తోతాపురి పండు.. ఎగుమతుల్లో ట్రెండు | Huge exports of Chittoor mango pulp to foreign countries | Sakshi
Sakshi News home page

తోతాపురి పండు.. ఎగుమతుల్లో ట్రెండు

Published Sun, Nov 3 2024 5:54 AM | Last Updated on Sun, Nov 3 2024 5:54 AM

Huge exports of Chittoor mango pulp to foreign countries

చిత్తూరుకు గ్లోబల్‌ గుర్తింపు

ఏటా రూ.1,200 కోట్ల విదేశీ మారక ద్రవ్యం ఆర్జన 

విదేశాలకు భారీగా మామిడి గుజ్జు ఎగుమతులు

ప్రభుత్వాలు చొరవ చూపితే మరింత దూకుడు 

చిత్తూరు అర్బన్‌: తోతాపురి మామిడి కారణంగా చిత్తూరుకు ప్రపంచంలోనే ప్రత్యేక గుర్తింపు దక్కింది. తోతా­పురి మామిడి కోసం ఏకంగా 48 దేశాలు చిత్తూరు వైపు చూస్తున్నాయి. ఇక్కడి నుంచి పంపిస్తున్న  మామిడి గుజ్జు (మ్యాంగో పల్ప్‌)ను ఆయా దేశాల పౌరులు అపారమైన ప్రేమతో ఆస్వాదిస్తున్నారు. ఎగుమతుల్లో మరే దేశానికి లేని ప్రత్యేకత చిత్తూరు వల్లే భారత్‌కు దక్కుతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చిత్తూరు మామిడిపై కాస్త దృష్టి సారిస్తే ఎగుమతుల్లో మరింతగా ముందడుగు వేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.  

1.12 లక్షల హెక్టార్లలో
ఏ రాష్ట్రంలో లేనివిధంగా మామిడి ఉమ్మడి చిత్తూరులో సాగవుతోంది. చిత్తూరు, మదనపల్లె, తిరుపతి జిల్లాల్లో 1.12 లక్షల హెక్టార్లలో మామిడి తోటలు విస్తరించి ఉన్నాయి. ఇందులో తోతాపురి (బెంగళూరు) రకానికి చెందిన మామిడి చిత్తూరుకు ప్రత్యేక గుర్తింపు తెచ్చి0ది. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 70 వేల హెక్టార్లు తోతాపురి, 42 వేల హెక్టార్లలో టేబుల్‌ రకాలకు చెందిన మామిడి సాగులో ఉంది. రమారమి ఏటా 7.5 లక్షల టన్నుల మామిడి కాయల దిగుబడి వస్తుండగా.. ఇందులో 5 లక్షల టన్నులతో తోతాపురి సింహభాగంలో ఉంది. తో

తాపురి రకం కాయలను పండుగా తినడానికి, పచ్చళ్లకు ఉపయోగించరు. ఇది మృదువుగా, తీపిగా ఉండటంతో దీనిని పూర్తిగా గుజ్జు (పల్ప్‌) కోసమే ఉపయోగిస్తారు. మామిడి కాయల్ని వేడి నీటిలో శుభ్రంచేసి,  టెంకను తొలగించి, గుజ్జును యంత్రాల ద్వారా వేరు చేస్తారు. సహజంగానే ఇది తియ్యగా ఉండటంతో కొద్దిమొత్తంలో చక్కెరను కలిపి మొత్తం గుజ్జును గాలి తీసేసిన కంటైనర్లలో నిల్వచేసి విదేశాలకు ఎగుమతి చేస్తారు.  

దేశంలోనూ డిమాండే 
దేశీయంగా తయారయ్యే పల్పీ, ఫ్రూటీ, స్లైస్, డాబర్, బి–నేచురల్‌ వంటి కంపెనీలు ఈ గుజ్జుతోనే మామిడి పానీయాలను ఉత్పత్తి చేస్తున్నాయి. ఆ కంపెనీలు సైతం ఇక్కడి నుంచే గుజ్జును సేకరిస్తాయి. చిత్తూరు జిల్లాలో 47 మామిడి గుజ్జు తయారీ పరిశ్రమలు ఉన్నాయి. 

ఇటలీ, జర్మనీ, ఫ్రాన్స్, యూకే, పోలెండ్, ఉక్రెయిన్, బెల్జియం, ఆ్రస్టేలియా, క్రోషియా, డెన్మార్క్, నార్వే, స్వీడన్, రుమేనియా, ఆల్బేనియా, ఐర్లాండ్, సెజియా, ఐస్‌లాండ్, స్లోవేనియా, హంగేరి, ఫిన్‌లాండ్, సెర్బీ, మాల్టా, లాక్సంబర్గ్, సిప్రస్, స్లోవేకియా, మోనాకో లాంటి 48 దేశాలకు చిత్తూరు నుంచే మ్యాంగో పల్ప్‌ ఎగుమతి అవుతోంది. ఏటా ఏప్రిల్‌ నుంచి జూలై వరకు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మామిడి గుజ్జు తయారీ పరిశ్రమలు 24 గంటలపాటు పనిచేస్తుంటాయి.   

ఐదేళ్లలో 9 లక్షల టన్నుల ఎగుమతి 
ఐదేళ్లలో చిత్తూరు జిల్లా నుంచి దాదాపు 9 లక్షల టన్నుల మామిడి గుజ్జు ఎగుమతి అయ్యింది. ఇది దేశంలోని మరే ప్రాంతానికి దక్కని గుర్తింపు. గుజ్జు ఎగుమతుల ద్వారా ఏటా సగటున రూ.1,200 కోట్ల విదేశీ మారక ద్రవ్యాన్ని ఉమ్మడి చిత్తూరు జిల్లా ఆర్జిస్తోంది. 1.20 లక్షల మంది రైతులు, 2 లక్షల మంది కార్మికులు ప్రత్యక్షంగాను, 4 లక్షల మంది పరోక్షంగా మామిడి గుజ్జు పరిశ్రమల ద్వారా ఉపాధి పొందుతున్నారు.  

ప్రభుత్వాలు సహకరిస్తే.. 
భారత్‌తో పాటు ఈజిప్‌్ట, ఆఫ్రికా, మెక్సికో, పాకిస్థాన్‌ వంటి దేశాలు కూడా అంతర్జాతీయ మార్కెట్‌కు మామిడి గుజ్జు ఎగుమతులు ప్రారంభించాయి. మన దేశం నుంచి ఎగుమతి అవు­­తున్న మామిడి గుజ్జుపై 32% పన్ను వసూలు చేస్తున్నారు. దీనిని తొలగిస్తే వ్యాపారులు, ఎగుమతిదారులు మామిడి సేక­రణ ధరను పెంచుతారు. 

తద్వారా రైతులకు మరింత ప్రయో­­జనకరంగా ఉంటుంది. కాగా.. చిత్తూరు నుంచి ఎగు­మతి అవుతున్న మామిడి గుజ్జును కంటైనర్ల ద్వారా చెన్నైకు తీసుకెళ్లి, అక్కడి నుంచి సముద్ర మార్గం ద్వారా విదేశాలకు పంపుతున్నారు. దీనివల్ల ఎగుమతి ప్రోత్సాహకాలు చెన్నైకి అందుతున్నాయి. 

అలాకాకుండా చిత్తూరు నుంచే కంటైనర్లతో గుజ్జును ఉంచి సీల్‌ చేసి, ఇక్కడి నుంచి చెన్నైకు పంపిస్తే ఆ ప్రోత్సాహకాలు మన రాష్ట్రానికి లభించడంతోపాటు పారిశ్రామిక రంగానికి అదనపు ఊతం ఇచ్చినట్టవుతుంది. దీనికోసం చిత్తూరులో ఇన్‌ల్యాండ్‌ కంటైనర్‌ డిపో (ఐసీడీ)ను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది.

మధ్యాహ్న భోజన మెనూలో చేర్చాలి 
మధ్యాహ్న భోజనంలో కోడిగుడ్డు పెడుతున్నట్టే పిల్లలకు మ్యాంగో పల్ప్‌ కూడా ఇవ్వాలి. తిరుమల తిరుపతి దేవస్థానాల్లో భక్తులకు అన్న ప్రసాదాలతో పాటు మ్యాంగో పల్ప్‌ ఇస్తే ప్రయోజనం చేకూరుతుంది. కాణిపాకం, అన్నవరం, శ్రీశైలం, శ్రీకాళహస్తి లాంటి ఆలయాల్లో మ్యాంగో పల్ప్‌ వినియోగాన్ని తప్పనిసరి చేస్తే రైతులకు ప్రయోజనం కలుగుతుంది. 

దీనిపై దృష్టి సారించాలని రాష్ట్ర ప్రభుత్వానికి వినతిపత్రం ఇచ్చాం. కేబినెట్‌లో చర్చించి నిర్ణయం తీసుకుంటే చిత్తూరు పల్ప్‌కు పేటెంట్‌ కూడా వచ్చే అవకాశం ఉంది.  – గోవర్దన బాబి, చైర్మన్, ఆలిండియా ఫుడ్‌ ప్రాసెసర్స్‌ అసోసియేషన్, సౌత్‌జోన్, చిత్తూరు  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement