కోర్కెలు తీర్చే కల్పవల్లి గంగమ్మతల్లి
ముంచంగిపుట్టు: మండలంలోని పాత సుజనకోట గ్రామంలో మత్స్యగెడ్డ ఒడ్డున వెలసిన గంగమ్మతల్లి ఉత్సవాలను ఈ నెల 3,4 తేదీల్లో ఘనంగా నిర్వహించనున్నారు. ఈ మేరకు ఉత్సవ కమిటీ ఏర్పాట్లు పూర్తి చేసింది. కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లిగా కొలువైన గంగమ్మ తల్లికి ఏటా ఉత్సవాలను ఎంతో ఘనంగా నిర్వహిస్తారు.3వ తేదీ రాత్రి అమ్మవారికి సుమారు రెండు వేల మందికి పైగా భక్తులు ఘటాలను సమర్పిస్తారు. ఈ సందర్భంగా బుడియాల విన్యాసాలు, పలు సాంస్కృతిక కార్యక్రమాలతో జాతరను నిర్వహిస్తారు. 4వ తేదీన తెల్లవారు జామునుంచే భక్తులు మొక్కులు తీర్చుకుంటారు. ఈ గ్రామానికి చెందిన వారు ఎక్కువగా విశాఖ,ఇతర ప్రాంతాల్లో ఉద్యోగాల్లో స్థిరపడ్డారు.ఏటా జరిగే గంగమ్మతల్లి ఉత్సవాలకు ఆర్థిక సహాయం అందించడంతో పాటు కుటుంబసమేతంగా వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు. ఉత్సవాల సందర్భంగా అమ్మవారి ఆలయాన్ని సుందరంగా తీర్చి దిద్దడంతో పాటు ఆకట్టుకునేలా విద్యుత్‌దీపాలతో అలంకరించారు. జాతర సందర్భంగా వైద్య శిబిరం,పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు. ఉత్సవ ఏర్పాట్లను ఆదివారం స్థానిక సర్పంచ్ వెంగడ రమేష్,ఉత్సవ కమిటీ అధ్యక్షకార్యదర్శులు,కమిటీ సభ్యులు పర్యవేక్షించారు.
బుడియా మాలతో గిరిజనుల సందడి
గంగమ్మతల్లి మొక్కుబడుల్లో భాగంగా అధిక సంఖ్యలో గిరిజనులు బుడియా మాల ధరిస్తారు. శరీరం అంతా తెల్లటి సున్నంతో చారలుగా రాసుకొని కర్రలు పట్టుకొని,కేవలం ఫ్యాంట్ మాత్రమే వేసుకుంటారు. ఈ మాల ధరించిన వారు వారం రోజుల పాటు నూనె వంటకాలను తినరు. ఉన్నత స్థాయి ఉద్యోగుల మొదలు ఎంతో మంది ఈ మాల ధరించి,కర్ర పట్టుకొని విన్యాసాలు చేస్తూ పాటలు పాడుతూ గ్రామాల్లో తిరుగుతూ గంగమ్మతల్లి పండగపై ప్రచారం నిర్వహించడంతో పాటు నగదు,బియ్యం,కూరగాయలు సేకరిస్తారు.ఇలా సేకరించిన బియ్యం,కూరగాయలతో వంట చేసి సహపంక్తి భోజనాలు చేస్తారు.
అన్ని ఏర్పాట్లు చేశాం
గంగమ్మ తల్లి ఉత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా పోలీసు,రెవెన్యూశాఖలతో పాటు పలు శాఖల అధికారులు సేవలందించనున్నారు. ఆలయానికి వెళ్లే కొండ ప్రాంతమంతా దారిపొడువునా విద్యుత్ సౌకర్యం కల్పించాం.గిరిజన సంస్కృతి,సంప్రదాయాల ప్రకారం గంగమ్మతల్లి ఉత్సవాలను నిర్వహిస్తున్నాం.40వేల మందికి పైగా భక్తులు సరిహద్దు గ్రామాల నుంచి వస్తారని అంచనా వేస్తున్నాం.పార్కింగ్ సమస్య లేకుండా ప్రత్యేక స్థలం కేటాయించడం జరిగింది.
– వెంగడ రమేష్, సర్పంచ్,
సుజనకోట పంచాయతీ
నేటి నుంచి సుజనకోటలో ఉత్సవాలు
గిరిజన సంస్కృతి,సంప్రదాయాల ప్రకారం నిర్వహణ
ఏర్పాట్లు పూర్తి చేసిన ఉత్సవ కమిటీ
కోర్కెలు తీర్చే కల్పవల్లి గంగమ్మతల్లి
కోర్కెలు తీర్చే కల్పవల్లి గంగమ్మతల్లి
కోర్కెలు తీర్చే కల్పవల్లి గంగమ్మతల్లి
Comments
Please login to add a commentAdd a comment