రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి
నేరడిగొండ: మండలంలోని బోరిగాం బస్టాండ్ సమీపంలో 44వ జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతిచెందాడు. వివరాలు ఇలా ఉన్నాయి.. మండలంలోని వడూర్ గ్రామానికి చెందిన బొడిగే గణేశ్ (26) ఆదివారం రాత్రి నిర్మల్‌లో ఉంటున్న ఆయన భార్య వద్దకు బైక్‌పై వెళ్తున్నాడు. గుర్తుతెలియని వాహనాన్ని ఢీకొనడంతో తలకు తీవ్ర గాయాలై సంఘటన స్థలంలో మృతిచెందాడు. మృతదేహాన్ని బోథ్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సోమవారం పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. భార్య కోసం వెళ్తూ రోడ్డు ప్రమాదంలో మృతిచెందడంతో కుటుంబీకులు కన్నీటిపర్యంతమయ్యారు.
గోడ మీదపడి కూలీ..
రెబ్బెన: మండలంలోని నవేగాంలో కూలీపై గోడపడి మృతి చెందినట్లు ఎస్సై చంద్రశేఖర్ తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. నవేగాం గ్రామానికి చెందిన కొద్దెన లస్మయ్య కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తుంటాడు. గ్రామానికి చెందిన బొల్లు తిరుపతి ఇంటి పనుల కోసం సోమవారం లస్మయ్యను కూలీని పిలిచారు. పని నిమగ్నమై ఉన్న సమయంలో ఒక్కసారిగా లస్మయ్యపై గోడ కూలి పడటంతో తీవ్రగాయాలయ్యాయి. వెంటనే కాగజ్‌నగర్ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. మృతుడి అన్న రాజయ్య ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
ప్రమాదవశాత్తు కుంటలో పడి ఒకరు..
ఉట్నూర్‌రూరల్: మండల కేంద్రంలోని బోయవాడకాలనీకి చెందిన పిండి విజయ్ (36) ప్రమాదవశాత్తు కుంటలో పడి మృతి చెందాడు. ఎస్సై మనోహర్ కథనం ప్రకారం.. విజయ్ ఇంటి అవసరం నిమిత్తం కట్టెలు ఏరేందుకు మండలంలోని కామాయిపేట అటవీ ప్రాంతానికి ఆదివారం వెళ్లాడు. మధ్యాహ్న సమయంలో దాహం వేయగా గ్రామ సమీపంలోని కుంటలో నీరు తాగేందుకు వెళ్లి ప్రమాదవశాత్తు కాలు జారి పడిపోయాడు. ఆదివారం రాత్రి అయినా ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. సోమవారం కుంట వద్ద చెప్పులు చూసి గ్రామస్తులు పోలీసులకు సమాచారమివ్వడంతో స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈమేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
అనుమానాస్పదంగా యువకుడు..
ఆదిలాబాద్‌రూరల్: మావల శివారు ప్రాంతంలో గల ఎర్రకుంటలో ఒకరు అనుమానాస్పదంగా మృతిచెందారు. పోలీసుల కథనం ప్రకారం.. మావల గ్రామానికి చెందిన షేక్ ఫర్వేజ్ అదే గ్రామంలోని పెట్రోల్ పంపులో ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఆదివారం ఉదయం ఇంటి నుంచి వెళ్లి రాలేదు. కుటుంబ సభ్యులు రాత్రి వరకు గాలించిన ఆచూకీ దొరకలేదు. సోమవారం ఉదయం ఎర్రకుంట ప్రాంతం వైపు వెళ్లిన మావలకు చెందిన సతీశ్.. మృతదేహాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించారు. ఆదిలాబాద్ రూరల్ సీఐ ఫణిధర్ సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని రిమ్స్ మార్చురీకి తరలించారు. కుమారుడి మృతిపై అనుమానం ఉందని తల్లి రెహనా ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి
Comments
Please login to add a commentAdd a comment