే పరిణామాలు ప్రమాదకరంగా ఉంటాయన్న విషయాన్ని గ్రహించిన చైనా ప్రభుత్వం స్త్రీల సంతానాన్ని ప్రోత్సహించడం కోసం 40 ఏళ్లపాటు అమలు చేసిన ఏక సంతాన విధానాన్ని ఎత్తివేసింది. అయినప్పటికీ ఇప్పటికీ మూడు కోట్ల వ్యత్యాసం ఉండడం పట్ల ఆందోళన వ్యక్తం చేసింది. శిశు జననాల సంఖ్య ప్రతి వెయ్యికి 10.48కి పడిపోయింది. అక్కడి మొత్తం జనాభాలో 18.1 శాతం మంది 60 ఏళ్లు దాటిన వారు ఉండడంతో పనిచేసే జనాభా సంఖ్య కూడా తగ్గిపోయింది. చైనా నిబంధనల ప్రకారం 16 నుంచి 59 ఏళ్ల వరకే పని చేయడానికి అవకాశం. 59 ఏళ్లు నిండగానే పదవీ విరమణ చేయాల్సిందే. 60 ఏళ్లు దాటిన సంఖ్య పెరగడంతో పనిచేసే వారి సంఖ్య తగ్గుతూ వస్తోంది. భారత్ జనాభా 130 కోట్లకు చేరుకుందన్న విషయం తెల్సిందే. -
‘అమ్మ’కు ప్రాణం
సిద్దిపేటలో మహిళా జనాభే అధికం గణాంకాల ప్రకారం.. సిద్దిపేట జిల్లాలో మొత్తం 1.48 లక్షల మంది గిరిజనులు ఉన్నారు. ఇందులో 73 వేల మంది పురుషులు, 75 వేల మంది స్త్రీలు ఉన్నారు. బాలబాలికలూ ఇదే నిష్పత్తిలో ఉన్నట్లు అధికారిక నివేదికలు చెప్తున్నాయి. సాక్షి, హైదరాబాద్: ‘యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతి తత్ర దేవతా..’.. అంటే ఎక్కడైతే స్త్రీలు పూజించబడతారో అక్కడ దేవతలు కొలువుంటారని అర్థం. దీనిని ఆచరించేవాళ్లు తక్కువ. ఎక్కడ చూసినా మహిళలపై వివక్ష కనిపిస్తోంది. కానీ నాగరికపు పోకడ తెలియని గిరిపుత్రులు మాత్రం ఆడబిడ్డల పట్ల ఆదరణ కనబరుస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. ‘‘హమా గర్యో ఏక్ బేటీ రతో లక్ష్మి.. భగవాన్ దినజకునో బేటీ (మన ఇంట్లో ఒక ఆడపిల్ల ఉంటేనే లక్ష్మి.. ఆడపిల్ల అంటే దేవుడు ఇచ్చిన బిడ్డ)’’.. అంటూ ఆదర్శంగా నిలుస్తున్నారు. కొడుకు కావాలన్న కోరికతో ఆడపిల్లను పురిట్లోనే చిదిమేస్తున్న సామాజిక ‘అనాగరికుల’ కళ్లు తెరిపిస్తున్నారు. దీంతో ఇటీవలి కాలంలో రాష్ట్రంలోని గిరిజన ప్రాంతాల్లో స్త్రీల శాతం పెరుగుతూ వస్తోంది. పురుషులను మించి.. రాష్ట్రంలోని గిరిజన ప్రాంతాలు, మారుమూల ప్రాంతా ల్లో గత దశాబ్దకాలంగా స్త్రీ, పురుషుల నిష్పత్తిలో తేడా తగ్గుతూ వస్తోంది. కొన్ని చోట్ల అయితే పురుషుల కన్నా స్త్రీల శాతం పెరగడం గమనార్హం. గిరిజనులు స్త్రీ, పురుష వివక్షను జయించడం, మగ పిల్లలే కావాలన్న వైఖరిని విడనాడడం, అసలు ఆడపిల్ల పుడితే అదృష్టమన్న భావన పెంపొందించుకోవడమే దీనికి కారణం. దీంతో రాష్ట్రంలో ఐదు జిల్లాల్లోని గిరిజనుల్లో పురు షుల కంటే మహిళా జనాభాయే ఎక్కువగా ఉండగా.. మిగతా జిల్లాల్లో పురుషులతో సమానంగా ఉన్నారు. ఇటీవల అధికారులు సేకరించిన లెక్కల ప్రకారం రాష్ట్రంలో మొత్తం 36.22 లక్షల మంది గిరిజనులు