
ఒకే వాహనం.. రెండు ఫీజులు
● దేవుడి దర్శనానికి వాహనదారుల తిప్పలు ● పంచాయతీరాజ్ శాఖ పార్కింగ్ రుసుము.. ● అటవీశాఖ ఎంట్రీ ఫీజు వసూలు
దండేపల్లి: మండల కేంద్రానికి పది కిలోమీటర్ల దూరంలో దట్టమైన అడవిలో కొలువైన పెద్దయ్య దేవుడిని చేరుకోవాలంటే వాహనదారులకు తిప్పలు తప్పడం లేదు. గురువారం పెద్దయ్య దేవుడి దర్శనానికి వెళ్లిన వాహనాలకు రెండు శాఖల వారు ఫీజులు వసూలు చేయడంతో భక్తులు ఖంగుతిన్నారు. పంచాయతీ శాఖ ఆధ్వర్యంలో పార్కింగ్ ఫీజు వసూలు చేస్తుండగా అటవీ శాఖ అధికారులు ఫారెస్టు ఎంట్రీ ఫీజు వసూలు చేశారు. రెండు శాఖలకు ఫీజు చెల్లించడంపై కొంతసేపు వివాదం నెలకొంది. విషయం తెలుసుకున్న ఎంపీడీవో ప్రసాద్ ఫారెస్టు చెక్‌పోస్ట్ వద్దకు చేరుకున్నారు. అటవీశాఖ అధికారులతో మాట్లాడారు. పంచాయతీరాజ్ శాఖ నిబంధనల ప్రకారం పార్కింగ్ రుసుం వసూలు కోసం టెండర్లు నిర్వహించారని, వారు ఫీజు వసూలు చేస్తారని అటవీశాఖ సిబ్బందికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. కానీ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఎంట్రీ ఫీజు వసూలు చేస్తున్నామని వారు బదులిచ్చారు. విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకుందామని అప్పటివరకు ఎవరూ కూడా ఫీజులు వసూలు చేయొద్దని ఎంపీడీవో చెప్పినా అటవీ అధికారులు వినకుండా ఎంట్రీఫీజు వసూలు చేశారు. దీంతో భక్తులకు ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో పంచాయతీ అధికారులు పార్కింగ్ ఫీజు వసూలు చేయలేదు. విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తానని ఎంపీడీవో ప్రసాద్ తెలుపగా, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే ఎంట్రీఫీజు వసూలు చేస్తున్నామని డీఆర్వో పోచమల్లు పేర్కొన్నారు.