ప్రతి ఏటా 4.6 లక్షల మరణాలు | In India 4 Lakh Sixty Thousand Girls Go Missing at Birth | Sakshi
Sakshi News home page

మహిళలకు అత్యంత ప్రమాదకర దేశంగా భారత్‌

Published Tue, Jun 30 2020 1:42 PM | Last Updated on Tue, Jun 30 2020 2:52 PM

In India 4 Lakh Sixty Thousand Girls Go Missing at Birth - Sakshi

న్యూఢిల్లీ: సృష్టికి మూలం స్త్రీ అంటారు. ఆడది లేకపోతే మానవజాతి మనుగడే కష్టం అంటారు. అమ్మవారిగా పూజిస్తారు.. అదే ఆడపిల్లగా పుడితే మాత్రం చీదరించుకుంటారు. తల్లి గర్భం నుంచి భూమాత ఓడి చేరేంత వరకు ఆడవారు ఎన్ని కష్టాలు దాటాలో. అసలు అమ్మ కడుపు నుంచి బయటకు రాకుండానే రాలిపోతున్న ప్రాణాలు ఎన్నో. భూమ్మిద పడ్డాక కనిపించకుండా పోతున్న స్త్రీల సంఖ్య లక్షల్లో ఉందంటేనే పరిస్థితి ఎంత భయంకరంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. పాశ్చాత్య దేశాల సంగతి పక్కన పెడితే.. స్త్రీని ఆదిపరాశక్తిగా కొలిచే మన దేశంలో శతాబ్దాలుగా ఆడవారి పట్ల చిన్న చూపు.. చులకన భావం. ఎన్ని చట్టాలు వచ్చినా.. ఎంత అభివృద్ది సాధించిన ఈ తారతమ్యాలు మాత్రం తొలగడం లేదు. 

యూనైటెడ్‌ పాపులేషన్‌ ఫండ్‌ నివేదిక చూస్తే ఈ మాటలు వాస్తవం అని మరోసారి రుజువు అవుతుంది. యూఎన్‌ఎఫ్‌పీఏ 2020 స్టేట్ ఆఫ్ వరల్డ్ పాపులేషన్ నివేదిక ప్రకారం ప్రతి సంవత్సరం భారతదేశం నుంచి 46 లక్షల మంది మహిళలు తప్పిపోతున్నారని తెలిపింది. అందులో 4.6 లక్షల మంది బాలికలు లింగవివక్షత కారణంగా తల్లి గర్భంలోనే లేక పురిట్లోనే కన్ను మూస్తున్నారని వెల్లడించింది. ఈ నివేదిక ప్రకారం భారత్‌ ఇప్పటికి కూడా మహిళలకు అత్యంత అసురక్షిత దేశాల్లో ఒకటిగా పేర్కొనడం శోచనియం.

పుట్టుకలోనే తప్పిపోవడం
బాలికల నిష్పత్తిని పెంచడం కోసం గత ఆరు సంవత్సరాలుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భేటీ బచావో.. భేటీ పడావో వంటి పథకాలేన్నో తీసుకొచ్చాయి. కానీ పరిస్థితుల్లో మాత్రం పెద్దగా మార్పు రాలేదు. స్టేట్‌ ఆఫ్‌ వరల్డ్‌ పాపులేషన్‌(ఎస్‌డబ్ల్యూఓపీ-స్వాప్‌) యూఎన్‌ఎఫ్‌పీఏ 2020 నివేదిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా జెండర్‌ బేస్డ్‌ సెక్స్‌ సెలక్షన్‌(జీబీఎస్‌ఎస్‌-లింగ ఆధారిత ఎంపిక) వల్ల 142 మిలియన్ల మంది ఆడపిల్లలు తప్పిపోతుండగా వీరిలో 46 మిలియన్ల మంది భారతదేశం నుంచే ఉండటం ఆందోళన కల్గించే అంశం. మరి దారుణం ఏంటంటే దాదాపు 4.6 లక్షల మంది బాలికలు తల్లి గర్భంలోనే లేక పుట్టిన వెంటనే కనిపించకుండా(అంటే చంపడం, వదిలించుకోవడం) పోతున్నారని ఈ నివేదిక తెలిపింది. 

ప్రపంచవ్యాప్తంగా పురిట్లోనే కనిపించకుండా పోతున్న ప్రతి ముగ్గురు ఆడపిల్లల్లో ఇద్దరు భారతదేశానికి చెందిన వారే కావడం ఆందోళన కల్గిస్తుంది. ప్రతి ఏట ప్రపంచవ్యాప్తంగా జీబీఎస్‌ఎస్‌ వల్ల 12 లక్షల మంది ఆడపిల్లలు కనిపించకుండా పోతుండగా.. వీరిలో 40 శాతం మందితో భారత్‌ రెండో స్థానంలో ఉండగా.. 50 శాతంతో చైనా ప్రథమ స్థానంలో ఉంది. లింగవివక్షతకు వ్యతిరేంకగా ఎన్ని చట్టాలు చేసినా ప్రయోజనం లేదని ఈ నివేదిక వెల్లడిస్తుంది. స్వాప్‌ నివేదిక ప్రకారం 2016-2018 సంవత్సరానికి గాను ప్రతి 1,000 మంది అబ్బాయిలకు 899 మంది బాలికలు ఉన్నట్లు పేర్కొన్నది. హర్యానాతో సహా తొమ్మిది రాష్ట్రాల్లో(ఉత్తరాఖండ్, ఢిల్లీ, గుజరాత్, రాజస్థాన్, ఉత్తర ప్రదేశ్, మహారాష్ట్ర, పంజాబ్, బిహార్) బాలికల సంఖ్య 900 కన్నా తక్కువ ఉందని నివేదిక తెలిపింది.

