yeruvaka
-
ఏరువాకకు స్వాగతం పలుకుతున్న ఇక్కట్లు!
వానాకాలం పంటల సాగు ప్రారంభం అవుతోంది. సాగుకు ముందు రైతులకు అవసరమైన మౌలిక సౌకర్యాల ఏర్పాటుపై దృష్టిపెట్టాలి. ఏమాత్రం అలస్యం జరిగినా పంట దిగుబడికి నష్టం వాటిల్లుతుంది. సన్న, చిన్నకారు రైతులకు సకాలంలో ఉపకరణాలు లబించక పంటలు దెబ్బతినడం, ఉత్పాదకత తగ్గడం చూస్తున్నాం. ఈ ఏడాది తెలంగాణ రాష్ట్రంలో 60 లక్షల రైతు కమతాలు సాగుకు సన్నద్ధం అయ్యాయి. కానీ ఇంత వరకు ఉపకరణాల సేకరణ జరగలేదు. సాగుకు ముందే కొన్ని సమస్యలు పరిష్కరిస్తే ఉత్పత్తి, ఉత్పాదకత పెరుతుంది. ముఖ్యమంత్రీ, వ్యవసాయ మంత్రీ నెల రోజుల క్రితమే ఏఏ పంట ఎన్ని ఎకరాల్లో పండించాలనే విషయంపై ఒక ప్రకటన చేశారు. కానీ ఆ ప్రకటన ఆధారంగా ప్రణాళిక తయారు కాలేదు. రైతులు వ్యవసాయ పనులు ప్రారంభిస్తున్నా పరిష్కరించాల్సిన సమస్యలు అలాగే ఉన్నాయి. కల్తీ విత్తనాల బెడద రైతులకు శాపమవుతోంది. ఇప్పటికే 30 వేల క్వింటాళ్ళ కల్తీ పత్తి విత్తనాలు పట్టుకున్నారు. విత్తనాలు ఎగుమతి చేసే రాష్ట్రంలో రైతులకు ఈ బెడద ఏంటి? నెల రోజుల క్రితం ఉజ్జాయింపుగా వ్యవసాయ శాఖ మంత్రి పంట రుణాల మొత్తాన్ని ప్రకటించారు. 2022–23 సంవత్సరానికి రూ. 67,863 కోట్లుగా చెప్పారు. ఇచ్చిన పంట రుణాలలో 50 శాతానికి పైగా ‘బుక్ అడ్జస్ట్మెంట్’ చేసినవే. రైతులు రూ. 20 వేల కోట్ల ప్రైవేట్ రుణాలను 24 నుంచి 36 శాతానికి వడ్డీ తెచ్చి వ్యవసాయం చేస్తున్నారు. ఆ బాకీలు తీర్చలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇంత వరకు యాసంగి పంటలో 35 శాతం వడ్లు అనగా 30 లక్షల టన్నులు అమ్మకాలు జరిగాయి. మొక్కజొన్నలు, కందులు, పసుపు, మిరప పంటల అమ్మకాలు పూర్తికాలేదు. మార్కెట్‌కు తెచ్చిన పంటలు తడిచి లక్ష క్వింటాళ్ళ వడ్లు దెబ్బ తిన్నాయి. అలాగే తూకాలలో మోసం, ధరల నిర్ణయంలో తగ్గింపు వలన రైతులు సుమారుగా రూ. 500 కోట్లకు నష్టపోయారు. మార్కెటింగ్ వ్యవస్థనూ, సివిల్ సప్లై సంస్థనూ ప్రక్షాళనం చేయాలి. తమ భూములపై హక్కులు కల్పించాలని 15 లక్షల మంది రైతులు అనేక ఏళ్లుగా ఆందోళన చేస్తున్నారు. ‘ధరణి’ వలన సమస్యలు తీరతాయనుకుంటే మరిన్ని పెరిగాయి. ‘ధరణి’లో 20 లోపాలు ఉన్నట్లు అధికారికంగా గుర్తించారు. ఇందులో 11 లోపాలను ఒక మాడ్యూల్‌గా రూపొందించి రైతు రూ. 1,000 చెల్లించి, రికార్డు సరి చేసుకోవాలని ప్రభుత్వం చెప్పింది. మరో రూ. 650 ‘మీసేవా కేంద్రం’ వాళ్ళు తీసుకుంటున్నారు. ఆధికారులు తప్పులు రాసినందుకు శిక్ష రైతులకా? కేంద్ర ప్రభుత్వం ప్రతి రైతు కుటుంబానికీ భూ కమతాలతో సంబంధం లేకుండా ఏడాదికి రూ. 6 వేలు ఇస్తున్నది. తెలంగాణ రాష్ట్రం నుండి 38,68,211 మంది రైతులకు మాత్రమే ఈ సహాయం అందుతున్నది. రాష్ట్రంలో 60 లక్షల మంది రైతులున్నారు. అంటే ప్రస్తుతం 55 శాతం మందికి మాత్రమే ఈ పథకం అందుతోందన్న మాట. ఆర్బీఐ చట్ట ప్రకారం, గత రాష్ట్ర ప్రభుత్వాల జీవోల ప్రకారం... జూన్, జూలైల్లో వసూళ్ళ పేరుతో జప్తులు చేయరాదు. రైతును ఏమాత్రం అలజడికి గురి చేయరాదు. అలా జరిగినప్పుడు ‘రుణ విమోచన కమిషన్’ (ప్రస్తుతం రాష్ట్రంలో ఉంది)కు రిపోర్టు చేసి వారి సహాయంతో రైతులు డబ్బులు తీసుకోవాలి. 18–59 సంవత్సరాల మధ్య వయసు ఉన్నవారు ఎలాంటి మరణానికి గురైనా వారికి బీమా కంపెనీ రూ. 5 లక్షల రూపాయలు పరిహారం చెల్లించాలి. అందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రీమియం చెల్లిస్తుంది. 2018లో ప్రారంభించిన ఈ పథకానికి రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తున్న ప్రీమియంలో 70–80 శాతం మాత్రమే క్లెయిమ్‌ల కింద ఇస్తున్నారు. మిగిలిన డబ్బు వారు లాభంగా పొందుతున్నారు. పై 8 సమస్యలను సాగు ప్రారంభానికి ముందే పరిష్కరిస్తేనే రైతులకు ప్రయోజనముంటుంది. (క్లిక్: ఆదివాసీ అస్తిత్వాలకు గొడ్డలిపెట్టు) - సారంపల్లి మల్లారెడ్డి ఏఐకెఎస్ ఉపాధ్యక్షులు -
సంప్రదాయ వ్యవసాయానికి ప్రాధాన్యం ఇవ్వాలి
- సకాలంలో నీరిచ్చి ఆదుకున్న ప్రభుత్వం మాదే - ఏరువాకలో ఉప ముఖ్య మంత్రి చిన రాజప్ప పొలమూరు (అనపర్తి): సంప్రదాయ వ్యవసాయానికి రైతులు ప్రాధాన్యతనివ్వాలని, దీనికి అనుగుణంగా ప్రణాళికాబద్ధంగా రైతులు ముందుకు సాగాలని రాష్ట్ర హోంశాఖా మంత్రి, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. మండలంలోని పొలమూరులో జిల్లాస్థాయి శుక్రవారం ఏరువాక పౌర్ణమి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని చినరాజప్ప మాట్లాడుతూ రైతు సంక్షేమమే ధ్యేయంగా, వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. సకాలంలో సాగునీటి ప్రాజెక్టులు నిర్మాణం పూర్తి చేసి సాగునీటికి అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఎమ్మెల్సీ చిక్కాల రామచంద్రరావు మాట్లాడుతూ రెండో పంటకు నీరందించిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వానిదేనని అన్నారు. జిల్లా పరిషత్ ఛైర్మన్ నామన రాంబాబు మాట్లాడుతూ రసాయన ఎరువుల విపరీతంగా వాడటం వల్ల భూసారం తగ్గి తద్వారా పంట దిగుబడులు తగ్గుతాయన్నారు. జిల్లా కలక్టర్ కార్తికేయ మిశ్రా మాట్లాడుతూ రైతులు వ్యవసాయంతోపాటు ప్రత్యామ్మాయ మార్గాల వైపు దృష్టి సారించాలని సూచించారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షతవహించిన స్థానిక ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ జేష్ట పౌర్ణమి రోజున రైతులు తొలి అరక దున్ని సాగును ప్రారంభించటం ఆనవాయితీకి అనుగుణంగా ప్రభుత్వం ఏరువాక పౌర్ణమిని నిర్వహిస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ జేడీ కేఎస్వీ ప్రసాద్, పశు సంవర్థక శాఖ జేడీ వెంకటేశ్వరరావు తదితరులు మాట్లాడారు. అంతకుముందు ఏరువాకలో భాగంగా ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప పొలమూరులోని వ్యవసాయ క్షేత్రంలో భూమితల్లికి, నాగలికి పూజలు నిర్వహించి కాడెద్దులతో దుక్కిదున్నారు. ఈ సందర్భంగా వ్యవసాయ, అనుబంధ శాఖలు ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను తిలకించారు. ఈ కార్యక్రమంలో అనపర్తి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి మూలారెడ్డి, జెడ్పీటీసీ కర్రి ధర్మారెడ్డి, ఎంపీపీ తేతలి ఉమామహేశ్వరి, నియోజకవర్గ ప్రత్యేక అధికారిణి సీతామహాలక్ష్మి, ఫిషరీస్ జెడీ కోటేశ్వరరావు, పట్టు పరిశ్రమ శాఖ డీడీ బిఎంవి రామరాజు ఏపీ సీడ్స్ మేనేజర్ భాస్కరరావు, ఏరువాక శాస్త్రవేత్త ప్రవీణ, నియోజకవర్గంలోని ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. -
జిల్లాకు ఉత్తమ ఏరువాక కేంద్రం అవార్డు
నడకుదురు(కరప): రాష్ట్ర స్థాయిలో తూర్పుగోదావరి జిల్లా ఏరువాక కేంద్రం 2015–16 సంవత్సరానికి గాను ఉత్తమ కేంద్రంగా ఎంపికైంది. ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలోని 13 జిల్లాల్లోని ఏరువాక కేంద్రాల్లో జిల్లా ఎంపిక కావడం విశేషం. నంద్యాల వ్యవసాయ పరిశోధనా కేంద్రంలో ఈనెల 4న జరిగిన 46వ ప్రాంతీయ వ్యవసాయ, విస్తరణ సలహామండలి సమావేశంలో వ్యవసాయశాఖ డైరక్టర్ ధనంజయ్‌రెడ్డి చేతులమీదుగా జిల్లా ఏరువాక కేంద్రం కో–ఆర్డినేటర్, వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ పీఎల్ఆర్జే ప్రవీణ అవార్డును అందుకున్నారు. కరప మండలం నడకుదురులోని ఏరువాక కేంద్రం కార్యాలయంలో మంగళవారం అవార్డు తీసుకున్న విషయాలను ఆమె వెల్లడించారు. జిల్లాలో అయిదేళ్లుగా ఏరువాక కేంద్రం శాస్త్రవేత్తలు రైతులకు అందించిన సూచనలు, సలహాలు, క్షేత్ర ప్రదర్శనలు, క్షేత్ర సందర్శనలు, రైతులకు, వ్యవసాయ విస్తరణాధికారులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమాలు వంటివి పరిగణనలోకి తీసుకుని ఈ అవార్డు ఇచ్చారన్నారు. అవార్డు ప్రదాన కార్యక్రమంలో వ్యవసాయశాఖ డైరెక్టర్ ధనంజయ్రెడ్డితోపాటు అక్కడి ఎమ్మెల్యే బీసీ జనార్ధన్‌రెడ్డి, డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్ డాక్టర్ ఎన్వీ నాయుడు, డైరెక్టర్ ఆఫ్ ఎక్స్టెన్షన్ డాక్టర్ రాజారెడ్డి తదితరులు పాల్గొన్నట్టు డాక్టర్ ప్రవీణ వివరించారు.