Womens Cricket Tournament
-
ఆశలు ఉన్నవాళ్లు
కాళ్లు లేవు. కాలినడకన వస్తాం అని మొక్కుకోకూడదా? వేళ్లు లేవు. వీణపై స్వరాలను పలికించాలన్న తపన ఉండకూడదా? మాట లేదు. ప్రతిధ్వనించేలా నినదించాలని ఆవేశపడకూడదా? వినికిడి లేదు. విశ్వాంతరాళ హోరుకు విష్ణుమూర్తిలా చెవి వొగ్గకూడదా? చూపు లేదు. సిక్సర్లు కొట్టాలని, క్యాచ్‌లు పట్టేయాలని ఉత్సాహపడకూడదా? బ్రియాన్ లారా వెస్టిండీస్ క్రికెటర్. ప్రపంచ క్రికెట్ చరిత్రను తూకం వేస్తే ఆ తూగే బరువులో ఆయన కాస్త ఎక్కువగానే ఉంటారు. ఐదడుగులా ఎనిమిది అంగుళాల ఎత్తు ఉన్నందువల్ల, ర్యాంకింగ్‌లు– రికార్డులు ఏవో ఉంటాయి ఈ క్రికెట్వాళ్లకు.. అవి సమృద్ధిగా ఉన్నందువల్ల, ఒబామా అమెరికా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు వెస్టిండీస్‌లో పర్యటిస్తూ అక్కడుండే లారాను వెతుక్కుంటూ వెళ్లి కలిసినందువల్ల, తన చిట్టచివరి వన్డే ఇంటర్నేషనల్‌లో ఆట అవుతున్నంతసేపూ ‘లారా.. లారా.. లారా..’ అని పిచ్‌లో ప్రకంపనలు రేపిన ఫ్యాన్స్ వైపు ఆటంతా అయ్యాక చేతులు చాస్తూ.. ‘డిడ్ ఐ ఎంటర్టైన్?’ అని అడిగినందు వల్లా.. క్రమంగా పెరుగుతూ వచ్చిన బరువు కావచ్చది. యాభై ఏళ్ల మనిషి. ఆరేళ్ల వయసున్నప్పటి నుంచి ఆడిన మనిషి. పన్నెండేళ్ల క్రితం రిటైర్ అయిన మనిషి. రిటైర్ అయినా బరువు ఏమాత్రం తగ్గని మనిషి. బ్రియాన్ లారానే మనం ఇంకోలా చూద్దాం. ఆయనకు కళ్లు లేవు. పుట్టు గుడ్డి. అలా అని అనుకుందాం. పదకొండు మంది సంతానంలో ఒకడైన లారాను తండ్రి ఎన్ని కళ్లతోనూ ఎంతసేపో కనిపెట్టుని ఉండలేకపోయేవాడు. లారా పుట్టిన శాంటాక్రజ్‌లో లోకల్ స్కూల్ ఒకటి ఉంది. హార్వార్డ్ కోచింగ్ క్లినిక్. ఆ క్లినిక్.. ఆరేళ్ల వయసులోనే క్రికెట్ అంటే ఆసక్తి చూపినప్పటికీ కళ్లు లేని కారణంగా లారాను చేరదీసి, ముద్దు చేయలేకపోయేది. లారా తొలి బడి సెయింట్ జోసెఫ్స్ రోమన్ కేథలిక్ ప్రైమరీ ఆ పసివాడికి అడ్మిషన్ ఇవ్వలేకపోయేది. కళ్లు లేని వాళ్ల బడి కాదు అది. సెయింట్ జువాన్ సెకండరీ స్కూలు, ఫాతిమా కాలేజీ కూడా ముఖం చాటేసేవి.. ఒకవేళ లారా స్టిక్ సహాయంతో తడుముకుంటూ తడుముకుంటూనే అంతదూరం వచ్చాడని అనుకున్నా. క్రికెట్ కోచ్ హ్యారీ రామ్‌దాస్ అంటే కూడా ప్రపంచానికిప్పుడు పెద్దగా తెలియకపోయేది. అంధుడైన లారాను లెఫ్ట్‌హ్యాండెడ్ బ్యాట్స్‌మన్‌గా, రైట్ ఆర్మ్ లెగ్ బ్రేక్ బౌలర్‌గా చెక్కడానికి ఆయనకేం పట్టేది?! లారాకు కూడా కళ్లు లేకుండా పద్నాలుగేళ్ల వయసులో స్కూల్ బాయ్స్ లీగ్‌లో ఇన్నింగ్స్‌కి సగటున 126 పరుగులు చొప్పున 745 పరుగులు తియ్యడం ఒక ఊహ మాత్రమే అయ్యేది. సాకర్ అన్నా, టేబుల్ టెన్నిస్ అన్నా కూడా లారాకు ఇష్టం. చూపులేని కారణంగా ఆ ఇష్టాలనూ చంపుకుని ఎక్కడో బతుకుతూ ఉండేవాడు! ‘నాకే ఎందుకిలా చేశావ్ దుర్మార్గుడా!’ అని దేవుణ్ణి తిట్టుకుంటూ.. తలకొట్టుకుంటూ ఉండేవాడు.. ఎవర్ని తిడుతున్నదీ స్పృహ లేకుండా. ‘‘అవును నిజంగా అలానే ఉండేవాడిని’’ అన్నాడు ఇప్పుడు ఇండియాలోనే ఉన్న బ్రియాన్ లారా. ఢిల్లీలో బ్లైండ్ ఉమెన్ డొమెస్టిక్ నేషనల్ క్రికెట్ లీగ్ పోటీలకు ముందు రెండు మాటలు మాట్లాడమని ‘క్రికెట్ అసోసియేషన్’ అడిగితే వచ్చాడు. పోటీలు సోమవారం మొదలయ్యాయి. ఫస్ట్ టైమ్ మన దగ్గర అంధ మహిళా క్రీడాకారులకు జాతీయస్థాయి పోటీలు జరగడం. ఏడు టీమ్‌లు తలపడుతున్నాయి. ఢిల్లీలోని సిరి ఫోర్ట్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో ఇవాళ ఫైనల్స్. మాట్లాడ్డానికి ముందు ఢిల్లీ టీమ్ కెప్టెన్ అంకితాసింగ్ని, తక్కిన టీమ్‌లను, టీమ్ మేట్స్నీ కలిసి విష్ చేశాడు లారా. ‘‘ఈరోజు మీ మధ్య నేను ఉండటం అనే ఫీలింగ్ నాకు చాలా వండర్ఫుల్ అనిపిస్తోంది’’ అన్నాడు ఆ తర్వాత స్టేజ్ మీద. కొంచెం ఎమోషనల్ కూడా అయ్యాడు. ‘‘నా కెరియర్ మొత్తంలో నేనేవైతే సాధించగలిగానో అవన్నీ కూడా నాకేవైతే ఉన్నాయో వాటి వలన సాధ్యమైనవే. నేనొకవేళ నాకేవైతే ఉన్నాయో వాటికి నోచుకోకపోయి ఉంటే కనుక, నా ఆశలన్నిటినీ చంపుకుని ఏ చీకటి మూలనో కూర్చొని ఉండేవాడిని’’ అని ఒక్క క్షణం ఆగి.. ‘‘అయితే ఇప్పుడనిపిస్తోంది. అలా కూర్చొని ఉండేవాడిని కాదని. నేనూ స్కూలుకు వెళ్లాలనే అనుకునేవాడిని. నేనూ నేర్చుకోవాలనే అనుకునేవాడిని. నేనూ మంచి ఉద్యోగం చేయాలనే అనుకునేవాడిని. నేనూ ఆటలు ఆడాలనే అనుకునేవాడిని’’ అన్నాడు లారా! ఆ వెంటనే ‘‘దీజ్ లేడీస్ అండ్ దెయిర్ టోర్నమెంట్ జస్ట్ అప్రోచింగ్’’ అన్నాడు. అప్రోచింగ్ అంటే నాట్ కంపేరబుల్ అని. ఈ మాటతో మళ్లీ కొద్దిగా బరువు పెరిగాడు బ్రియాన్ లారా. ఎలా ఆడతారు వీళ్లు క్రికెట్‌ని కళ్లు లేకుండా అనుకుంటాం? అసలు ఎలా ఆడాలనిపిస్తుంది వీళ్లకు క్రికెట్‌ని కళ్లు లేకుండా అనుకునేవాళ్లూ ఉండొచ్చు. ‘ఎలా ఆడతారు?’ అనే ప్రశ్నకు ఎక్కడైనా సమాచారం లభిస్తుంది. ‘ఎలా ఆడాలనిపిస్తుంది?’ అనే ప్రశ్నకు చూపుకు అందని సమాధానం మాత్రమే ఉంటుంది. -
ఖమ్మంలో జాతీయ మహిళా టీ20 ఛాపింయన్‌షిప్ టోర్నీ
-
సౌత్‌జోన్ కెప్టెన్‌గా గౌహర్ సుల్తానా
సాక్షి, హైదరాబాద్: ఇంటర్ జోనల్ అండర్–23 మహిళల వన్డే టోర్నమెంట్లో సత్తాచాటిన ముగ్గురు హైదరాబాద్ ప్లేయర్లు సౌత్ జోన్‌కు ఎంపికయ్యారు. కేరళలో ఈ నెల 18 నుంచి ప్రారంభమయ్యే ఈ మూడు రోజుల టోర్నమెంట్లో పాల్గొనే సౌత్ జోన్ జట్టుకు హైదరాబాద్‌కు చెందిన గౌహర్ సుల్తానా కెప్టెన్‌గా వ్యవహరించనుంది. ఆమెతో పాటు స్రవంతి నాయుడు, అనన్య ఉపేంద్రన్ జట్టులో చోటు దక్కించుకున్నారు. ఇదే జట్టులో స్టాండ్ బైగా హిమని యాదవ్, కావ్య కూడా ఉన్నారు. మరోవైపు బరోడాలో ఈ నెల 9 నుంచి 13 వరకు జరుగనున్న ఇంటర్ జోనల్ మ్యాచ్‌లకు డి. రమ్య, రచన ఎస్ కుమార్ ఎంపికయ్యారు. ఇదే జట్టులో స్టాండ్‌బైగా లక్ష్మీ ప్రసన్న కొనసాగుతుంది. మహిళల అండర్–23 క్రికెట్ ప్రాబబుల్స్‌కు ఎంపికైన వారి జాబితాను హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) ప్రకటించింది. 20 మందితో కూడిన ఈ బృందంలో రచన, శ్రావణి, ప్రణతి రెడ్డి, రమ్య, స్నేహ మోరే త్రిష, ప్రసన్న, అనురాధ నాయక్ (వికెట్ కీపర్), చరిష్మ, శ్రావ్య (వికెట్ కీపర్), కె. అనిత, వర్ష, శ్రావీణ, భవ్య, మమత (వికెట్ కీపర్), భావన, ప్రణతి, వినయ శ్రీ, చిత్రా మహేశ్వరి, క్రాంతిలకు చోటు దక్కింది. -
మహిళా క్రికెట్ లో మరో సంచలనం
ఔరంగాబాద్:మహిళా క్రికెట్ మరో సంచలనం నమోదైంది. అండర్-19 వన్డే క్రికెట్ టోర్నమెంట్ లో 16 ఏళ్ల ముంబై క్రీడాకారిణి జెమిమాహ్ రోడ్రిగ్జ్ డబుల్ సెంచరీతో అదరగొట్టింది. తద్వారా అండర్-19 మహిళా వన్డే క్రికెట్ లో డబుల్ సెంచరీ చేసిన రెండో భారత క్రీడాకారిణిగా రోడ్రిగ్జ్ నిలిచింది. ఔరంగాబాద్ వేదికగా సౌరాష్ట్రతో జరిగిన 50 ఓవర్ల మ్యాచ్ లో ముంబై తరపున బరిలోకి దిగిన రోడ్రిగ్జ్ ద్విశతకాన్ని సాధించింది. 163 బంతుల్లో 202 పరుగులతో దుమ్ములేపింది. 52 బంతుల్లో 53 పరుగులు చేసి నెమ్మదిగా బ్యాటింగ్ కొనసాగించిన రోడ్రిగ్జ్.. 83 బంతుల్లో శతకం నమోదు చేసింది. ఆపై దూకుడుగా ఆడిన ఆమె డబుల్ సెంచరీ చేసి అజేయంగా నిలిచింది. ఫలితంగా మహిళా అండర్ -19 వన్డే క్రికెట్ లో డబుల్ సెంచరీ చేసిన రెండో భారత క్రీడాకారిణిగా రోడ్రిగ్జ్ అరుదైన రికార్డు సొంతం చేసుకుంది. గతంలో స్మృతి మందన 224 పరుగులతో నాటౌట్‌గా నిలిచింది. 2013లో జరిగిన మందన సాధించిన డబుల్ సెంచరీనే అండర్ 19లో తొలి ద్విశతకం. -
సౌత్‌జోన్ చాంప్ ఆంధ్ర
