క్షణ క్షణం సువీక్షణం
దృశ్యం
సోని ఫొటోగ్రఫీ అవార్డ్స్-2015 సందడి మొదలైంది. రకరకాల విభాగాలలో ప్రపంచవ్యాప్తంగా ఈ పోటీ కోసం ఫోటోలు వస్తున్నాయి. అలా వచ్చిన వాటిలో బాగున్నవనిపించిన కొన్నిటిని ‘వరల్డ్ ఫోటోగ్రఫి ఆర్గనైజేషన్’ విడుదల చేసింది. ఆండ్య్రూ సురినో బాలీలో తీసిన ఒరాంగ్టన్ ఫోటో, ఇండోనేషియా ఫోటోగ్రాఫర్ ఆరీఫ్ తీసిన తన పెంపుడు పిల్లి, కూతురు... కోల్‌కత్తాలో నిక్ అనే ఫోటోగ్రాఫర్ తీసిన పవిత్ర నది స్నానాల ఫొటో, జూబెర్ బిన్ ఇక్బాల్ బంగ్లాదేశ్‌లోని దినాజ్‌పూర్ తోటలో తీసిన సన్యాసి ఫోటో...ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ‘‘వర్షం పడుతున్నప్పుడు... తడవకుండా ఉండడానికి ఒక ఒరాంగ్టన్ అరటి ఆకును ఆసరా చేసుకుంది. వెంటనే నా డియస్ఎల్ఆర్ టెలిఫోటో లెన్స్‌తో ఆ మ్యాజిక్ మూమెంట్‌ను ఫోటో తీశాను’’ అంటున్నాడు ఆండ్య్రూ.
‘‘పోటీ పడడం వెనుక లక్ష్యం కేవలం బహుమతి మాత్రమే కాదు. పోటీ అనేది మనలోని సృజనకు కొత్త దారులు తెరుస్తుంది. ప్రతి క్షణానికి తనదైన సౌందర్యం ఉంది. దాన్ని ఒడిసి పట్టుకోవడమే మనం చేయాల్సిన పని’’ అంటున్నాడు ఆరీఫ్. వీరినే కాదు... ఎవరిని కదిలించినా ఇలాంటి ఉత్సాహపూరిత మాటలే వినిపిస్తాయి. ప్రతి మాటలోనూ అందమైన దృశ్యాలు వెల్లివిరుస్తాయి. కెమెరా నైపుణ్యానికి దృశ్యబలం, సందర్భబలం తోడైతే...ఎంత అందమో సోనీ ఫోటోగ్రఫీ అవార్డ్లకు వస్తున్న... ఫొటోలు మరోసారి నిరూపిస్తున్నాయి.