బాల్య వివాహం, ఇతర వివక్షలు
జీబీఎస్ఎస్ మాత్రమే కాక భారతదేశంలో బాలికలు బాల్య వివాహం, కట్నం, గృహ హింసతో పాటు లైంగిక వేధింపులు వంటి ఇతర లింగ ఆధారిత దురాగతాలకు గురవుతున్నారని నివేదిక తెలుపుతోంది. నేషనల్ హెల్త్ అండ్ ఫ్యామిలీ 2015-16 సర్వే గణాంకాల ప్రకారం, భారతదేశంలో ప్రతి నలుగురు అమ్మాయిల్లో ఒకరికి 18 ఏళ్ళలోపే వివాహం జరిగినట్లు నివేదిక వెల్లడించింది. అంతేకాక 20-24 సంవత్సరాల మధ్య వయస్సు గల మహిళలలో 26.8 శాతం మంది 18 సంవత్సరాల వయస్సులోపు వివాహం చేసుకున్నారని నివేదిక తెలిపింది. 

బాల్య వివాహాలు ఎక్కువగా జరుగుతున్న ఐదు రాష్ట్రాల నుంచి దాదాపు 8,000 మంది మహిళలపై ఎన్‌హెచ్‌ఏఎఫ్‌ నిర్వహించిన ఈ సర్వేలో 18 ఏళ్ళకు ముందే వివాహం చేసుకున్న బాలికలలో 32 శాతం మంది వారి భర్త చేతిలో శారీరక హింసకు గురయినట్లు వెల్లడించింది. అంతేకాక 15 నుంచి 19 సంవత్సరాల మధ్య వయస్సు గల నలుగురు వివాహితల్లో ఒకరు తన భర్త నుంచి లైంగిక హింసను అనుభవించినట్లు సర్వే వెల్లడించింది.  బాల్యవివాహాల డాటా వేర్వేరు రాష్ట్రాల్లో వేర్వేరుగా ఉంది. ఉదాహరణకు బిహార్,పశ్చిమ బెంగాల్‌లో ప్రతి ముగ్గురు బాలికలలో ఇద్దరికి 18 ఏళ్ల లోపే వివాహం కాగా.. ఆంధ్రప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌, జార్ఖండ్‌ రాష్ట్రాల్లో ముగ్గురిలో ఒకరికి బాల్య వివాహం జరిగినట్లు సర్వే వెల్లడించింది.

అబ్బాయే ముద్దు.. ఆడపిల్ల వద్దు
భారతదేశంలో కొడుకు అంటే వల్లమాలిన అభిమానం. ఆడపిల్ల పుడితే పెంచి, పెద్ద చేసి కట్నం ఇచ్చి ఒకరింటికి పంపాలి. అదే కొడుకయితే.. ఖర్చు పెట్టినప్పటికి కట్నం వస్తుందనే ఉద్దేశంతో భారతీయులు కొడుకు పట్ల వల్లమాలిన అభిమానం ప్రదర్శిస్తారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ ధోరణి వల్లే ఇండియాలో ఆడపిల్లల సంఖ్య బాలుర కంటే తక్కువగా ఉంటుంది. బాల్య వివాహాలకు ఇది కూడా ఓ కారణం అవుతుందని సర్వే తెలిపింది. ప్రస్తుతం చిన్న కుటుంబాలు ఏర్పడటం.. ఆదాయం పెరగటంతో పట్టణాల్లో లింగనిర్థారణ పరీక్షలు ఎక్కువగా జరుగుతున్నాయి. గర్భంలో ఉన్నది ఆడపిల్లని తెలిస్తే.. వెంటనే హతమారుస్తున్నారు. ఒక్క భారతదేశంలోనే కాదని ప్రపంచవ్యాప్తంగా ఇదే పద్దతి కొనసాగుతుందని నివేదికలు వెల్లడిస్తున్నాయి. 

ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా 142 మిలియన్ల మంది ఆడపిల్లలు తప్పిపోతుండగా.. వీరిలో భారత్‌కు చెదిన వారే 46 మిలియన్ల మంది ఉండటం శోచనీయం. తల్లిదండ్రుల ఆలోచన విధానంలో మార్పు వస్తేనే ఆడపిల్లల మనుగడ కొనసాగుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇందుకు నిదర్శనంగా గత కొన్ని సంవత్సరాలుగా దేశంలో బాల్య వివాహాలు తగ్గుముఖం పట్టాయని.. ఉన్నత విద్యనభ్యసించే బాలికల సంఖ్య కూడా పెరిగిందని నివేదిక తెలిపింది. అయితే కరోనా మహమ్మారి కారణంగా ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా మహిళల సంక్షేమం కోసం చేపట్టిన కార్యక్రమాలు కుంటుపడుతున్నట్లు ఐక్యరాజ్య సమితి ఆందోళన వ్యక్తం చేసింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement