రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో తల్లిపాల స్టోరేజీ కేంద్రాలు
● ప్రభుత్వ ఆస్పత్రుల్లో దశల వారీగా ఏర్పాటు ● మొదటి దశలో కాకినాడ, విజయవాడలో ప్రారంభం ● రెండో దశలో విశాఖ కేజీహెచ్, రాజమండ్రి ప్రభుత్వ ఆస్పత్రిలో స్థల సేకరణ ● రోటరీ జిల్లా గవర్నర్ వెంకటేశ్వరరావు వెల్లడి
అనకాపల్లి : రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో దశల వారీగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో బాలింతల తల్లిపాల స్టోరేజీ కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని రోటరీ జిల్లా గవర్నర్(3020) మళ్ల వెంకటేశ్వరరావు అన్నారు. ప్రస్తుతం కాకినాడ, విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఏర్పాటు చేయడం జరిగిందని, త్వరలో కేజీహెచ్‌లో ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. స్థానిక న్యూకాలనీ పాలూరి చిదంబరం రోటరీ ఫంక్షన్ హాల్లో గురువారం విలేకరులతో ఆయన మాట్లాడారు. తల్లిపాల స్టోరేజీ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు రూ.కోటి 25 లక్షలు ఖర్చు అవుతుందని, దీనికి రోటరీ క్లబ్ సభ్యులు ఉచితంగా ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. ఒక్కో కేంద్రం ఏర్పాటుకు 2వేల అడుగుల స్థలం అవసరమన్నారు. అనకాపల్లి జిల్లా ఏరియా ఆస్పత్రిలో ఏర్పాటు చేస్తే రూ.50 లక్షలు ఖర్చు అవుతుందన్నారు. రోటరీ క్లబ్‌బ్‌ను 1905లో ఏర్పాటు చేయగా ఈ ఏడాది ఫిబ్రవరి 23వ తేదీ నాటికి 120 ఏళ్లు పూర్తవుతుందని తెలిపారు. 220 దేశాల్లో పూర్తిగా పోలియో నిర్మూలనకు కృషి చేయడం జరిగిందని పేర్కొన్నారు. మన దేశంలో పూర్తిగా పోలియో నిర్మూలన జరిగిందని, పోలియో వ్యాధి రాకుండా ఉండాలంటే పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రపంచ రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ప్రపంచ వ్యప్తంగా శాంతి స్థూపాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. గర్భిణులకు సర్వేకల్ క్యాన్సర్ వ్యాధి సోకకుండా 10వేల మందికి ఉచితంగా వ్యాక్సిన్లు అందజేయడం జరుగుతుందని, అలాగే కంటి చూపు మందగించిన రోగులకు రూ.35వేలు విలువ చేసే కంటి అద్దాలను అందజేయడం జరిగిందని తెలిపారు.
నేటి వరకూ క్లబ్ ఆధ్వర్యంలో 300 మందికి పంపిణీ చేసినట్టు చెప్పారు. పట్టణంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మార్చిలో విద్యార్థులకు బెంచీలు అందజేస్తామని, గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ తరగతుల నిర్వహణకు చర్యలు తీసుకుందని, ప్రస్తుతం ఎక్కడైనా డిజిటల్ తరగతుల బోర్డులు లేకపోతే తమ దృష్టికి తీసుకువస్తే ఉచితంగా అందజేయడం జరుగుతుందన్నారు. ఇచ్ఛాపురం నుంచి విజయవాడ వరకూ క్లబ్ ఆధ్వర్యంలో ఎస్సీ, ఎస్టీ విద్యార్ధుల వసతి గృహాలకు పరుపులు అందజేస్తామన్నారు. ప్రస్తుతం రూ.50లక్షల విలువ చేసే పరుపులు కొన్ని వసతి గృహాలకు అందించామని తెలిపారు. పలు ప్రాంతాల్లో శ్మశానాల్లో దహనవాటికలకు 19 మిషన్లు అందజేశామని తెలిపారు. ఒక్కో మిషన్ రూ.15లక్షలు ఖర్చు అవుతుందన్నారు. కార్యక్రమంలో అనకాపల్లి రోటరీ క్లబ్ అధ్యక్షుడు ఎస్.రాజేష్‌కుమార్, కార్యదర్శి డి.అనిల్, కోశాధికారి జి.శతేంద్ర, అసిస్టెంట్ గవర్నర్ కె.మురళీకృష్ణ, క్లబ్ సభ్యులు బుద్ద రమణాజీ, కడిమిశెట్టి సతీష్, పి.జె.నాయుడు, కె.వి.గౌరీపతి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment