యప్ టీవీ నుంచి సరికొత్త యాప్
ముంబై: ఇంటర్నెట్ ఆధారిత టీవీ స్ట్రీమింగ్ సర్వీస్ ప్రొవైడర్ యప్ టీవీ సరికొత్త యాప్ 'యప్ టీవీ బజార్'ను ప్రారంభించింది. ముంబైలోని జుహులో మహారాష్ట్ర గవర్నర్ సీహెచ్ విద్యాసాగరరావు, బాలీవుడ్ హీరో అభిషేక్ బచ్చన్ బుధవారం సంయుక్తంగా ఈ యాప్ను లాంచ్ చేశారు. హై క్వాలిటీ విడియోలను ఈ యాప్ ద్వారా చూడవచ్చు. విద్యా సమాచారం, షార్ట్ ఫిల్మ్స్, వెబ్ సిరీస్, మూవీ ట్రైలర్స్, తదితర సమాచారాన్ని మనం యప్ టీవీ బజార్ నుంచి పొందవచ్చు. వ్యక్తిగతంగా ఎవరైనా తాము రూపొందించిన వీడియోలను యప్ బజార్ నుంచి మార్కెట్ చేసుకునే వెసులుబాటు కూడా ఇందులో ఉంది. స్మార్ట్ టీవీ, స్మార్ట్ ఫోన్, టాబ్లెట్, కంప్యూటర్ వాడేవారు సులువుగా ఈ యాప్ ద్వారా తమకు కావల్సిన విషయాన్ని చూడవచ్చు.
కంటెండ్ డెవలపర్స్ తమ డాటాను, వీడియోల ద్వారా ఇందులో భద్రపరుచుకోవడంతో పాటు సులువుగా మార్కెటింగ్ చేసుకోవచ్చునని యప్ టీవీ వ్యవస్థాపకుడు, సీఈవో ఉదయ్ రెడ్డి తెలిపారు. గతంలో కంటెంట్ డెవలపర్లకు ఉన్న సమస్యలకు ఈ యాప్ పరిష్కారం చూపిస్తుందని ధీమావ్యక్తం చేశారు.
గవర్నర్ విద్యాసాగర్ రావు మాట్లాడుతూ.. డిజిటల్ యుగంలో పరిశ్రమలు నూతన టెక్నాలజీని వాడుతున్నాయన్నారు. వీడియో కంటెంట్ ప్లాట్ఫారం అయిన యప్ టీవీ యాప్ను అందరూ స్వాగతించాలని చెప్పారు. ఎవరైనా తమ వీడియోను ఈ యాప్ ద్వారా అందరికీ పరిచయం చేసి, మార్కెట్ చేసుకోవడం ప్రారంభించి కొత్త బిజినెస్ చేసుకునేందుకు అవకాశం లభిస్తుందన్నారు. అభిషేక్ బచ్చన్ మాట్లాడుతూ.. క్రియేటివిటీని అందరికీ పరిచయం చేసుకునేందుకు మంచి అవకాశమన్నారు. గూగుల్ ప్లే స్టోర్లో యప్ టీవీ అత్యంత ఆదరణ కలిగిన రెండో యాప్ అని, యప్ టీవీ బజార్ అందరూ విశ్వసించదగ్గ యాప్ అని అభిషేక్ బచ్చన్ అభిప్రాయపడ్డాడు.