Womens kabaddi
-
Khelo India Youth Games: కబడ్డీలో రైతుబిడ్డల విజయగర్జన
పంచకుల (హరియాణా): ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌లో ఆంధ్రప్రదేశ్ (ఏపీ) అమ్మాయిల కూత అదిరింది. హరియాణాలో జరుగుతున్న ఈ క్రీడల్లో అండర్–18 మహిళల కబడ్డీలో తెలుగు రైతుబిడ్డలు గర్జిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ జట్టులో ఆడుతున్న 12 మందిలో పది మంది రైతు కూలీ బిడ్డలే ఉండటం గమనార్హం. వీరంతా విజయనగరం జిల్లాలోని కాపుసంభం గ్రామం నుంచి వచ్చారు. ఈ జిల్లాకు చెందిన వందన సూర్యకళ ఖేలో ఇండియా కబడ్డీలో అద్భుత ప్రదర్శనతో ప్రత్యర్థుల్ని హడలెత్తిస్తోంది. ‘బి’ గ్రూప్ చివరి లీగ్ మ్యాచ్‌లో ఆంధ్రప్రదేశ్ 40–28తో చత్తీస్‌గఢ్‌ను ఓడించింది. ఇందులో ఏపీ రెయిడర్ సూర్యకళ 14 పాయింట్లతో జట్టు విజయంలో కీలకపాత్ర పోషించింది. నాలుగు జట్లున్న గ్రూప్ ‘బి’లో ఏపీ రెండు విజయాలు, ఒక ఓటమితో రెండో స్థానంలో నిలిచి సెమీఫైనల్‌కు అర్హత సాధించింది. సూర్యకళ మాట్లాడుతూ ‘అవును నేను రైతు కూలీ బిడ్డనే. రైతు బిడ్డలమైనందుకు గర్వంగా ఉంది. మనందరి పొద్దు గడిచేందుకు వృత్తి ఉంటుంది. అలాగే మా తల్లిదండ్రుల వృత్తి కూలీ చేసుకోవడం! నిజానికి నేను ఓ రన్నర్‌ను... చిన్నప్పుడు స్ప్రింట్‌పైనే ధ్యాస ఉండేది. ఏడేళ్లపుడు మా స్నేహితులంతా కబడ్డీ ఆడటం చూసి ఇటువైపు మళ్లాను’ అని చెప్పింది. -
మహిళా కబడ్డీలోనూ నిరాశే!
జకార్త: భారత మహిళల కబడ్డీ జట్టు హ్యాట్రిక్ స్వర్ణం మిస్సయ్యింది. ఏషియన్స్ గేమ్స్‌లో భాగంగా శుక్రవారం ఇరాన్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో భారత మహిళలు 24-27 తేడాతో తృటిలో పసిడిని చేజార్చుకున్నారు. ఒకవైపు పురుషుల జట్టు తొలిసారి సెమీఫైనల్లో ఓడి నిరాశపరచగా.. మహిళలు సైతం ఫైనల్లో ఓడి రజతంతో సరిపెట్టుకున్నారు. హోరాహొరిగా సాగిన ఈ మ్యాచ్‌లో ఇరాన్ మహిళలే పై చేయి సాధించారు. అద్యాంతం ఉత్కంఠగా సాగిన ఈమ్యాచ్‌కు ఇరు దేశాల పురుషుల జట్లు హాజరై తమ జట్లకు మద్దతు పలికాయి. మ్యాచ్ సందర్భంగా పురుషుల జట్టు కెప్టెన్ అజయ్ ఠాకుర్ కన్నీటీ పర్యంతమయ్యాడు. ఆసియా క్రీడల్లో మహిళల కబడ్డీని 2010లో ప్రవేశ పెట్టినప్పటి నుంచి రెండు సార్లు భారత మహిళలే స్వర్ణం సాధించారు. తొలిసారి ఇరాన్ మహిళల జట్టు స్వర్ణం దక్కించుకుంది. ఇక భారత్ పతకాల సంఖ్య 24కు చేరింది. ఇందులో 6 స్వర్ణాలు, 5 రజతాలు, 13 కాంస్య పతకాలు ఉన్నాయి. -
ఏషియన్ గేమ్స్‌లో భారత్ శుభారంభం
జకార్తా: ఏషియన్ గేమ్స్-2018లో భారత మహిళల కబడ్డీ జట్టు శుభారంభం చేసింది. జపాన్‌తో జరిగిన తొలి లీగ్ మ్యాచ్‌లో 42-12 తేడాతో ఘనవిజయం సాధించింది. మమతా పుజారి నేతృత్వంలోని భారత మహిళల జట్టు తొలి నుంచి ఆధిపత్యం కనబర్చింది. ఈ మ్యాచ్‌లో జపాన్ మహిళలు ఏదశలోనూ డిఫెండింగ్ చాంపియన్‌కు పోటీనివ్వలేకపోయారు. ఇండోనేసియా రాజధాని జకార్తాలోని జలోరా బంగ్ కర్నొ స్టేడియంలో స్థానిక కాలమానం ప్రకారం శనివారం రాత్రి 7 గంటలకు పద్దెనిమిదో ఆసియా క్రీడలు అధికారికంగా ప్రారంభమైన విషయం తెలిసిందే. ఇక పురుషుల కబడ్డీ జట్టు తొలి మ్యాచ్ శ్రీలంకతో సాయంత్రం 5.30కు ప్రారంభం కానుంది. ఇక 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్డ్ టీమ్ (రవి కుమార్, అపూర్వీ చండేలా)లు ఫైనల్‌కు చేరింది. -
