చందనోత్సవ ఏర్పాట్లపై ముందస్తు సమీక్ష
● త్వరలో కలెక్టర్ ఆధ్వర్యంలో సమావేశం ● సింహాచలం దేవస్థానం ఈవో కె.సుబ్బారావు
సింహాచలం: వచ్చే నెల 8న జరిగే శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి వార్షిక కల్యాణోత్సవం, 30న జరిగే చందనోత్సవంలను ఎలాంటి లోటుపాట్లు లేకుండా నిర్వహిస్తామని సింహాచలం దేవస్థానం ఇన్‌చార్జి ఈవో కె.సుబ్బారావు తెలిపారు. ఈ వేడుకల నిర్వహణపై దేవస్థానం విభాగాధిపతులతో గురువారం ముందస్తు సమీక్ష నిర్వహించారు. గత చందనోత్సవాల్లో చోటుచేసుకున్న లోటుపాట్లపై చర్చించారు. వాటిని పునరావృతం కానీయరాదన్నారు. వారం రోజులపాటు జరిగే వార్షిక కల్యాణోత్సవాల్లో వైదిక కార్యక్రమాలు, చందనోత్సవం రోజు జరిగే వైదిక కార్యక్రమాలపై ప్రధానార్చకుడు గొడవర్తి శ్రీనివాసచార్యులతో చర్చించారు. ఉత్సవాల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు, సిబ్బంది విధులు నిర్వర్తించాలని సూచించారు. క్యూల ఏర్పాటు, శానిటేషన్, ఇంజినీరింగ్ పనులు, అన్నదానం తదితర పనులపై కూలంకషంగా చర్చించారు. త్వరలోనే జిల్లా కలెక్టర్‌తో సమావేశం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. సమావేశంలో దేవస్థానం డిప్యూటీ ఈవో రాధ, ఈఈలు శ్రీనివాసరాజు, రాంబాబు, డీఈ హరి, ఏఈవో శ్రీనివాసరావు, సూపరింటెండెంట్లు నరసింగరావు, రాజ్యలక్ష్మి, త్రిమూర్తులు, సత్యవాణి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment