హార్బర్‌కు హంగులు | - | Sakshi
Sakshi News home page

హార్బర్‌కు హంగులు

Published Mon, Mar 3 2025 12:46 AM | Last Updated on Mon, Mar 3 2025 12:44 AM

హార్బ

హార్బర్‌కు హంగులు

ఏడాదిలోగా నిర్మించేలా కాంట్రాక్టు సంస్థతో ఒప్పందం
సకలసౌకర్యాలహార్బర్‌

సాక్షి, విశాఖపట్నం: ఆశల తీరంలో బతుకు నావలో బిక్కుబిక్కుమంటూ జీవనం వెళ్లదీసే గంగపుత్రుల జీవితాలకు దారి చూపించేలా గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం చొరవతో విశాఖపట్నం పోర్టు అథారిటీ హార్బర్‌ ఆధునికీకరణ పనులు చేపట్టింది. కేంద్ర ప్రభుత్వం సాగరమాల పథకంలో భాగంగా.. రూ.151.81 కోట్లతో పనులు జోరుగా సాగుతున్నాయి. దళారుల చేతిలో మోసపోతూ.. ఆర్థికంగా ఎదగలేకపోతున్న మత్స్యకారులకు లాభాలు అందించేలా ఫిషింగ్‌ హార్బర్‌ ఆధునికీకరణ జరుగుతోంది. ఇప్పటికే పలు పనులు చివరి దశకు చేరుకోగా.. తాజాగా మరో రెండు ఫిషింగ్‌ జెట్టీల నిర్మాణానికి పోర్టు శ్రీకారం చుట్టింది. రూ.32.61 కోట్లతో జెట్టీల నిర్మాణ పనులను ఖరారు చేసింది. ఏడాదిలోగా నిర్మించి.. మత్స్యకారులకు లబ్ధి చేకూరేలా జెట్టీల ఏర్పాటుకు చకచకగా అడుగులు పడుతున్నాయి.

రెండేళ్ల క్రితం ప్రధాని నరేంద్రమోదీ చేతుల మీదుగా వర్చువల్‌ విధానంలో ఫిషింగ్‌ హార్బర్‌ ఆధునికీకరణ పనులు ప్రారంభమయ్యాయి. ఇందుకోసం రూ.151.81 కోట్లు వెచ్చించేందుకు విశాఖపట్నం పోర్టు ముందుకువచ్చింది. అందులో రూ.50 కోట్లు ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన కింద మంజూరు చేశారు. మరో రూ.50 కోట్లు సాగరమాల కింద కేంద్ర నౌకాయానశాఖ ఇచ్చింది. పీపీపీ ప్రాజెక్టుల ద్వారా రూ.27.55 కోట్లు సమకూర్చుకోనున్నారు. విశాఖపట్నం పోర్టు తొలుత రూ.24.26 కోట్లు ఇస్తామని ప్రకటించింది. అయితే మత్స్యకారులు వసతులు పెంచాలని, ఫింగర్‌ జెట్టీలు కావాలని, వలలు అల్లుకోవడానికి భవనం నిర్మించాలని డిమాండ్‌ చేయడంతో మరో రూ.26.7 కోట్లు సమకూర్చడానికి విశాఖపట్నం పోర్టు ముందుకువచ్చింది. దీంతో పోర్టు వాటా రూ.50.96 కోట్లకు చేరింది. మత్స్యకారులకు మరిన్ని ప్రయోజనాలు చేకూర్చేలా హార్బర్‌ అభివృద్ధి జరగాలంటూ అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సూచించడంతో 2023లో డీపీఆర్‌లో స్వల్పమార్పులు చేపట్టారు. ముందుగా ప్రతిపాదించిన 3,4,5 జెట్టీలకు బదులు జీరో జెట్టీకి సమాంతరంగా ఫ్లోటింగ్‌ జెట్టీని నిర్మించాలని, అదేవిధంగా చేపల వేలం, ప్యాకింగ్‌ ప్రాంతాల్లో కట్టడాల్ని తొలగించి.. మరో జెట్టీని ఏర్పాటు చేసేలా డీపీఆర్‌లో మార్పులు చేపట్టారు. దానికనుగుణంగా తాజాగా నిర్మాణ ప్రక్రియకు అడుగులు పడుతున్నాయి.

హార్బర్‌కు రాకపోకలు సులువయ్యేలా రహదారి నిర్మాణం

ఇక్కడే రెండు ఫిషింగ్‌ జెట్టీలు రాబోతున్నాయి

డిమాండ్‌కు అనుగుణంగా వసతుల కల్పనే హార్బర్‌ ఆధునికీకరణ ప్రధాన ధ్యేయంగా పనులు సాగుతున్నాయి. వేలం హాళ్లు, ప్యాకింగ్‌ యూనిట్‌, పార్కింగ్‌ ఏరియా, ఆఫీసుకు ప్రత్యేక సదుపాయం, రెస్ట్‌ రూమ్‌, క్యాంటీన్‌, చేపలు ఎండబెట్టుకోవడానికి పరిశుభ్రమైన యార్డులు, చేపలు నిల్వ చేసుకునే సదుపాయం, ఫ్లోటింగ్‌ జెట్టీలు, వాటికి రిటైనింగ్‌ గోడలు, మురుగునీటిని శుద్ధిచేసే ప్లాంటు, అంతర్గత రహదారులు, అండర్‌ గ్రౌండ్‌ రిజర్వాయర్‌, ఓవర్‌ హెడ్‌ ట్యాంక్‌, సోలార్‌ విద్యుద్దీపాల ఏర్పాటు పనులు తుది దశకు చేరుకున్నాయి. పనులన్నింటిని ఏడు దశలుగా విడదీసి వర్క్‌ ఆర్డర్లు అప్పగించారు. అదనంగా మరో వేలం హాలు నిర్మించనున్నారు. కొత్త వేలం హాలును ఏసీ సదుపాయంతో ఏర్పాటు చేసేలా నిర్మాణం సాగుతోంది. బోట్ల నుంచి దించిన చేపలు, రొయ్యలను వేలం హాళ్లకు కన్వేయరు బెల్టుల ద్వారా పంపే ఏర్పాట్లూ రానున్నాయి. దించి,ఎత్తడం వల్ల సముద్ర ఉత్పత్తులు పాడైపోకుండా ఈ సదుపాయం కల్పిస్తున్నారు. పోర్టుకు చెందిన 10 ఎకరాల స్థలంలో కోల్డ్‌ స్టోరేజ్‌ రాబోతోంది. దీన్ని పబ్లిక్‌ ప్రైవేట్‌ భాగస్వామ్యంతో.. నిర్ణీత ధరలతో నిర్వహించేలా నిర్మించాలని పోర్టు అధికారులు భావిస్తున్నారు. అదేవిధంగా ప్రస్తుతం ఫిషింగ్‌ హార్బర్‌ వద్ద ప్రైవేట్‌ ప్రోసెసింగ్‌ ప్లాంట్స్‌ ఉన్నాయి. ఈ ప్రైవేట్‌ వ్యాపారులు నిర్ణయించిన ధరలకే అమ్ముకోవాల్సి వస్తోంది. అందుకే.. ప్రత్యేకంగా ప్రాసెసింగ్‌ ప్లాంట్‌ కూడా రాబోతోంది. బోట్లు మరమ్మతులు చేసుకునేందుకు ప్రత్యేక రిపేరింగ్‌ సెంటర్‌ కూడా నిర్మించనున్నారు. ప్రస్తుతం 24 హెక్టార్లలో ఉన్న ఫిషింగ్‌ హార్బర్‌లో ఆధునిక మౌలిక సదుపాయాలు కల్పిస్తు ప్రపంచస్థాయి ప్రమాణాలకు అనుగుణంగా మోడ్రన్‌ హార్బర్‌గా త్వరలోనే మారనుందని పోర్టు అధికారులు చెబుతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
హార్బర్‌కు హంగులు1
1/2

హార్బర్‌కు హంగులు

హార్బర్‌కు హంగులు2
2/2

హార్బర్‌కు హంగులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement