మరో 48 గంటలు వర్షాలు..!
- తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వానలు
హైదరాబాద్
తెలుగు రాష్ట్రాల్లో పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరో రెండు రోజులు ఒక మాదిరి నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలహీనపడిందని దీని కారణంగా నైరుతీ రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయని వాతావరణ కేంద్ర డైరెక్టర్ వైకే రెడ్డి తెలిపారు. రుతుపవనాల కారణంగా తెలంగాణ తో పాటు.. కోస్తా, రాయల సీమలలో సైతం వర్షాలు పడే అవకావం ఉందరన్నారు.
కాగా.. బుధవారం ఉదయం తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురిశాయి. తెల్లవారుజాము నుంచి హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. తెలంగాణ రాష్ట్రంలో రంగారెడ్డి, మెదక్, నల్లగొండ జిల్లాలో కుంభవృష్టి కురిసింది. నగరంలోని లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో పలు చెరువులకు గండ్లు పడ్డాయి.