శాశ్వత నిద్రలోకి..
● ఆశ్రమ పాఠశాలలో విద్యార్థిని మృతి
● ఇచ్చోడలో ఘటన
ఇచ్చోడ/బోథ్/నార్నూర్/ఉట్నూర్‌రూరల్: ఏమైందో ఏమో కాని నిద్రలోనే ఆ విద్యార్థి తిరిగి రాని లోకాలకు చేరింది. ఈ ఘటన ఇచ్చోడ మండల కేంద్రంలోని బాలికల ఆశ్రమ పాఠశాలలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. బజార్‌హత్నూర్ మండలం మొర్కండి గ్రామానికి చెందిన చిక్రం లాలిత్య (14) పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతుంది. ఆదివారం రాత్రి భోజనం అనంతరం తోటి విద్యార్థులతో కలిసి మొదటి అంతస్తులో నిద్రకు ఉపక్రమించింది. సోమవారం ఉదయం 6 గంటలకు విద్యార్థులంతా నిద్రలేచారు. ఆమె మాత్రం పడుకుని ఉండగా స్నేహితులు వచ్చి లేపేందుకు యత్నించగా స్పందించలేదు. నోటి నుంచి తెల్లటి నురుగు ఉండగా వెంటనే వసతి గృహ సిబ్బందికి తెలిపారు. హెచ్‌ఎం కాత్లె ఉత్తం దాస్ అక్కడికి చేరుకుని విద్యార్థినిని పరిశీలించి మృతిచెందినట్లుగా గుర్తించాడు. వెంటనే పోలీసులతోపాటు విద్యార్థిని తల్లిదండ్రులకు సమాచారం అందజేశారు. విద్యార్థిని తల్లిదండ్రులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. గత ఆదివారమే తమ బిడ్డను కలిసివెళ్లినట్లు వారు విలపిస్తూ పేర్కొన్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న సీఐ భీమేశ్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించేందుకు యత్నించగా విద్యార్థిని తండ్రి రాజేశ్వర్ తమ బంధువులు వచ్చేంత వరకు ఇక్కడి నుంచి కదిలేది లేదని అడ్డుకున్నాడు. పక్కనే పరీక్షలకు సిద్ధమవుతున్న ఇంటర్ విద్యార్థులకు ఇబ్బందులు కలగచేయవద్దని సూచించి రాజేశ్వర్‌ను అక్కడి నుంచి మృతదేహం వెంట బోథ్‌కు తరలించారు. పంచనామా అనంతరం మృతదేహన్ని వారికి అప్పగించారు. బోథ్ ఎమ్మెల్యే అనిల్‌జాదవ్ బాధిత కుటుంబసభ్యులను పరామర్శించారు. అంత్యక్రియల కోసం రూ.10 వేలు కుటుంబానికి అందించారు. ప్రభుత్వం నిర్లక్ష్యంతోనే బాలిక మృతిచెందిందని ఆరోపించారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలన్నారు. విద్యార్థిని తండ్రి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తిరుపతి తెలిపారు. కాగా, విద్యార్థిని మృతిపై సమగ్ర విచారణ జరిపించి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని ధర్మసమాజ్ పార్టీ రాష్ట్ర సెక్రటరీ అన్నెల లక్ష్మణ్, విద్యార్థి సంఘాలు పాఠశాల ఎదుట, ఐటీడీఏ కార్యాలయం ఎదుట ఆందోళనలు చేపట్టాయి. ధర్మసమాజ్ పార్టీ, సీపీఐ నాయకులు ఆస్పత్రి ఎదుట బైఠాయించారు. ఈ విషయమై నాయకులు ఐటీడీఏ డీడీ వివరణ కోరగా, నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారన్నారు. మృతిపై విచారణ చేపట్టాలని ఐటీడీఏ పీవో ఖష్బుగుప్తాకు ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆత్రం నగేశ్ వినతిపత్రం అందించారు. బాధిత కుటుంబంలో ఒకరికి ప్రభుత్వం ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
శాశ్వత నిద్రలోకి..
Comments
Please login to add a commentAdd a comment