Y. Vishweshwar reddy
-
జలహారతి ప్రచార ఆర్భాటమే
♦ హంద్రీనీవా ఆయకట్టుకు ఈ ఏడాదైనా నీరివ్వాలి ♦ మూడేళ్లలో ఒక్క ఎకరానూ తడపని దౌర్భాగ్యం ♦ సీమను సస్యశ్యామలం చేస్తామని సీఎం గొప్పలు ♦ ఉరవకొండ నియోజకవర్గ సమస్యలు పరిష్కరించాలి ♦ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి డిమాండ్ ♦ ఫ్యాక్స్ ద్వారా సీఎం దృష్టికి జిల్లా సమస్యలు అనంతపురం సెంట్రల్: కృష్ణా, గోదావరి పుష్కరాల సందర్భంగా జలహారతులు ఇవ్వడం ఆనవాయితీ అని.. శ్రీశైలం, తుంగభద్ర జలాశయాల్లో ఆశించిన స్థాయిలో నీళ్లు లేకున్నా ఆర్భాటం కోసం ప్రభుత్వం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని ఉరవకొండ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి విమర్శించారు. గురువారం నగరంలోని ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి రూ.6,500 కోట్లు ఖర్చు చేసి హంద్రీనీవా సుజల స్రవంతి ప్రాజెక్టు మొదటి దశను 95శాతం, రెండవ దశ పనులను 75శాతం పూర్తి చేశారన్నారు. ఫలితంగానే గత ఐదు సంవత్సరాలుగా హంద్రీనీవా ద్వారా జిల్లాకు నీళ్లొస్తున్నాయని తెలిపారు. జిల్లాలో 3.50 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరందించాల్సి ఉందని, టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడేళ్లు దాటిపోయిన ఒక్క ఎకరానూ తడపలేని దౌర్భాగ్య స్థితి నెలకొందన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అనేక పోరాటాలు చేశామని, అసెంబ్లీలోనూ గళం వినిపిస్తే 2016 ఆగస్టుకు నీళ్లు విడుదల చేస్తామని రాతపూర్వకంగా హామీ ఇచ్చారని గుర్తు చేశారు. 2017 ఆగస్టు పూర్తయినా ఆ ఊసే కరువయిందన్నారు. ఈ రోజు వరకు డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్‌ను కూడా నిర్మించిన పాపన పోలేదని మండిపడ్డారు. గతేడాది రూ. 350 కోట్ల విద్యుత్ చార్జీలు చెల్లించి హంద్రీనీవా ద్వారా నీటిని తీసుకొస్తే రూ.3కోట్ల పంట కూడా పండించలేని పరిస్థితి దాపురించిందన్నారు. ఉరవకొండ నియోజకవర్గంలో 20వేల ఎకరాలకు డ్రిప్ ద్వారా నీరు ఇస్తామని చెబుతున్నారని.. హంద్రీనీవా ఆయకట్టును ఏం చేయబోతున్నారని ప్రశ్నించారు. ఆయకట్టును రద్దు చేస్తే రైతులు తిరగబడక తప్పదని హెచ్చరించారు. సీమపై చిత్తశుద్ధి కరువు రాయలసీమ ప్రాంత అభివృద్ధి, రైతాంగ సంక్షేమం విషయంలో చంద్రబాబునాయుడుకు ఎప్పుడూ చిత్తశుద్ధి లేదన్నారు. 2004కు ముందు హంద్రీనీవా ప్రాజెక్టుకు రెండు సార్లు శంకుస్థాపన చేసి కిలోమీటరు కాలువ కూడా తవ్వలేని అసమర్థుడు చంద్రబాబు నాయుడు అన్నారు. పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా శ్రీశైలంలో 100 టీఎంసీలు నిల్వ చేసి రాయలసీమను సస్యశ్యామలం చేస్తామని గొప్పలు చెప్పారన్నారు. గతేడాది 790 అడుగుల వరకు కూడా నీటిని వదల్లేదన్నారు. 1996లో జీఓ నెంబర్ 69 విడుదల చేసి శ్రీశైలంలో 834 అడుగుల వరకు నీటిని తీసుకోవచ్చని నిర్ణయించిన ఘనత సీఎందని వివరించారు. ప్రస్తుతం జలహారతి కార్యక్రమం ద్వారానైనా జీఓలు మార్చాలని డిమాండ్ చేశారు. శ్రీశైలంలో 850 అడుగుల వరకే నీళ్లు తీసుకునేలా ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు. తద్వారా రాయలసీమ ప్రాజెక్టుల స్థిరీకరణ జరుగుతుందని సూచించారు. కృష్ణా డెల్టాను స్థిరీకరించి హంద్రీనీవా, గాలేరు నగరి ప్రాజెక్టుకు నిఖర కేటాయింపులు చేయాలన్నారు. ఉరవకొండ ప్రజలకు ఇళ్ల పట్టాలు మంజూరు చేయాలి ఉరవకొండలో నిరుపేద ప్రజలకు ఇళ్లు నిర్మించాలనే ఉద్దేశంతో 2008లో 89 ఎకరాల స్థలాన్ని కేటాయించారన్నారు. రూ.కోటి రూపాయలు వెచ్చించి స్థలాన్ని సేకరించారన్నారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడేళ్లు దాటిపోతున్నా ఒక్క ఇళ్లు పట్టా మంజూరు చేయలేదన్నారు. అత్యధిక జనాభా కలిగిన ఉవరకొండను మున్సిపాలిటీ చేయకపోవడం వల్ల అభివృద్ధి అట్టడుగున ఉండిపోయిందన్నారు. చేనేత కార్మికులకు గుర్తింపు కార్డులతో పాటు ప్రతినెలా సబ్సిడీపై పట్టుదారాలు అందజేయాలని డిమాండ్ చేశారు. జిల్లా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ఫ్యాక్స్ ద్వారా సీఎం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. -
వామ్మో.. చిరుతలు!
సాక్షి, అనంతపురం : జిల్లా ప్రజలను చిరుతలు వణికిస్తున్నాయి. అడవుల్లో ఆహారం కరువై.. జనారణ్యంలోకి వచ్చేస్తున్నాయి. ఎప్పుడు ఏ ఊళ్లోకి చొరబడతాయో తెలియక ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. ప్రస్తుతం వజ్రకరూరు మండలం గూళ్యపాళ్యం గ్రామస్తులు ఇదే పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. వారం రోజులుగా వారికి కంటి మీద కునుకు ఉండడం లేదు. గత మూడేళ్లలో జిల్లాలో చిరుతల సంఖ్య పెరిగింది. 2010-11లో నిర్వహించిన జంతు గణనలో జిల్లాలోని అటవీ ప్రాంతాల్లో 33 చిరుతలు ఉన్నట్లు గుర్తించారు. అయితే.. 2011-12 నాటికి వాటి సంఖ్య 45కు, 2012-13 నాటికి 48కి, 2013-14 నాటికి 55కు చేరుకున్నట్లు అటవీశాఖ రికార్డులు చెబుతున్నాయి. జిల్లా భూ వైశాల్యం 19.13 లక్షల హెక్టార్లు. ఇందులో 1,94,560 హెక్టార్లలో అటవీ ప్రాంతం విస్తరించి ఉంది. అంటే జిల్లా విస్తీర్ణంలో 10.3 శాతం మాత్రమే అడవులు ఉన్నాయి. పర్యావరణ సమతుల్యత ఉండాలంటే 23 శాతం ఉండాలి. ఇక జిల్లాలో దట్టమైన అటవీ ప్రాంతం అంతంత మాత్రమే. దీనివల్ల వన్యప్రాణుల సంరక్షణ కష్టంగా మారింది. అవి జనారణ్యంలోకి వస్తుండడంతో కొన్ని చోట్ల ప్రజలు భయంతో చంపేస్తున్నారు. 2011లో ఆరు చిరుతలను చంపినట్లు అటవీశాఖ రికార్డులను బట్టి తెలుస్తోంది. సంరక్షణ కరువై.. వన్యప్రాణుల సంఖ్య పెరిగితే ఆ మేరకు అడవుల్లో సంరక్షణ చర్యలు చేపట్టే బాధ్యత అటవీశాఖ అధికారులపై ఉంది. జిల్లాలో మాత్రం ఆ పరిస్థితి కన్పించడం లేదు. జిల్లాలో అక్కడక్కడ ఉన్న అడవుల్లో కొందరు స్వార్థపరులు చెట్లను నరికివేస్తున్నారు. కలపను అక్రమ రవాణా చేస్తున్నారు. దీనివల్ల పొదలు తగ్గిపోతున్నాయి. ఇక పశువుల కాపరులు వేసవిలో అడవులకు నిప్పు పెట్టడం పరిపాటిగా మారింది. చాలా చోట్ల అటవీ భూములు కబ్జాకు గురవుతున్నాయి. ఈ కారణాల వల్ల వన్యప్రాణులకు అడవుల్లో రక్షణ కరువైంది. ఆహారం, నీటి కోసం సమీప ప్రాంతాల్లోని వ్యవసాయ పొలాల్లోకి వస్తున్నాయి. ముఖ్యంగా అడవిపందులు, జింకలు పొలాలపై పడి పంటలను నాశనం చేస్తున్నాయి. అలాగే ప్రతియేటా పదుల సంఖ్యలో జింకలు, అడవి పందులు రోడ్లపైన వాహనాలు ఢీకొని చనిపోతున్నాయి. ఆగస్టు 22న కూడేరు సమీపంలోని మరుట్ల గ్రామం వద్దకు ఆహారం కోసం వచ్చిన ఓ అడవి పందిని వాహనం ఢీకొట్టడంతో చనిపోయింది.మరికొన్ని వేటగాళ్ల ఉచ్చులో పడుతున్నాయి. ఉరవకొండ, గుంతకల్లు, కళ్యాణదుర్గం ప్రాంతాల్లో వారంలో మూడు రోజులు వీటి మాంసం విక్రయిస్తున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. అడవుల్లో చిరుతలు పెరుగుతున్నా..వాటికి ఆహారంగా ఉండే అడవి పందులు, జింకల సంతతి మాత్రం తగ్గిపోతున్నట్లు తెలుస్తోంది. జింకలు, అడవి పందులు ఆహారం కోసం జనారణ్యంలోకి వస్తుండడంతో వాటిని వెతుక్కుంటూ చిరుతలు కూడా వచ్చేస్తున్నాయి. ఈ క్రమంలో కనిపించిన మనుషులు, లేగ దూడలు, గొర్రెలపై దాడి చేస్తున్నాయి. ఇలాంటి ఘటనలపై కేసులు నమోదు చేసుకుంటున్న అటవీశాఖాధికారులు.. బాధితులకు నష్టపరిహారం చెల్లించే విషయంలో మాత్రం నాన్చివేత ధోరణి ప్రదర్శిస్తున్నారు. అయితే.. ఆత్మరక్షణ కోసం ప్రజలు.. వన్యప్రాణులను హతమారిస్తే మాత్రం వన్యప్రాణుల సంరక్షణ చట్టం కింద కేసులు బనాయించి నానా తిప్పలు పెడుతున్నారు. వజ్రకరూరు మండల పరిధిలోని గూళ్యపాళ్యం అటవీప్రాంతం నుంచి వచ్చిన చిరుత ఆ ప్రాంత ప్రజలకు వారం రోజులుగా నిద్రలేకుండా చేస్తోంది. ఈ విషయంపై స్పందించిన ఉరవకొండ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి జిల్లా కలెక్టర్ సొలమన్ ఆరోగ్యరాజ్, డీఎఫ్ఓ రాఘవయ్యతో మాట్లాడి చిరుతను బంధించే ఏర్పాట్లు చేయాలని కోరారు. అయితే.. ఇంత వరకు అటవీశాఖాధికారులు చిరుతను బంధించలేక పోయారు. -
'అనంత రైతులకు సాగు నీరు ఇవ్వండి'
అనంతపురం: అనంతపురం జిల్లాలోని తుంగభద్ర హైలెవల్ కెనాల్ (హెచ్ఎల్సీ), గుంతకల్లు బ్రాంచ్ కెనాల్ (జీబీసీ) కింద ఉన్న ఆయకట్టకు వెంటనే నీటిని విడుదల చేయాలని వైఎస్ఆర్ సీపీ నాయకుడు, ఉరవకొండ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వర్‌రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం విశ్వేశ్వర్ రెడ్డి అనంతపురంలో మాట్లాడుతూ.. హెచ్ఎల్సీ, జీబీసీలో భారీగా నీరు ఉన్న... సాగు నీరు విడుదల చేయకపోవడంపై ఆయన ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ రెండు కాలువల కింద ఉన్న ఆయకట్టు ప్రాంతాలలో సాగు నీరు లేక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని విశ్వేశ్వర్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని నీటి విడుదలకు ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలని సూచించారు. దీనిపై ప్రభుత్వం స్పందించకుంటే రైతులు ఆందోళన బాట పడతారని హెచ్చరించారు.