ఆదివాసీలకు అన్యాయం జరిగితే సహించం
చింతూరు: పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కారణంగా ఒడిశాలోని ఆదివాసీలకు అన్యాయం జరిగితే సహించేదిలేదని, వారికి న్యాయం జరిగేవరకు అండగా ఉంటామని ఒడిశా మాజీ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ అన్నారు. అల్లూరి జిల్లా సరిహద్దు మల్కనగిరి జిల్లా మోటులో శుక్రవారం పోలవరం నిరసన జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రతిపక్ష బీజేడీతో పాటు వామపక్ష, ఆదివాసీ సంఘాలు తమ మద్దతు తెలిపాయి. ఈ కార్యక్రమంలో లైవ్‌లో పాల్గొన్న నవీన్ పట్నాయక్ మాట్లాడుతూ పోలవరం ముంపు కారణంగా అడవిబిడ్డలైన ఆదివాసీల సంస్కృతి, సంప్రదాయాలు కనుమరుగవుతున్నాయని, ఆదివాసీల ఉనికిని కాపాడుకునేందుకు చేసే అన్ని పోరాటాలకు ఎల్లప్పుడూ తమ మద్దతుంటుందని తెలిపారు. తమ ప్రభుత్వ హయాంలో కూడా ప్రాజెక్టు నిర్మాణంపై నిరసన తెలిపామని, మోటు, కలిమెల ప్రాంతాల్లో 200 వరకు ఆదివాసీ గ్రామాలు ముంపునకు గురవుతున్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని ఆయన విమర్శించారు. ఈ సందర్భంగా ఆంధ్రా, తెలంగాణకు చెందిన ఆదివాసీ నాయకులతో పాటు మల్కన్‌గిరి జిల్లాకు చెందిన మాజీ ప్రజా ప్రతినిధులు ఆదివాసీల సమస్యలను నవీన్ పట్నాయక్ దృష్టికి తీసుకెళ్లి పోలవరం ముంపు విషయంలో బీజేడీ చేపట్టే కార్యక్రమాలకు అండగా ఉంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు పద్మినిధ్యాన్, రవినారాయణ, మాజీ ఎంపీ ప్రతిమాంఝీ, ఆంధ్రాకు చెందిన ఆదివాసీ నాయకులు చందా లింగయ్య, కుర్సం సుబ్బారావు, జేకేసీటీ చైర్మన్ జమాల్‌ఖాన్ పాల్గొన్నారు.
ఒడిశా మాజీ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్
Comments
Please login to add a commentAdd a comment