ఉన్నారు. ఇందులో 18.12 లక్షల మంది పురుషులు, 18.10 లక్షల మంది స్త్రీలు ఉన్నారు. గిరిజన బాలబాలికలూ ఇదే నిష్ప త్తిలో ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. మంచి ప్రయోజకులను చేస్తాం ‘‘హమారా తీన్ చార్వీన్ చారాలానే కేలేరే.. కష్టమ్ కరన్ జాదా సదువుల్ సదువారేచా.. (మా ముగ్గురు అమ్మాయిలను అబ్బాయిల్లాగానే పెంచుతున్నాం. కష్టపడైనా ఉన్నత చదువులు చదివిస్తున్నం..). ఆడపిల్లలైనా వారు మా కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉంటున్నారు. వారిని మేం ఏనాడూ భారంగా చూడలేదు. మంచి ప్రయోజకులను చేయాలనుకుంటున్నాం..’’ – గుగులోతు తులసీ మా ఇంటి దేవతలు ‘కూలీ కామ్ కరన్ హమార్ చార్వీన్.. గరేన్ దాడ్ కాడ్రేచా.. (రోజూ కూలీ పనిచేస్తూ మా అమ్మాయిలను, మా కుటుంబాన్ని పోషిం చుకుంటున్నాం).’ మాకు సంధ్య, శ్యామల, గౌతమి ముగ్గురు బిడ్డలు. వారే మా ఇంటి దేవతలు. వ్యవసాయం నీట మునిగి పోయింది. కూలీ పనులు చేసుకుంటూ మా బిడ్డలను చదివిస్తున్నాం..’’ – భూక్యా బుజ్జి ఆడపిల్లలు అయితే ఏంటి? ‘‘మార్ గరేవాలో పక్షవాతం రోగేతీ టాంగ్, హాత్ పడిగే.. ఏతీ హమార్ ఘర్ మై ఏక్ దాడ్ కామేన్నాజాంతో.. భుకేతీ సోయేర్ పరిస్థిత్. దిన దినమ్ కామ్ కరన్.. ఘర్ ఏళ్ళ దీస్రీ.. తీన్ చార్వీన్ సదువారీ.. (మా ఇంటి పెద్దాయనకు పక్షవాతంతో కాళ్లు చేతులు పడిపోయినయ్. రోజూ పనిచేస్తూ కుటుంబాన్ని వెల్లదీసుకుంటున్నా. మాకు ముగ్గురు ఆడపిల్లలు కరుణ, స్వప్న, అనూష ఉన్నారు. ఆడపిల్లలు అయితే ఏంటి. వాళ్లను బాగా చదివిస్తున్నా..’’ – గుగులోతు కమల మొత్తం గిరిజనులు 36.22 లక్షలు పురుషులు 18.12 లక్షలు మహిళలు 18.10 లక్షలు -
ఓటర్లలో సగం కన్నా ఎక్కువే.. అయినా!
ఈశాన్య రాష్ట్రాల్లో మహిళా జనాభా అధికంగా ఉంటుంది. మణిపూర్, మిజోరం, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాలలో అయితే పురుషుల జనాభా కన్న మహిళల జనాభానే అధికం. ఈశాన్య రాష్ట్రాల ఓటర్లలోనూ 50%పైగా మహిళలే ఉన్నారు. అయినా వారికి రాజకీయ ప్రాతినిధ్యం చాలా తక్కువ. ఈశాన్య రాష్ట్రాల మహిళలు రాజకీయంగానూ, సామాజికంగానూ చురుకైన పాత్రే పోషిస్తున్నప్పటికీ.. ఎన్నికలో పోటీ చేసే అవకాశం రాజకీయ పార్టీలు ఇవ్వలేదు. ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో ఏడు ఈశాన్య రాష్ట్రాలైన అస్సాం(14 లోక్‌సభ స్థానాలు), అరుణాచల్ ప్రదేశ్(2), మేఘాలయ(2), మణిపూర్(2), త్రిపుర(2), నాగాలాండ్(1), మిజోరం(1)లలో మొత్తం 235 మంది అభ్యర్ధులు బరిలో ఉండగా, వారిలో 22 మంది మాత్రమే మహిళలు. అంటే కేవలం 9.36%. అరుణాచల్‌ప్రదేశ్, మిజోరం, నాగాలాండ్‌లలో అయితే ఒక్క మహిళా అభ్యర్థి కూడా పోటీలో లేరు.