సిద్దిపేటలో మహిళా జనాభే అధికం
గణాంకాల ప్రకారం.. సిద్దిపేట జిల్లాలో మొత్తం 1.48 లక్షల మంది గిరిజనులు ఉన్నారు. ఇందులో 73 వేల మంది పురుషులు, 75 వేల మంది స్త్రీలు ఉన్నారు. బాలబాలికలూ ఇదే నిష్పత్తిలో ఉన్నట్లు అధికారిక నివేదికలు చెప్తున్నాయి.
సాక్షి, హైదరాబాద్: ‘యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతి తత్ర దేవతా..’.. అంటే ఎక్కడైతే స్త్రీలు పూజించబడతారో అక్కడ దేవతలు కొలువుంటారని అర్థం. దీనిని ఆచరించేవాళ్లు తక్కువ. ఎక్కడ చూసినా మహిళలపై వివక్ష కనిపిస్తోంది. కానీ నాగరికపు పోకడ తెలియని గిరిపుత్రులు మాత్రం ఆడబిడ్డల పట్ల ఆదరణ కనబరుస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. ‘‘హమా గర్‌యో ఏక్ బేటీ రతో లక్ష్మి.. భగవాన్ దినజకునో బేటీ (మన ఇంట్లో ఒక ఆడపిల్ల ఉంటేనే లక్ష్మి.. ఆడపిల్ల అంటే దేవుడు ఇచ్చిన బిడ్డ)’’.. అంటూ ఆదర్శంగా నిలుస్తున్నారు. కొడుకు కావాలన్న కోరికతో ఆడపిల్లను పురిట్లోనే చిదిమేస్తున్న సామాజిక ‘అనాగరికుల’ కళ్లు తెరిపిస్తున్నారు. దీంతో ఇటీవలి కాలంలో రాష్ట్రంలోని గిరిజన ప్రాంతాల్లో స్త్రీల శాతం పెరుగుతూ వస్తోంది.
పురుషులను మించి..
రాష్ట్రంలోని గిరిజన ప్రాంతాలు, మారుమూల ప్రాంతా ల్లో గత దశాబ్దకాలంగా స్త్రీ, పురుషుల నిష్పత్తిలో తేడా తగ్గుతూ వస్తోంది. కొన్ని చోట్ల అయితే పురుషుల కన్నా స్త్రీల శాతం పెరగడం గమనార్హం. గిరిజనులు స్త్రీ, పురుష వివక్షను జయించడం, మగ పిల్లలే కావాలన్న వైఖరిని విడనాడడం, అసలు ఆడపిల్ల పుడితే అదృష్టమన్న భావన పెంపొందించుకోవడమే దీనికి కారణం. దీంతో రాష్ట్రంలో ఐదు జిల్లాల్లోని గిరిజనుల్లో పురు షుల కంటే మహిళా జనాభాయే ఎక్కువగా ఉండగా.. మిగతా జిల్లాల్లో పురుషులతో సమానంగా ఉన్నారు. ఇటీవల అధికారులు సేకరించిన లెక్కల ప్రకారం రాష్ట్రంలో మొత్తం 36.22 లక్షల మంది గిరిజనులు ఉన్నారు. ఇందులో 18.12 లక్షల మంది పురుషులు, 18.10 లక్షల మంది స్త్రీలు ఉన్నారు. గిరిజన బాలబాలికలూ ఇదే నిష్ప త్తిలో ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి.
మంచి ప్రయోజకులను చేస్తాం
‘‘హమారా తీన్ చార్వీన్ చారాలానే కేలేరే.. కష్టమ్ కరన్ జాదా సదువుల్ సదువారేచా.. (మా ముగ్గురు అమ్మాయిలను అబ్బాయిల్లాగానే పెంచుతున్నాం. కష్టపడైనా ఉన్నత చదువులు చదివిస్తున్నం..). ఆడపిల్లలైనా వారు మా కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉంటున్నారు. వారిని మేం ఏనాడూ భారంగా చూడలేదు. మంచి ప్రయోజకులను చేయాలనుకుంటున్నాం..’’
– గుగులోతు తులసీ
మా ఇంటి దేవతలు
‘కూలీ కామ్ కరన్ హమార్ చార్వీన్.. గరేన్ దాడ్ కాడ్రేచా.. (రోజూ కూలీ పనిచేస్తూ మా అమ్మాయిలను, మా కుటుంబాన్ని పోషిం చుకుంటున్నాం).’ మాకు సంధ్య, శ్యామల, గౌతమి ముగ్గురు బిడ్డలు. వారే మా ఇంటి దేవతలు. వ్యవసాయం నీట మునిగి పోయింది. కూలీ పనులు చేసుకుంటూ మా బిడ్డలను చదివిస్తున్నాం..’’
– భూక్యా బుజ్జి
ఆడపిల్లలు అయితే ఏంటి?
‘‘మార్ గరేవాలో పక్షవాతం రోగేతీ టాంగ్, హాత్ పడిగే.. ఏతీ హమార్ ఘర్ మై ఏక్ దాడ్ కామేన్‌నాజాంతో.. భుకేతీ సోయేర్ పరిస్థిత్. దిన దినమ్ కామ్ కరన్.. ఘర్ ఏళ్ళ దీస్రీ.. తీన్ చార్వీన్ సదువారీ.. (మా ఇంటి పెద్దాయనకు పక్షవాతంతో కాళ్లు చేతులు పడిపోయినయ్. రోజూ పనిచేస్తూ కుటుంబాన్ని వెల్లదీసుకుంటున్నా. మాకు ముగ్గురు ఆడపిల్లలు కరుణ, స్వప్న, అనూష ఉన్నారు. ఆడపిల్లలు అయితే ఏంటి. వాళ్లను బాగా చదివిస్తున్నా..’’
– గుగులోతు కమల
మొత్తం గిరిజనులు 36.22 లక్షలు
పురుషులు 18.12 లక్షలు
మహిళలు 18.10 లక్షలు
Comments
Please login to add a commentAdd a comment