విజేత ఓయూ మహిళా కాలేజి
సాక్షి, హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీ ఇంటర్ కాలేజి మహిళల కబడ్డీ టోర్నమెంట్లో కోఠి మహిళా యూనివర్సిటీ కాలేజి జట్టు సత్తా చాటింది. రెండు రోజుల పాటు జరిగిన ఈ టోర్నీలో టైటిల్‌ను కైవసం చేసుకుంది. గురువారం జరిగిన ఫైనల్లో యూనివర్సిటీ కాలేజి జట్టు 43–30తో కస్తూర్బా గాంధీ జట్టుపై ఘనవిజయం సాధించింది. అంతకుముందు జరిగిన సెమీఫైనల్లో యూనివర్సిటీ కాలేజి 42–11తో ఆంధ్ర మహిళా సభపై, కస్తూర్బా జట్టు 57–15తో భవన్స్ సైనిక్‌పురి జట్టుపై విజయం సాధించాయి. మూడో స్థానం కోసం జరిగిన పోరులో భవన్స్ జట్టుపై ఆంధ్రమహిళా సభ గెలుపొందింది. పోటీల అనంతరం జరిగిన బహుమతి ప్రదాన కార్యక్రమంలో ఉస్మానియా యూనివర్సిటీ ఇంటర్ కాలేజి టోర్నమెంట్ (ఐసీటీ) డైరెక్టర్ బి. సునీల్ కుమార్ ముఖ్య అతిథిగా విచ్చేసి విజేతలకు ట్రోఫీలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ ప్రశాంత ఆత్మ, కబడ్డీ సాయ్ కోచ్ కె. శ్రీనివాస్ రావు, ఓయూసీడబ్ల్యూ కార్యనిర్వాహక కార్యదర్శి వి. దీపిక రావు, తదితరులు పాల్గొన్నారు. -
మహిళలకూ కబడ్డీ లీగ్
నేటి నుంచి ప్రారంభం ముంబై: ప్రొ కబడ్డీ లీగ్ తరహాలో నేటి (మంగళవారం) నుంచి మహిళల కబడ్డీ చాలెంజ్ ప్రారంభం కానుంది. ఇందులో మూడు జట్లు పాల్గొంటున్నాయి. ఫైర్ బర్డ్స్‌కు మమతా పూజారి, ఐస్ డివాస్‌కు అభిలాష మాత్రే, స్టార్మ్ క్వీన్స్‌కు తేజస్విని బాయ్ కెప్టెన్లుగా వ్యవహరిస్తారు. ప్రొ కబడ్డీ లీగ్ జరిగే వేదికల్లోనే ఈ మ్యాచ్‌లు కూడా జరుగుతాయి. పోటీ 30 నిమిషాలపాటు సాగుతుంది. ముంబై, న్యూఢిల్లీ, హైదరాబాద్, బెంగళూరు, కోల్‌కతా, జైపూర్, పుణేలలో మ్యాచ్‌లు జరుగుతాయి. జూలై 31న ప్రొ కబడ్డీ లీగ్ ఫైనల్‌తో పాటే ఈ పోటీల తుది పోరు కూడా జరుగుతుంది. మ్యాచ్‌లు స్టార్‌స్పోర్ట్స్-2లో ప్రత్యక్ష ప్రసారం కానున్నాయి. -
30 నుంచి రాష్ట్ర మహిళా కబడ్డీ పోటీలు
కాకినాడ (తూర్పుగోదావరి జిల్లా) : రాష్ట్రస్థాయి మహిళా కబడ్డీ పోటీలను ఈ నెల 30, 31, జూన్ 1 తేదీల్లో తూర్పు గోదావరి జిల్లా కిర్లంపూడి మండలం ముక్కొల్లులో నిర్వహించనున్నట్లు వైఎస్సార్సీపీ శాసనసభాపక్ష ఉపనేత, జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ తెలిపారు. పోటీల పోస్టర్‌ను కాకినాడలో ఆదివారం ఆయన ఆవిష్కరించారు. బస్వా చినబాబు స్మారకార్థం ఈ పోటీలను పార్టీ రాష్ట్ర మహిళ అధ్యక్షురాలు, ఎమ్మెల్యే ఆర్కే రోజా ప్రారంభిస్తారన్నారు. రోజూ సాయంత్రం 4 గంటల నుంచి ఫ్లడ్‌లైట్ల వెలుతురులో పోటీలు జరుగుతాయన్నారు. పోస్టర్ ఆవిష్కరణలో ఎమ్మెల్సీలు పిల్లి సుభాష్‌చంద్రబోస్, ఆదిరెడ్డి అప్పారావు, ఎమ్మెల్యేలు దాడిశెట్టి రాజా, వరుపుల సుబ్బారావు, చిర్ల జగ్గిరెడ్డి, వైఎస్సార్ సీపీ జిల్లా యువజన విభాగం అధ్యక్షులు అనంత ఉదయ్ భాస్కర్, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్రి పాపారాయుడు, నాయకులు శెట్టిబత్తుల రాజబాబు, జెడ్పీ ప్రతిపక్షనేత జ్యోతుల నవీన్, పోటీల ఆహ్వాన కమిటీ అధ్యక్షులు వీవీబీ ప్రసాద్, సెక్రటరీ గంధం ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.