ఆదిలాబాద్: ఇంటర్మీడియట్ పరీక్షల్లో నిమిషం ఆలస్యం నిబంధన తొలగించాలని విద్యార్థి సంఘాల జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. గురువారం జిల్లా కేంద్రంలో డీఐఈవో రవీందర్‌కుమార్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల జేఏసీ కన్వీనర్ బీ రాహుల్ మాట్లాడారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలకు చెందిన ఇంటర్ సెకండియర్ విద్యార్థి టేకం శివకుమార్ ‘నిమిషం’ నిబంధన కారణంగా పరీక్షకు దూరమై మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు.
ప్రభుత్వం వెంటనే నిమిషం ఆలస్యం నిబంధన ఎత్తివేస్తూ శివకుమార్ కుటుంబానికి తగిన న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఏఐఎఫ్‌డీఎస్ జిల్లా కార్యదర్శి కుంటాల నవీన్‌కుమార్, టీఏజీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు పూసం సచిన్, ఏఎస్‌యూ జిల్లా కార్యదర్శి అశోక్, టీఎస్‌ఎఫ్ నాయకుడు సత్యనారాయణ, పీడీఎస్‌యూ జిల్లా అధ్యక్షుడు సిడం సాయికుమార్, ఎస్‌వీఏ జిల్లా అధ్యక్షుడు గొప్లే సుజయ్, నాయకులు ఇఫ్తెఖార్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
విద్యార్థి కుటుంబాన్ని ఆదుకోవాలి..
ఇంటర్ విద్యార్థి శివకుమార్ కుటుంబాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని తెలంగాణ ఆదివాసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పూసం సచిన్ డిమాండ్ చేశారు. రిమ్స్ మార్చురీలో శివకుమార్ మృతదేహాన్ని గురువారం ఆయన సందర్శించారు.
ఆయన కుటుంబీకులను పరామర్శించారు. అనంతరం మాట్లాడుతూ.. ఇంటర్ పరీక్షకు సంబంధించి నిమిషం ఆలస్యం నిబంధన విద్యార్థుల పాలిట శాపంగా మారిందని పేర్కొన్నారు. నిమిషం నిబంధన వెంటనే ఎత్తి వేయాలని ప్రభుత్వాన్ని కోరారు. బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. నాయకులు ఆత్రం కిష్టన్న, లక్ష్మణ్ తదితరులున్నారు.
Comments
Please login to add a commentAdd a comment