పట్టం ఎవరికి..! | - | Sakshi
Sakshi News home page

పట్టం ఎవరికి..!

Published Mon, Mar 3 2025 12:46 AM | Last Updated on Mon, Mar 3 2025 12:45 AM

పట్టం ఎవరికి..!

పట్టం ఎవరికి..!

మొత్తం బ్యాలెట్‌ బాక్సులు 123
లెక్కింపు ప్రారంభంఉదయం 8 గంటలకు
నేడు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు
● ప్రథమ ప్రాధాన్యత ఓటుపైనేఅందరి ఆశలు ● గెలుపుపై ధీమాతో అభ్యర్థులు ● మొదటి ప్రాధాన్యత ఓటుతో తేలితే ఫలితం సాయంత్రం 5 గంటల్లోపే.. ● లేదంటే రాత్రి 9 గంటలు దాటే అవకాశం ● ఉత్కంఠలో ఉత్తరాంధ్ర ఉపాధ్యాయులు
మొత్తం టేబుల్స్‌ 20

బరిలో ఉన్న అభ్యర్థులు

10 మంది

మొత్తం ఓట్లు

22,493

సాక్షి, విశాఖపట్నం: ఉత్తరాంధ్ర ఉపాధ్యాయులు.. ఎన్నికల పరీక్షల్లో ‘ఫస్ట్‌’ మార్కు ఎవరికి ఇచ్చారో.. మరికొద్ది గంటల్లోనే తేలనుంది. టీచర్‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోలైన ఓట్ల లెక్కింపునకు ఏయూ ఇంజినీరింగ్‌ కాలేజీ సిద్ధమైంది. 10 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని ఉపాధ్యాయులు గత నెల 27 బ్యాలెట్‌ బాక్సుల్లో నిక్షిప్తం చేశారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియ సుదీర్ఘంగా సాగే ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు.. బాగా ఆలస్యమయ్యే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. మొదటి ప్రాధాన్యత ఓటుతో ఫలితం తేలితే.. సాయంత్రం 5 గంటలకల్లా విజేతను ప్రకటించే అవకాశం ఉంది. లేదంటే.. రాత్రి 9 లేదా 10 గంటలకు ఫలితం డిక్లేర్‌ అవుతుందని అంచనా వేస్తున్నారు. ఏయూ ఇంజినీరింగ్‌ కాలేజీ ట్రిపుల్‌ఈ విభాగం భవనంలో ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉదయం 8 గంటలకు లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కానుంది. మొత్తం 3 దశల్లో ఈ ప్రక్రియ జరగనుంది. ఎన్నికల బరిలో ఉన్న 10 మంది అభ్యర్థుల సమక్షంలో స్ట్రాంగ్‌ రూమ్‌ సీల్స్‌ తొలగించి.. బ్యాలెట్‌ బాక్సుల్ని హాల్‌లోకి తీసుకొస్తారు. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అనకాపల్లి, అల్లూరిసీతారామరాజు, విశాఖపట్నం జిల్లాలకు సంబంధించి మొత్తం 123 బ్యాలెట్‌ బాక్సులు ఉన్నాయి. లెక్కింపు కోసం 20 బల్లలు ఏర్పాటు చేశారు. ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొత్తం 22,493 మంది ఓటర్లున్నారు. వీరిలో 20,795 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు.

మూడు దశల్లో ప్రక్రియ సాగుతుందిలా.

సార్వత్రిక ఎన్నికల కంటే భిన్నంగా లెక్కింపు ప్రక్రియ ఉంటుంది. మొత్తం మూడు దశల్లో జరగనుంది. మొదటి దశలో 123 బాక్సుల్లో ఉన్న ఓట్లను బయటికి తీస్తారు. మొత్తం ఆరు రౌండ్లుగా విభజించి ఓట్లను బయటికి తీసేనాటికి 11 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. తర్వాత దశలో పోలైన ఓట్లను 25 చొప్పున ఒక కట్టగా కడతారు. ఇలా కట్టల్లో వెయ్యి ఓట్లు అయితే వాటిని ఒక డ్రమ్‌లో వేస్తారు. మొత్తం ఓట్లను వివిధ డ్రమ్ముల్లో వెయ్యి చొప్పున వేస్తారు. ఈప్రక్రియ ముగిసే నాటికి మధ్యాహ్నం 2 గంటలయ్యే సూచనలున్నాయి. భోజన విరామం తర్వాత చివరి దశలో పోలైన ఓట్ల లెక్కింపు జరుగుతుంది. తొలిగా మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ప్రక్రియ నిర్వహిస్తారు. ఈ ప్రక్రియలో విజేత ఎవరో తేలితే ప్రక్రియ ముగిసినట్లే. తొలి ప్రాధాన్యత ఓటుతో విజేత తేలితే.. సాయంత్రం 5 గంటలకల్లా ఫలితం ప్రకటిస్తారు. రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపునకు వెళ్తే మాత్రం 9 గంటలు దాటే అవకాశం ఉంది.

పోలైన ఓట్లు 20,795

సగానికంటే ఒక్క ఓటు ఎక్కువ వస్తే విజేతే..

పోలైన ఓట్లలో చెల్లుబాటు అయిన ఓట్లనే పరిగణనలోకి తీసుకుంటారు. అలా ఆ ఓట్లలో సగానికంటే ఒక్క ఓటు ఎక్కువ వచ్చినా ఆ అభ్యర్థిని విజేతగా ప్రకటిస్తారు. ఉదాహరణకు మొత్తం పోలైన ఓట్లు 20,795 ఓట్లు కాగా.. చెల్లని ఓట్లు 795 ఉంటే.. 20,000 ఓట్లను చెల్లుబాటు ఓట్లుగా పరిగణిస్తారు. చెల్లుబాటు ఓట్లలో సగం కంటే ఒక్క ఓటు ఎక్కువగా వచ్చినా వారిని విజేతగా ప్రకటిస్తారు. అంటే.. 20 వేల ఓట్లలో 10,001 ఓట్లు తొలి ప్రాధాన్యం ఎవరికి వస్తే.. వారినే విజేతగా నిర్ణయిస్తారు. మొదటి ప్రాధాన్యత ఓటుతో ఏ అభ్యర్థి ఈ మార్క్‌ను చేరుకోకపోతే ఎలిమినేషన్‌ ప్రక్రియను ప్రారంభిస్తారు. గెలుపు కోటాకు సరిపడినన్ని ఓట్లు ఎవరికై తే వస్తాయో అప్పటి వరకు మిగతా ప్రాధాన్యత ఓట్లను లెక్కిస్తారు. ఈ విధంగా మొదటి ప్రాధాన్యత తర్వాత రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కిస్తారు. అయితే పోటీ చేసిన అభ్యర్థుల్లో అందరికన్నా మొదటి ప్రాధాన్యత ఓట్లు తక్కువ వచ్చిన అభ్యర్థి నుంచి ఈ ఎలిమినేషన్‌ ప్రక్రియ ప్రారంభం అవుతుంది. అభ్యర్థులు సాధించిన మొదటి ప్రాధాన్యత ఓట్ల జాబితాను ఎక్కువ నుంచి తక్కువకు తయారు చేస్తారు. ఇలా చివరి అభ్యర్థికి వచ్చిన ఓట్లలో రెండో ప్రాధాన్యత ఎవరికి వేశారనే ఓట్లను లెక్కించి ఆ ఓట్లను ఆయా అభ్యర్థులకు జమ చేస్తూ వస్తారు. ఇలా కింద నుంచి పై వరకు ఇదే తరహాలో లెక్కించి, ఈ ఓట్లను వారికి కలుపుతూ చివరి అభ్యర్థులను ఎలిమినేట్‌ చేస్తూ వెళతారు. ఒకవేళ ద్వితీయ ప్రాధాన్యత ఓట్లలోనూ మెజార్టీ ఓట్ల మార్కుకు ఏ అభ్యర్థి చేరకపోతే తృతీయ ప్రాధాన్యత ఓట్లను గణించి ఆ అభ్యర్థులకు జమ చేస్తారు. అప్పటికీ కాకపోతే నాలుగో ప్రాధాన్యం ఇలా మెజారిటీ మార్కు సంఖ్యను ఏదో ఒక అభ్యర్థి చేరేవరకు ఎలిమినేషన్‌ ప్రక్రియ అనేది సాగుతుంది. అందుకే అభ్యర్థుల గెలుపు ఓటముల్లో మొదటి ప్రాధాన్యంతో పాటు ఇతర ప్రాధాన్యత ఓట్లు కూడా చాలా కీలకం అవుతాయి.

గెలుపుపై ధీమా..

టీచర్‌ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై ఉపాధ్యాయుల్లోనూ ఉత్కంఠ నెలకొంది. మొత్తం 10 మంది అభ్యర్థులు బరిలో ఉన్నా.. పోటీ మాత్రం ముగ్గురి మధ్యనే కొనసాగుతోంది. ఉపాధ్యాయులే ప్రధాన బలంగా.. పీ ఆర్‌టీయూ తరఫున గాదె శ్రీనివాసులునాయుడు విజయం సాధిస్తారనే ధీమా అందరిలో ఉంది. రెండుసార్లు ఎమ్మెల్సీగా పనిచేసిన గాదె విజయం ఖాయమని ఉపాధ్యాయులు చెబుతున్నారు. అయితే అధికార పార్టీలైన టీడీపీ, జనసేన బలపరిచిన ఏపీటీఎఫ్‌ అభ్యర్థి రఘువర్మ విజయం కోసం ఆ రెండు పార్టీలూ పోలింగ్‌ రోజు వరకూ ప్రలోభాలకే ప్రథమ ప్రాధాన్యమిచ్చాయి. రఘువర్మ గెలుస్తారని కూటమి నేతలు భావిస్తున్నారు. ఉపాధ్యాయ వృత్తికి రాజీనామా చేసి పీడీఎఫ్‌ అభ్యర్థిగా బరిలో దిగిన కోరెడ్ల విజయగౌరీ కూడా గెలుపుపై ధీమాతో ఉన్నారు. ఉత్తరాంధ్ర టీచర్లు ఎవరికి పట్టం కట్టారన్నది సోమవారం సాయంత్రం లేదా రాత్రికి తేలిపోనుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement