దేశవ్యాప్తంగా అరటిపండు ఉత్పత్తిలో 18.1 శాతం మన రాష్ట్రంలోనే..
మామిడి ఉత్పత్తిలోనూ మనమే అగ్రగామి
దేశంలో మొత్తం ఉత్పత్తిలో 23 శాతం మన దగ్గరే
అత్యధికంగా 5.0 మిలియన్
మెట్రిక్ టన్నుల ఉత్పత్తితో నెంబర్‌వన్
ఆర్‌బీఐ అధ్యయన నివేదిక విడుదల
సాక్షి, అమరావతి: అరటి పండ్లు, మామిడి ఉత్పత్తిలో దేశంలోనే అంధ్రప్రదేశ్ అగ్రగామిగా ఉందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) నివేదిక వెల్లడించింది. అరటి పండ్లను ఉత్పత్తి చేసే ప్రధాన రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ 18.1 శాతంతో మొదటి స్థానంలో ఉందని.. అలాగే మామిడి ఉత్పత్తిలోనూ దేశంలోనే అత్యధికంగా 5.0 మిలియన్ మెట్రిక్ టన్నులతో ఏపీ ప్రథమ స్థానంలో ఉందని తెలిపింది. దేశంలో ప్రధానంగా అరటి పండ్లు, మామిడి, ద్రాక్ష పండ్ల ద్రవ్యోల్బణం, ఉత్పత్తిపై ఆర్బీఐ తన అధ్యయన నివేదికను విడుదల చేసింది. అరటిపండ్ల ఉత్పత్తిలో ఏపీ తరువాత స్థానాల్లో మహారాష్ట్ర, తమిళనాడు, గుజరాత్, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, మధ్యప్రదేశ్ రాష్ట్రాలున్నాయని.. ఇవన్నీ దేశం మొత్తం అరటి పండ్ల ఉత్పత్తిలో 80 శాతం వాటాను కలిగి ఉన్నాయని నివేదిక వివరించింది.
ఇక ఆంధ్రప్రదేశ్‌లో అరటి పండ్ల ఉత్పత్తి కేంద్రాలుగా తూర్పు గోదావరి, పశి్చమ గోదావరి, కర్నూలు, కడప ఉన్నాయి. అలాగే, దేశంలో రెండో అతి ముఖ్యమైన పండు అరటి పండేనని నివేదిక తేల్చిచెప్పింది. ఇక దేశంలో అరటి పండ్ల ఉత్పత్తి 2012–13లో 26.5 మిలియన్ మెట్రిక్ టన్నులుండగా.. 2022–23 నాటికి అది 36.6 మిలియన్ మెట్రిక్ టన్నులకు పెరిగిందని ఆర్బీఐ తెలిపింది. అలాగే, దేశం నుంచి అరటి ఎగుమతులు 2013–14లో 35 వేల మెట్రిక్ టన్నులుండగా.. 2022–23లో అది 376 వేల మెట్రిక్ టన్నులకు పెరిగింది. అరటిపండ్ల అతిపెద్ద వినియోగదారుగా మన దేశమే ఉందని కూడా తెలిపింది. దేశీయ ఫార్మ్‌గేట్ 2021–22లో అరటి కిలో ధర రూ.14 నుంచి రూ.15 ఉండగా.. 2022–23లో రెండింతలు పెరిగి కిలో రూ.27 నుంచి 28 రూపాయలైందని నివేదిక పేర్కొంది.
మామిడి ఉత్పత్తి, సాగులో ఏపీ ఆధిపత్యం..
మరోవైపు.. మామిడి ఉత్పత్తి, సాగులోనూ ఆంధ్రప్రదేశ్ ఆధిపత్యం చెలాయిస్తున్నట్లు నివేదిక తెలిపింది. దేశంలో మామిడి సాగు విస్తీర్ణంలో 17 శాతం వాటాతో.. 5.0 మిలియన్ టన్నుల ఉత్పత్తితో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉందని నివేదిక పేర్కొంది. ఆ తర్వాత 12 శాతం వాటాతో ఉత్తరప్రదేశ్ రెండో స్థానంలో ఉంది. దేశంలో మొత్తం మామిడి ఉత్పత్తిలో ఏపీ వాటా 23 శాతమని కూడా పేర్కొంది. మామిడి సాగు ప్రధాన రాష్ట్రాలైన ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, బిహార్, కర్ణాటక, గుజరాత్, తమిళనాడు, తెలంగాణలు దేశవ్యాప్తంగా 75 శాతం ఉత్పత్తి కలిగి ఉన్నాయని నివేదిక తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment