ప్రశాంతంగా ఏకలవ్య ప్రవేశ పరీక్ష
పాడేరు : జిల్లాలోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాల్లో ఆరవ తరగతిలో ప్రవేశం కోసం ఆదివారం నిర్వహించిన ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా జరిగింది. ఈ పరీక్ష కోసం పాడేరు డివిజన్‌లోని చింతపల్లి మండలంలో మూడు, జీకే వీధి మండలంలో ఒకటి, పాడేరు మండలంలో నాలుగు, అరకులోయ మండలంలో నాలుగు పరీక్ష కేంద్రాలు సహా మొత్తం 12 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉదయం 11.30 గంటల నుంచి 1.30 గంటల వరకు పరీక్ష నిర్వహించారు. ఈ ప్రవేశ పరీక్ష కోసం 4,194 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా 3,939 మంది హాజరయ్యారు. 256 మంది గైర్హాజయ్యారు. పాడేరు డివిజన్‌లో 93.89 శాతం హాజరు నమోదైంది.
రంపచోడవరం, చింతూరు డివిజన్లలో :
రంపచోడవరం, చింతూరు డివిజన్లలో ఆరు పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తం 1,942 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా 1,803 మంది పరీక్షకు హాజరయ్యారు. 139 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు.
శివరాత్రి ప్రత్యేక బస్సుల ద్వారా రూ. 2 కోట్ల ఆదాయం
మధురవాడ(విశాఖ): మహాశివరాత్రి సందర్భంగా విశాఖ ఏపీఎస్‌ఆర్‌టీసీ ప్రత్యేక సర్వీసులు నడపడం ద్వారా రూ.2 కోట్లు ఆదాయాన్ని ఆర్జించిందని జోన్–1 ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎ.విజయ్‌కుమార్, రీజినల్ మేనేజర్ అప్పలనాయుడులు చెప్పారు. గత ఏడాదితో పోలిస్తే రూ.20 లక్షలు అధికంగా ఆదాయం సమకూరిందన్నారు. ఆదివారం మధురవాడ డిపోలో అన్ని విభాగాలను వీరు తనిఖీ చేశారు. నిర్వహణ, పరిశుభ్రత లోపాలు గుర్తించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని, బస్సులు పరిశుభ్రంగా ఉంచాలని సిబ్బందిని ఆదేశించారు. ఈ నెల 5, 6 తేదీల్లో గీతం యూనివర్సిటీలో నిర్వహించే జాబ్‌మేళాకు ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి ప్రత్యేక బస్సులు నడపనున్నట్టు చెప్పారు. కార్యక్రమంలో అసిస్టెంట్ ఇంజినీర్ రాజేశ్వరి, ట్రాఫిక్ సూపర్‌వైజర్ దుర్యోధనుడు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment