ఐపీఎల్ కార్డుదారులకూ వాజ్‌పేయి ఆరోగ్యశ్రీ
డిసెంబర్ రెండవ వారంలో అమలు
రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి యూటీ ఖాదర్ వెల్లడి
సాక్షి, బెంగళూరు : వాజ్‌పేయి ఆరోగ్య శ్రీ పథకాన్ని ఐపీఎల్ కార్డుదారులకూ విస్తరించనున్నట్లు రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి యూటీ ఖాదర్ వెల్లడించారు. బుధవారమిక్కడ నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 165 ఆస్పత్రుల్లో ఉచితంగా వైద్యాన్ని అందుకునే సౌలభ్యాన్ని బీపీఎల్ కార్డుదారులకు ఈ పథకం ద్వారా అందజేశామని చెప్పారు. ఇలాంటి ప్రతిష్టాత్మక సంక్షేమ పథకాన్ని ఏపీఎల్ కార్డుదారులకు సైతం చేరువ చేసేందుకు నిర్ణయించినట్లు వెల్లడించారు.
డిసెంబర్ రెండవ వారంలో ఏపీఎల్ కార్డుదారులకూ ఈ పథకాన్ని విస్తరించేందుకు మంత్రి మండలి ఇప్పటికే తన అంగీకారాన్ని తెలిపిందని పేర్కొన్నారు. ఈ పథకంలో భాగంగా ఏపీఎల్ కార్డుదారులు జనరల్ వార్డుల్లో చికిత్స తీసుకుంటే చికిత్సకు అయ్యే ఖర్చులో 70 శాతం రాష్ట్ర ప్రభుత్వం, 30 శాతం రోగులు భరించాల్సి ఉంటుందని అన్నారు. అదే స్పెషల్ వార్డుల్లో చికిత్స తీసుకుంటే మాత్రం 50 శాతం మాత్రం రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని, మరో 50 శాతం రోగి భరించాల్సి ఉంటుందని అన్నారు.
అదే సూపర్ స్పెషాలిటీ వార్డ్‌లో చికిత్స తీసుకుంటే మాత్రం ప్రభుత్వం ఎలాంటి ఖర్చును భరించబోదని వెల్లడించారు. కాగా, గత ఏడాది కేన్సర్, గుండె సంబంధ తదితర 469 వ్యాధులకు సంబంధించి 35 వేల మందికి శస్త్రచికిత్సలు నిర్వహించామన్నారు. ఇందు కోసం రూ.176 కోట్లు ఖర్చుచేసినట్లు తెలిపారు.
కాగా, ఈఏడాది వాజ్‌పేయి ఆరోగ్యశ్రీ కోసం రూ.210 కోట్లు కేటాయించిందని ఈ సందర్భంగా గుర్తుచేశారు. కాగా, వాజ్‌పేయి ఆరోగ్యశ్రీ పథకం అమలుపై ప్రపంచ బ్యాంక్ రాష్ట్రంలోని 572 గ్రామాల్లో 31,476 కుటుంబాలపై అధ్యయనాన్ని సాగించి ప్రశంసలు కురిపించడమే కాకుండా అంతర్జాతీయ జర్నల్స్‌లో కూడా ఈ విషయాన్ని ప్రకటించిందని యూటీ ఖాదర్ ఈ సందర్భంగా పేర్కొన్నారు.