సాక్షి, హైదరాబాద్: సౌత్‌జోన్ ఇంటర్ స్టేట్ అండర్–23 మహిళల క్రికెట్ టోర్నమెంట్లో ఆంధ్ర జట్టు సత్తా చాటింది. ఈ టోర్నీలో ఆడిన ఐదు మ్యాచ్‌ల్లోనూ గెలిచి అజేయంగా టైటిల్‌ను కైవసం చేసుకుంది. కొచ్చిలో హైదరాబాద్‌తో జరిగిన చివరి వన్డే మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో గెలిచిన ఆంధ్ర జట్టు సౌత్‌జోన్ చాంపియన్‌గా అవతరించింది. అంతకుముందు మ్యాచ్‌ల్లో కేరళ, గోవా, కర్ణాటక, తమిళనాడు జట్లపై ఆంధ్ర విజయం సాధించింది. మంగళవారం జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న హైదరాబాద్ జట్టు 48.5 ఓవర్లలో 106 పరుగులకు ఆలౌటైంది. హిమాని యాదవ్ (75 బంతుల్లో 40; 8 ఫోర్లు) మినహా ఎవరూ రాణించలేకపోయారు. ఆంధ్ర బౌలర్లలో సీహెచ్ ఝాన్సీ లక్ష్మీ, చంద్రలేఖ చెరో 3 వికెట్లు దక్కించుకోగా... మల్లిక 2 వికెట్లు పడగొట్టింది. అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనకు బరిలోకి దిగిన ఆంధ్ర జట్టు 24.1 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 107 పరుగులు చేసి గెలిచింది. ఓపెనర్లు అనూష (46 బంతుల్లో 30; 4 ఫోర్లు), మేఘన (47 బంతుల్లో 53; 8 ఫోర్లు) ఆకట్టుకున్నారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 87 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. హైదరాబాద్ బౌలర్లలో కీర్తిరెడ్డి, శ్రావణి చెరో 2 వికెట్లు తీశారు. ఈ టోర్నీలో విజేతగా నిలిచిన ఆంధ్ర జట్టుకు ఏసీఏ కార్యదర్శి చుక్కపల్లి అరుణ్ కుమార్ రూ. 2 లక్షల బహుమతిని ప్రకటించారు. -
హైదరాబాద్ భారీ విజయం
గుంటూరు స్పోర్ట్స్: బీసీసీఐ సౌత్‌జోన్ అండర్-19 మహిళల అంతర్ రాష్ట్ర క్రికెట్ టోర్నమెంట్లో హైదరాబాద్ జట్టు భారీ విజయం సాధించింది. కేరళతో సోమవారం జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ 176 పరుగుల ఆధిక్యంతో గెలిచింది. టాస్ గెలిచిన హైదరాబాద్ జట్టు తొలుత బ్యాటింగ్ చేపట్టి 50 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 247 పరుగులు చేసింది. రమ్య (113 బంతుల్లో 87), రచన (24 బంతుల్లో 31నాటౌట్), అరుంధతిరెడ్డి (31 బంతుల్లో 27), స్నేహమోరె (38 బంతుల్లో 26 పరుగులు) రాణించారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన కేరళ జట్టు 24.4 ఓవర్లలో 71 పరుగులకు ఆలౌటైంది. కేరళ జట్టులో సుమి 23, అక్షయ 16 పరుగులు చేశారు. హైదరాబాద్ జట్టులో రచన అద్భుతమైన బౌలింగ్‌తో 12 పరుగులు ఇచ్చి 6 వికెట్లు పడగొట్టింది. గీతాంజలి 14 పరుగులకు 3 వికెట్లు తీసుకుంది.