పలకజీడిలో బూడిదైన 20 సంతపాకలు
● కొండపై ఎండిన ఆకులకు నిప్పుపెట్టడంతో ప్రమాదం ● పాకలు కాలడంతో వ్యాపారులకు ఇబ్బందులు
కొయ్యూరు: యు.చీడిపాలెం పంచాయతీ పలకజీడిలో గురువారం 20 సంతపాకలు బూడిదయ్యాయి. నాలుగు పాకలు దూరంగా ఉండడంతో అవి మిగిలిపోయాయి. ప్రతి శుక్రవారం పలకజీడిలో సంత నిర్వహిస్తారు. ఇక్కడ కొండను ఆనుకుని సంతపాకలను ఏర్పాటు చేశారు. గురువారం ఉదయం ఎవరో కొండపై ఎండిన ఆకులకు నిప్పుపెట్టారు. ఎండిన ఆకులు కాలుతూ వచ్చి సంతపాకలను అంటుకున్నాయి. అన్నీ తాటాకుల పాకలు కావడంతో మంటలను ఆర్పడం ఎవరికీ సాధ్యం కాలేదు. పైగా గ్రామానికి ఫర్లాంగు దూరంలో పాకలున్నాయి. నీటిని తరలించేందుకు అవకాశం లేకపోయింది. దాదాపుగా 20 గ్రామాలకు చెందిన గిరిజనులు ఈ సంతకు వస్తారు. అల్లూరి జిల్లా అడ్డతీగల, వై.రామవరం, తూర్పుగోదావరి జిల్లా ఏలేశ్వరంలాంటి ప్రాంతాల నుంచి వ్యాపారులు సరకులను తీసుకువస్తారు. వాటిని పాకలలో ఉంచి విక్రయిస్తారు. ఇప్పు డు పాకలు కాలిపోవడంతో వ్యాపారులు సరకులను విక్రయించేందుకు ఇబ్బందులు పడాల్సి వస్తుంది. దీనిపై యు.చీడిపాలెం సర్పంచ్ రమేష్ మాట్లాడుతూ మంటలను ఆర్పేందుకు అవకాశం లేకపోయిందన్నారు. పాకలు వేసుకోవాలంటే ప్రస్తుతం ఒక్కో దానికి రూ.పది వేలు ఖర్చవుతుందన్నారు. ఇలా కాకుండా ప్రభుత్వం రేకుల షెడ్లను ఏర్పాటు చేస్తే ప్రమాదాల నుంచి గట్టెక్కే అవకాశం ఉంటుందన్నారు. అధికారులు ఆదుకోవాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment