గోపీచంద్‌కు అంకితం
‘ప్రపంచ’ పతకంపై సిరిల్ వర్మ
గచ్చిబౌలి: వరల్డ్ జూనియర్ చాంపియన్‌షిప్‌లో తీవ్రంగా శ్రమించినా కొద్దిలో స్వర్ణం చేజారడం నిరాశ కలిగించిందని యువ బ్యాడ్మింటన్ ఆటగాడు ఏఎస్ఎస్ సిరిల్ వర్మ అన్నాడు. పెరూలో జరిగిన ఈ టోర్నీ ఫైనల్లో ఓడిన సిరిల్ రజతంతో సంతృప్తి చెందాడు. ‘తొలి గేమ్‌ను గెలుచుకున్న తర్వాత టైటిల్ దక్కుతుందని నమ్మకంతో ఉన్నా. అయితే ఆ తర్వాత ప్రత్యర్థి నాకంటే ఎంతో మెరుగ్గా ఆడి ఆధిపత్యం ప్రదర్శించాడు.
అయితే భారత్ తరఫున తొలి సారి రజతం గెలుచుకున్న ఆటగాడిగా నిలవడం సంతోషకరం. ఈ పతకాన్ని నా కోచ్ పుల్లెల గోపీచంద్‌కు అంకితమిస్తున్నా’ అని సిరిల్ పేర్కొన్నాడు. బుధవారం గచ్చిబౌలిలోని గోపీచంద్ అకాడమీలో సిరిల్‌కు ఘన సన్మానం జరిగింది. ఈ సందర్భంగా హైదరాబాద్ బ్యాడ్మింటన్ సంఘం అధ్యక్షుడు వి. చాముండేశ్వరీనాథ్ సిరిల్‌కు ప్రోత్సాహకంగా 2 లక్షల రూపాయల చెక్‌ను అందజేశారు. కార్యక్రమంలో సిరిల్ తల్లిదండ్రులు రామరాజు, సుశీలతో పాటు వర్ధమాన షట్లర్లు పాల్గొన్నారు.