ఆశలు ఉన్నవాళ్లు | First National Womens Cricket Tournament For The Blind To Be Held In Delhi | Sakshi
Sakshi News home page

ఆశలు ఉన్నవాళ్లు

Published Wed, Dec 18 2019 12:09 AM | Last Updated on Wed, Dec 18 2019 4:27 AM

First National Womens Cricket Tournament For The Blind To Be Held In Delhi - Sakshi

కాళ్లు లేవు. కాలినడకన వస్తాం అని మొక్కుకోకూడదా? వేళ్లు లేవు. వీణపై స్వరాలను పలికించాలన్న తపన ఉండకూడదా? మాట లేదు. ప్రతిధ్వనించేలా నినదించాలని ఆవేశపడకూడదా? వినికిడి లేదు. విశ్వాంతరాళ హోరుకు విష్ణుమూర్తిలా చెవి వొగ్గకూడదా? చూపు లేదు. సిక్సర్‌లు కొట్టాలని, క్యాచ్‌లు పట్టేయాలని ఉత్సాహపడకూడదా?

బ్రియాన్‌ లారా వెస్టిండీస్‌ క్రికెటర్‌. ప్రపంచ క్రికెట్‌ చరిత్రను తూకం వేస్తే ఆ తూగే బరువులో ఆయన కాస్త ఎక్కువగానే ఉంటారు. ఐదడుగులా ఎనిమిది అంగుళాల ఎత్తు ఉన్నందువల్ల, ర్యాంకింగ్‌లు– రికార్డులు ఏవో ఉంటాయి ఈ క్రికెట్‌వాళ్లకు.. అవి సమృద్ధిగా ఉన్నందువల్ల, ఒబామా అమెరికా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు వెస్టిండీస్‌లో పర్యటిస్తూ అక్కడుండే లారాను వెతుక్కుంటూ వెళ్లి కలిసినందువల్ల, తన చిట్టచివరి వన్డే ఇంటర్నేషనల్‌లో ఆట అవుతున్నంతసేపూ ‘లారా.. లారా.. లారా..’ అని పిచ్‌లో ప్రకంపనలు రేపిన ఫ్యాన్స్‌ వైపు ఆటంతా అయ్యాక చేతులు చాస్తూ.. ‘డిడ్‌ ఐ ఎంటర్‌టైన్‌?’ అని అడిగినందు వల్లా..  క్రమంగా పెరుగుతూ వచ్చిన బరువు కావచ్చది. యాభై ఏళ్ల మనిషి. ఆరేళ్ల వయసున్నప్పటి నుంచి ఆడిన మనిషి. పన్నెండేళ్ల క్రితం రిటైర్‌ అయిన మనిషి. రిటైర్‌ అయినా బరువు ఏమాత్రం తగ్గని మనిషి. బ్రియాన్‌ లారానే మనం ఇంకోలా చూద్దాం. ఆయనకు కళ్లు లేవు. పుట్టు గుడ్డి. అలా అని అనుకుందాం.

పదకొండు మంది సంతానంలో ఒకడైన లారాను తండ్రి ఎన్ని కళ్లతోనూ ఎంతసేపో కనిపెట్టుని ఉండలేకపోయేవాడు. లారా పుట్టిన శాంటాక్రజ్‌లో లోకల్‌ స్కూల్‌ ఒకటి ఉంది. హార్వార్డ్‌ కోచింగ్‌ క్లినిక్‌. ఆ క్లినిక్‌.. ఆరేళ్ల వయసులోనే క్రికెట్‌ అంటే ఆసక్తి చూపినప్పటికీ కళ్లు లేని కారణంగా లారాను చేరదీసి, ముద్దు చేయలేకపోయేది. లారా తొలి బడి సెయింట్‌ జోసెఫ్స్‌ రోమన్‌ కేథలిక్‌ ప్రైమరీ ఆ పసివాడికి అడ్మిషన్‌ ఇవ్వలేకపోయేది. కళ్లు లేని వాళ్ల బడి కాదు అది. సెయింట్‌ జువాన్‌ సెకండరీ స్కూలు, ఫాతిమా కాలేజీ కూడా ముఖం చాటేసేవి.. ఒకవేళ లారా స్టిక్‌ సహాయంతో తడుముకుంటూ తడుముకుంటూనే అంతదూరం వచ్చాడని అనుకున్నా. క్రికెట్‌ కోచ్‌ హ్యారీ రామ్‌దాస్‌ అంటే కూడా ప్రపంచానికిప్పుడు పెద్దగా తెలియకపోయేది. అంధుడైన లారాను లెఫ్ట్‌హ్యాండెడ్‌ బ్యాట్స్‌మన్‌గా, రైట్‌ ఆర్మ్‌ లెగ్‌ బ్రేక్‌ బౌలర్‌గా చెక్కడానికి ఆయనకేం పట్టేది?! లారాకు కూడా కళ్లు లేకుండా పద్నాలుగేళ్ల వయసులో స్కూల్‌ బాయ్స్‌ లీగ్‌లో ఇన్నింగ్స్‌కి సగటున 126 పరుగులు చొప్పున 745 పరుగులు తియ్యడం ఒక  ఊహ మాత్రమే అయ్యేది.

సాకర్‌ అన్నా, టేబుల్‌ టెన్నిస్‌ అన్నా కూడా లారాకు ఇష్టం. చూపులేని కారణంగా ఆ ఇష్టాలనూ చంపుకుని ఎక్కడో బతుకుతూ ఉండేవాడు! ‘నాకే ఎందుకిలా చేశావ్‌ దుర్మార్గుడా!’ అని దేవుణ్ణి తిట్టుకుంటూ.. తలకొట్టుకుంటూ ఉండేవాడు.. ఎవర్ని తిడుతున్నదీ స్పృహ లేకుండా. ‘‘అవును నిజంగా అలానే ఉండేవాడిని’’ అన్నాడు ఇప్పుడు ఇండియాలోనే ఉన్న బ్రియాన్‌ లారా. ఢిల్లీలో బ్లైండ్‌ ఉమెన్‌ డొమెస్టిక్‌ నేషనల్‌ క్రికెట్‌ లీగ్‌ పోటీలకు ముందు రెండు మాటలు మాట్లాడమని ‘క్రికెట్‌ అసోసియేషన్‌’ అడిగితే వచ్చాడు. పోటీలు సోమవారం మొదలయ్యాయి. ఫస్ట్‌ టైమ్‌ మన దగ్గర అంధ మహిళా క్రీడాకారులకు జాతీయస్థాయి పోటీలు జరగడం. ఏడు టీమ్‌లు తలపడుతున్నాయి. ఢిల్లీలోని సిరి ఫోర్ట్‌ స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌లో ఇవాళ ఫైనల్స్‌. మాట్లాడ్డానికి ముందు ఢిల్లీ టీమ్‌ కెప్టెన్‌ అంకితాసింగ్‌ని, తక్కిన టీమ్‌లను, టీమ్‌ మేట్స్‌నీ కలిసి విష్‌ చేశాడు లారా. ‘‘ఈరోజు మీ మధ్య నేను ఉండటం అనే ఫీలింగ్‌ నాకు చాలా వండర్‌ఫుల్‌ అనిపిస్తోంది’’ అన్నాడు ఆ తర్వాత స్టేజ్‌ మీద. కొంచెం ఎమోషనల్‌ కూడా అయ్యాడు.

‘‘నా కెరియర్‌ మొత్తంలో నేనేవైతే సాధించగలిగానో అవన్నీ కూడా నాకేవైతే ఉన్నాయో వాటి వలన సాధ్యమైనవే. నేనొకవేళ నాకేవైతే ఉన్నాయో వాటికి నోచుకోకపోయి ఉంటే కనుక, నా ఆశలన్నిటినీ చంపుకుని ఏ చీకటి మూలనో కూర్చొని ఉండేవాడిని’’ అని ఒక్క క్షణం ఆగి.. ‘‘అయితే ఇప్పుడనిపిస్తోంది. అలా కూర్చొని ఉండేవాడిని కాదని. నేనూ స్కూలుకు వెళ్లాలనే అనుకునేవాడిని. నేనూ నేర్చుకోవాలనే అనుకునేవాడిని. నేనూ మంచి ఉద్యోగం చేయాలనే అనుకునేవాడిని. నేనూ ఆటలు ఆడాలనే అనుకునేవాడిని’’ అన్నాడు లారా! ఆ వెంటనే ‘‘దీజ్‌ లేడీస్‌ అండ్‌ దెయిర్‌ టోర్నమెంట్‌ జస్ట్‌ అప్రోచింగ్‌’’ అన్నాడు. అప్రోచింగ్‌ అంటే నాట్‌ కంపేరబుల్‌ అని. ఈ మాటతో మళ్లీ కొద్దిగా బరువు పెరిగాడు బ్రియాన్‌ లారా. ఎలా ఆడతారు వీళ్లు క్రికెట్‌ని కళ్లు లేకుండా అనుకుంటాం? అసలు ఎలా ఆడాలనిపిస్తుంది వీళ్లకు క్రికెట్‌ని కళ్లు లేకుండా అనుకునేవాళ్లూ ఉండొచ్చు. ‘ఎలా ఆడతారు?’ అనే ప్రశ్నకు ఎక్కడైనా సమాచారం లభిస్తుంది. ‘ఎలా ఆడాలనిపిస్తుంది?’ అనే ప్రశ్నకు చూపుకు అందని సమాధానం మాత్రమే ఉంటుంది.   

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement