చెలగాటం
పోలవరం ముంపు బాధితులతో అధికారులు చెలగాటమాడుతున్నారు. సర్వం కోల్పోయి ప్రతిఏటా నానా ఇబ్బందులు పడుతున్న నిర్వాసితులపై అధికారులు చిన్నచూపు చూస్తున్నారు. పోలవరం ప్రాజెక్టు ముంపుతో ఎన్నో గ్రామాల ప్రజలు పనులు లేక బతుకుదెరువు కోసం తలోదారి పోతుంటే, జాబితాలో వారి పేర్లు తొలగించి, పొట్టకొట్టాలని చూస్తున్నారు.
పోలవరం నిర్వాసితులతో
ఆర్ అండ్ ఆర్ జాబితా నుంచి
పేర్ల తొలగింపు
కొందరికేనా
పరిహారం ?
ఆందోళనలో
ముంపు బాధితులు
వి.ఆర్.పురం: మండలంలో రాజుపేట, వడ్డుగూడెం, చిన్నమట్టపల్లి పంచాయతీల ప్రజలు పోలవరం ముంపులో నష్టపోతున్నారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో రూపొందించిన నిర్వాసితుల జాబితాలో బాధితులందరి పేర్లు ఉండగా, కూటమి ప్రభుత్వంలో తాజాగా రూపొందించిన జాబితాలో పలువురి పేర్లు గల్లంతయ్యాయి. కొంత మందికి మాత్రమే పరిహారం ఇచ్చేలా జాబితా తయారు చేయడంపై నిర్వాసితులు ఆందోళన చెందుతున్నారు. దీనిపై అధికారులను ప్రశ్నిస్తే సమాధానం చెప్పకుండా దాటవేస్తున్నారు.
కొలమానమేంటి ?
ఇక్కడే పుట్టి, ఇక్కడే పెరిగి, ఇక్కడే 10వ తరగతి వరకు చదువుకొన్నవారు స్థానికులు అవుతారా ? ఎక్కడి నుంచో వచ్చి స్థిరపడిన వారు స్థానికులు అవుతారా ? అనేది లెక్క తేలాల్సిందేనని, ఎవరు లోకల్, ఎవరు నాన్ లోకల్ అన్న దానిపై అధికారులు ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారని, ఎలాంటి కొలమానం తీసుకొన్నారో చెప్పాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. ఇక్కడ పుట్టడం తాము చేసిన తప్పా అని ముంపు బాధితులు వాపోతున్నారు. ఒక ప్రాంతం నుంచి విడిచి వెళ్లడం అంటే మామూలు విషయం కాదు, ఎక్కడికో వెళ్లి బతకాలి. అంటే మళ్లీ జీవితాన్ని ప్రారంభించాలి. పనులు వెతుక్కోవాలి. ఇన్ని కష్టాలు పడే నిర్వాసితులకు పరిహారం ఇవ్వడానికి ఎందుకు తిరకాసు పెడుతున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అరకొర పేర్లతో జాబితా ?
పోలవరం ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ విషయంలో అధికారుల నిర్లక్ష్యం వల్ల జాబితాలో కొందరి పేర్లు గల్లంతయ్యాయి. దీనిపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. అరకొరగా జాబితాను ప్రచురించడంలో మతలబు ఏంటని మథనపడుతున్నారు. గత అన్ని సర్వేల్లో అందరి పేర్లు ఉన్నప్పడు చివరి గ్రామసభలో ఆర్‌అండ్‌ఆర్ జాబితాలో పేర్లు ఎందుకు తొలగించారంటూ నిర్వాసితులు మండిపడుతున్నారు.
ఈ విషయమై ప్రశ్నించేందుకు బాధితులు అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. అయితే సరైన సమాధానం రావడం లేదు. అధికారులు ఒకరిమీద మరొకరు చెబుతున్నారని బాధితులు వాపోతున్నారు.
గ్రామాల వారీగాగల్లంతైన పేర్ల సంఖ్య
వడ్డుగూడెం పంచాయతీలో మూడు (వడ్డుగూడెం, వి.ఆర్.పురం, ధర్మతాళ్లగూడె) గ్రామాలున్నాయి. ఈ గ్రామాల్లో 1,450 కటుంబాలున్నాయి. కొత్తగా వచ్చిన జాబితా లో వడ్డుగూడెంలో 150, వి.ఆర్.పురంలో 350, ధర్మతాళ్లగూడెంలో 25 పేర్లు గల్లంతయ్యాయి.
రాజుపేట పంచాయతీలో రాజుపేట, తోటపల్లి, సీతంపేటగ్రామాలున్నాయి. వీటి లో సీతంపేటలో నిర్వాసితులకు పరిహారం చెల్లించేశారు. రాజుపేట, తోటపల్లి గ్రామాలు కలిపి 728 కుటుంబాలున్నాయి. వీటిలో అప్రూవల్ అయిన కుటుంబాల 265, పెండింగ్‌లో ఉన్నవి 380, గతంలో జాబితాలో ఉన్న వారిలో ఇప్పుడు 108 మంది పేర్లు గల్లంతయ్యాయి.
చిన్నమట్టపల్లి పంచాయతీలో ప్రత్తిపాక, గుండుగూడెం, చింతరేగిపల్లి, కన్నాయిగూడెం గ్రామాలున్నాయి.
ఈ పంచాయతీలో తుష్టివారి గూడెం నిర్వాసితులకు ఇప్పటికే పరిహారం చెల్లించారు. చింతరేగిపల్లిలో 404 కుటుంబాలున్నాయి. అప్రూవల్ అయినవవి 69 కుటుంబాలు, పెండింగ్‌లో ఉన్నవి 335 కుటుంబాలు. 13 మంది పేర్లు గల్లంతయ్యాయి. గుండుగూడెంలో 209 కుటుంబాలున్నాయి. అప్రూవల్ అయినవి 51, పెండింగ్‌లో 158 కుటుంబాలున్నాయి. కన్నాయి గూడెం, ప్రత్తిపాక గ్రామాలకు లిస్టులు ప్రకటించలేదు.
పరిహారం కొందరికేనా ?
పేర్లు లేనివారు దరఖాస్తు చేసుకోవాలి
జాబితాల్లో తప్పులు దొర్లాయి. అందువల్ల గ్రామ సభలు వాయిదా పడ్డాయి. ఆర్ అండ్ ఆర్ జాబితాలో పేర్లు లేనివారు దరఖాస్తు చేసుకుంటే పరిశీలిస్తాం.
– సరస్వతి, తహసీల్దార్, వి.ఆర్.పురం
పోలవరం ముంపులో వందల కుటుంబాలు నష్టపోతుంటే పరిహారం కొందరికే ఇచ్చేందుకు జాబితాలు రూపొందించడంలో ఆంతర్యం ఏమి టో తెలియడంలేదు. ముంపులోఉన్న అన్ని కు టుంబాల సభ్యులు నిర్వాసితులేనన్న విషయం అధికారులకు తెలియదా? తెలిస్తే ఎందుకు జాబితాలో పేర్లు గల్లంతు చేశారో అర్థంకాక పలువు రు ఆందోళన చెందుతున్నారు. స్థానిక అధికా రుల వల్లే ఈ పొరపాటు జరిగిందా ? లేక మరేమైనా కారణాలున్నాయా? అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇందులో ఎవరి హస్తం ఉంది, ఎందుకు తమ జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని నిర్వాసితులు ప్రశ్నిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment