తిలా పాపం.. తలా పిడికెడు
● పత్తి కొను‘గోల్‌మాల్’ వ్యవహారంలో ఇప్పటికే మార్కెటింగ్ శాఖ అక్రమాలు బట్టబయలు ● వ్యవసాయ శాఖలోనూ దొడ్డిదారి మూలాలు ● ధ్రువీకరణ పత్రాల జారీలో ఇష్టారాజ్యం
ఇచ్చోడ మండలం రాంపూర్ గ్రామానికి చెందిన ఆడే మంజేష్ సిరికొండ మండలంలోని పోచంపల్లిలో ఇదివరకే మృతి చెందిన రైతు మడావి రాజు పేరిట ఉన్న పదెకరాల భూమిని గత వానాకాలంలో కౌలుకు తీసుకున్నాడు. పంట దిగుబడి చేతికి వచ్చిన తర్వాత మార్కెట్లో సీసీఐకి ప్రభుత్వ మద్దతు ధరకు విక్రయించి ప్రయోజనం పొందాలంటే సహజంగా ఆ క్లస్టర్ పరిధిలోని ఏఈవో ద్వారా ధ్రువీకరణ పత్రం పొందాల్సి ఉంది. కానీ డిసెంబర్ 28న ఇచ్చోడ ఏవో నుంచి ఈ రైతు ఆ ధ్రువీకరణ పత్రం పొందాడు. సిరికొండ మండలానికి చెందిన వ్యవసాయ భూమికి సంబంధించి ఇచ్చోడ ఏవో జారీ చేయడం గమనార్హం. అంతకుముందు సిరికొండ ఏవో పోస్టు ఖాళీగా ఉండడంతో ఇచ్చోడ ఏవో ఈ మండలానికి ఇన్‌చార్జిగా వ్యవహరించారు. అయితే రెగ్యులర్ అధికారి రావడంతో ఆయన బాధ్యతలు తొలిగిపోయాయి. అయినప్పటికీ దొడ్డిదారిన ధ్రువీకరణ పత్రం జారీ చేయడం ద్వారా అక్రమాలకు పాల్పడ్డాడు. వ్యవసాయ శాఖలో జరిగిన అక్రమాలకు ఇది నిదర్శనంగా నిలుస్తోంది. ఇలాంటి పత్రాలు వందల్లో ఇక్కడినుంచి జారీ కావడం గమనించదగిన విషయం.
సాక్షి,ఆదిలాబాద్: వానాకాలం సీజన్‌లోని పత్తి పంట దిగుబడుల విక్రయాల్లో రైతుల ముసుగులో మధ్య దళారులు సీసీఐకి మద్దతు ధరతో విక్రయించి అక్రమంగా ప్రయోజనం పొందారు. మార్కెటింగ్ శాఖలో టెంపరరీ రిజిస్ట్రేషన్ (టీఆర్)ల పరంగా అక్రమాలకు పాల్పడినట్లు రాష్ట్ర మార్కెటింగ్ శాఖ అధికారులు గుర్తించిన విషయం తెలిసిందే. వ్యవసాయ శాఖ నుంచి జారీ చేసే పత్తి పంట ధ్రువీకరణ పత్రాలకు, మార్కెటింగ్ శాఖ నుంచి ఇచ్చే టీఆర్‌లలో ఎకరాల విస్తీర్ణం అధికంగా చూపడం ద్వారా మార్కెటింగ్ అధికారులు అక్రమాలకు పాల్పడ్డారని నిర్ధారించిన విషయం విదితమే. మంగళవారం ఈ వ్యవహారంలో రాష్ట్రంలో ఏడుగురు మార్కెట్ కార్యదర్శులను సస్పెండ్ చేయడం సంచలనం కలిగించింది. అందులో ఆదిలాబాద్ కార్యదర్శి మధుకర్ కూడా ఉండడం గమనార్హం. దీంతో జిల్లా మార్కెటింగ్ శాఖ అప్రతిష్ట పాలైంది. తాజాగా ఈ వ్యవహారంలో వ్యవసాయ శాఖ అక్రమ బాగోతాలు కూడా వెలుగులోకి వస్తున్నాయి. ఇచ్చోడలో వ్యవసాయ అధికారి (ఏవో) అడ్డగోలుగా పత్తి పంట ధ్రువీకరణ పత్రాలు జారీ చేయడం ద్వారా అక్రమాలకు పాల్పడ్డారు. ఈ పత్రాలు క్లస్టర్ పరిధిలోని వ్యవసాయ విస్తరణ అధికారి (ఏఈవో) మాత్రమే క్షేత్రస్థాయి పరిశీలన జరిపి జారీ చేయాలని వ్యవసాయ శాఖ నుంచి స్పష్టంగా నిబంధన ఉంది. అయినప్పటికీ ఇచ్చోడ ఏవో అడ్డగోలుగా ధ్రువీకరణ పత్రాలు జారీ చేశారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. పక్క మండలానికి గతంలో ఇన్‌చార్జిగా వ్యవహరించినప్పటికీ అక్కడ రెగ్యులర్ అధికారి రావడంతో తనకు ఆ మండలంలో పత్రాల జారీ అధికారం లేకున్నప్పటికీ అవేమి పట్టకుండా అనేక పత్రాలు జారీ చేయడమే వ్యవసాయ శాఖలో ప్రస్తుతం వివాదం అవుతోంది. ఈ వ్యవహారంలో ఇప్పటికే ప్రభుత్వం, విజిలెన్స్ విచారణ చేసినట్టు తెలుస్తోంది.
దళారుల దందా..
ప్రస్తుత సీజన్‌లో దళారులు రైతుల పేరుతో పెద్దమొత్తంలో పత్తిని తీసుకొచ్చి సీసీఐ కొనుగోలు కేంద్రాల్లో విక్రయించినట్లు ప్రభుత్వానికి అనేక ఫిర్యాదులు అందినట్లు సమాచారం. దీంతో రాష్ట్ర అధికారులు రాష్ట్రంలోని మార్కెట్ కమిటీల వారీగా సీసీఐ కొనుగోలు కేంద్రాల్లో పత్తి విక్రయాలపై ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. జిల్లాలో ఇటు వ్యవసాయ శాఖ నుంచి జారీ చేసిన ధ్రువీకరణ పత్రాల్లో, అటు మార్కెటింగ్ శాఖ నుంచి ఇచ్చినటువంటి టీఆర్‌లలో భారీ అక్రమాలు చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. మధ్య దళారులు వందలాది క్వింటాళ్ల పత్తిని అక్రమంగా సీసీఐకి మద్దతు ధరతో విక్రయించారనే విమర్శలు వెల్లువెత్తాయి. ఆయా శాఖల అధికారులను ప్రలోభాలకు గురిచేసి దళారులు లక్షల రూపాయలను మద్దతు ధర రూపంలో కొల్లగొట్టారు. తద్వారా అసలైన రైతులకు నష్టం కలిగించారు. మొత్తంగా ఈ వ్యవహారంలో ప్రభుత్వం విచారణ కొనసాగిస్తుండడంతో ఇంకెన్ని అక్రమాలు బయటకొస్తాయో చూడాల్సిందే.
పరిశీలన చేస్తాం..
పత్తి పంట ధ్రువీకరణ పత్రాలను కేవలం క్లస్టర్ స్థాయిలో వ్యవసాయ విస్తరణ అధికారులు మాత్రమే జారీ చేయాలి. ఇచ్చోడలో ఏవో జారీ చేసినట్లు మీడియా ద్వారానే తెలుస్తోంది. దీనిపై పరిశీలన చేస్తాం. రాష్ట్ర అధికారులు, విజిలెన్స్ నేరుగా విచారణ చేస్తున్నారు. – శ్రీధర్‌స్వామి,
జిల్లా వ్యవసాయ అధికారి, ఆదిలాబాద్
తిలా పాపం.. తలా పిడికెడు
తిలా పాపం.. తలా పిడికెడు
Comments
Please login to add a commentAdd a comment