ఖందేవ్ ఆలయం
నార్నూర్: ఆదిలాబాద్ జిల్లా ఆదివాసీల సంస్కృతి, సంప్రదాయాలకు పుట్టినిల్లు... వారి ఆచార వ్యవహారాలు నేటి ఆధునిక యుగంలోనూ పాటిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇందులో భాగంగానే ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలంలోని ఖండేవుని జాతర ఓ ప్రత్యేకత.. ఈ నెల 25న ఖందేవుని మహాపూజతో జాతర ప్రారంభం కానుంది. పదిహేను రోజుల పాటు నిర్వహించే ఈ జాతరకు దేశంలోని ఆదిమ గిరిజనులైన తొడసం వంశస్తులు తరలివచ్చి మొక్కులు చెల్లించుకోనున్నారు.
మాసేమాల్‌పేన్ పూజలతో మొదలు...
24న బుధవారం రాత్రి మాన్కాపూర్ గ్రామంలో మాసేమాల్ పేన్ దేవతకు తొడసం వంశస్తులు ప్రత్యేక పూజలు చేస్తారు. అనంతరం అక్కడి నుంచి 25న గురువారం రాత్రి దేశంలోని నలుమూలల నుంచి తరలివచ్చిన తొడసం వంశస్తులు ఖందేవ్ క్షేత్రానికి చేరుకుంటారు. రాత్రి వారి ఆచారం ప్రకారం ఖందేవునికి పుష్య పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. 26న శుక్రవారం ఖందేవ్ ఆలయం సన్నిధిలో తొడసం వంశానికి చెందిన ఆడపడుచు నాగుబాయి చందు (కడోడ, గిత్త కు చెందిన) తొడసం వంశంలోని ఇళ్ల నుంచి సేకరించిన రెండు కిలోలకుపైగా నువ్వులతో తయారుచేసిన నూనెతాగి తమ రెండో మొక్కును తీర్చుకోనుందని తొడసం కమిటీ సభ్యులు తెలిపారు.
ఆలయం చరిత్ర...
94 ఏళ్ల క్రితం నార్నూర్ గ్రామంగా మారినప్పుడు ఈ ప్రాంతం అంత దట్టమైన అడవులు, గుట్టలు, కొండలు, భయంకరమైన మృగాలతో ఉండేది. ఈ గ్రామానికి చెందిన తొడసం ఖమ్ము పటెల్ నిద్రలో ఖందేవుడు వచ్చి గ్రామం శాంతియుతంగా ఉండాలంటే తనను ఆరాధ్య ధైవంగా స్వీకరించమని చెప్పాడు. మరుసటి రోజు ఖమ్ము పటెల్ తెల్లవారుజామునా లేచి నలుగురు గ్రామ పెద్దలను తీసుకుని వ్యవసాయ క్షేత్రానికి వెళ్లగా కలలో చెప్పిన స్థలంలో ఖందేవుడు ఓ స్తంభంలా వెలిసి కనిపించాడని తొడసం వంశస్తులు చెబుతున్నారు. అయితే ఆ రోజు పౌష్య పౌర్ణమి కావడంతో అప్పటి నుంచి ప్రతీ పౌర్ణమికి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి తమ మొక్కులను తీర్చుకుంటారు.
నువ్వుల నూనె తాగడం...
ప్రత్యేక పూజల అనంతరం 26న ఉదయం దేవుని సన్నిధిలో తొడసం వంఽశానికి చెందిన ఆడపడుచు రె ండు కిలోల నువ్వుల నూనె తాగడం ఆనవాయితీ. ఒకరే మూడేళ్లు నూనె తాగాల్సి ఉంటుంది. ఆడపడుచు నాగుబాయి నూనె తాగి రెండో మొక్కును తీర్చుకోనుంది. ఇలా తాగడంతో సంతా నం లేదా ఏదైనా మంచి జరుగుతుందని వారి నమ్మకం.
26న దర్భార్, సంప్రదాయ భేటీ...
తొడసం వంశస్తులు మహాపూజ, సంప్రదాయ మొక్కులు చెల్లించిన అనంతరం వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన తొడసం వంశస్తులు ఒక దగ్గరకు చేరుకొని సంప్రదాయ భేటీ నిర్వహిస్తారు. ఆలయ అభివృద్ధితో పాటు సంస్కృతి, సాంప్రదాయల పరిరక్షణకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చిస్తారు. అనంతరం ఆలయం ఆవరణంలో మినీ ప్రజాదర్బార్‌ను నిర్వహించి సమస్యలను వివరిస్తారు. ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యేలతో పాటు ప్రజాప్రతినిధులు తరలివస్తారు. అయితే ఆలయ కమిటీ సహకారంతో తొడసం వంశ పెద్దలు తొడసం బాపురావు కటోడ, తొడసం ఆనందరావు కటోడ, రాజు పటెల్, తెలంగాణరావు పటెల్, తొడసం నాగోరావు, స్థానిక సర్పంచ్ బానోత్ గజానంద్‌నాయక్‌ల ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేస్తున్నారు.
తొడసం విజయంగా ఏనుగు విగ్రహం...
ధృవరాజులు వారి పాలనలో ఎనుగులను యుద్ధం సమయంలో ఉపయోగించేవారు. రాజ్యంలో ఏనుగులు ప్రజల పంటలను ధ్వంసం చేయడంతో పాటు ఇబ్బందులకు గురిచేయడంతో వాటిని పట్టుకోవడానికి బహుమతి ప్రకటన చేశారు. తొడసం వంశస్తులు ప్రస్తుతం గాదిగూడ మండలంలోని రోమన్‌కాసా (అప్పటి గోండ్వానా రాజ్యంలో ఉన్న ఎనికాసా) గ్రామం వద్ద ఏనుగులు నిద్రపోతున్న సమయంలో పట్టుకుని ఖందేవ్ పుణ్య క్షేత్రం సమీపంలో చింతచెట్టు వద్ద కట్టేశారు. దీంతో ఆత్రం వంశానికి చెందిన రాజు ‘‘సవ్వ చాలీస్’’ రాజ్యాన్ని తొడసం వంశానికి అప్పగించాడు. అప్పటి నుంచి ఏనుగును తొడసం వంశానికి విజయంగా భావిస్తూ ప్రత్యేక పూజలు చేస్తున్నారు.
సంస్కృతిని కాపాడాలి
తరతరాల నుంచి వస్తున్న సంస్కృతి, సంప్రదాయాలను ప్రతి ఒక్కరూ కాపాడాలి. నియమనిష్టలతో ఖందేవునికి పూజలు చేయడం జరుగుతుంది. దేశంలో ఎక్కడ ఉన్న సరే తొడసం వంశస్తులు ఇక్కడికి రావాల్సిందే. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుంది. మహాపూజ, జాతర నిర్వహణకు ప్రతి ఒక్కరూ సహకరించాలి.
– తొడసం బాపురావు, కటోడ
ఆనవాయితీగా వస్తుంది
మాతాతల కాలం నుంచి మా వంశ దేవుడైన ఖందేవునికి పుష్య పౌర్ణమి సందర్భంగా పూజలు చేయడం ఆనవాయితీగా వస్తుంది. మా సంస్కృతి, సాంప్రదాయం ప్రకారం మొక్కులు తీర్చుకుంటాం. జాతరను విజయవంతం చేయడానికి అన్ని రకాల చర్యలు తీసుకోవాలి.
– తొడసం తెలంగాణరావు పటెల్
భక్తులకు ఇబ్బంది కలగకుండా చర్యలు
తొడసం వంశానికి చెందిన ఖందేవుని పూజ కోసం అందరి సహకారంతో అన్ని రకాల ఏర్పాట్లు చేశాం. ప్రతీ ఏడాది పుష్య పౌర్ణమి సందర్భంగా ఆనవాయితీ ప్రకారం పూజలు చేస్తాం. తొడసం వంశానికి చెందిన ఆడపడుచు నువ్వుల నూనె తాగి మొక్కు తీర్చుకోవడం ఆనవాయితీగా వస్తోంది.
– తొడసం నాగోరావు, ఆలయ కమిటీ సభ్యుడు
Comments
Please login to add a commentAdd a comment