గ్రామీణ బ్యాంక్ మేనేజర్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్
ముంచంగిపుట్టు: డ్వాక్రా గ్రూపునకు తప్పుడు లెక్కలతో నోటీసులు జారీ చేసిన ముంచంగిపుట్టు గ్రామీణ వికాస్ బ్యాంక్ మేనేజర్‌పై తగు చర్యలు తీసుకోవాలని లక్ష్మీపురం సర్పంచ్ కె.త్రినాథ్ అన్నారు. గురువారం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ లక్ష్మీపురం పంచాయతీ కర్లాపొధర్ గ్రామానికి చెందిన మదర్ థెరిసా ఎస్‌హెచ్‌జీ గ్రూపునకు గత ఏడాది రూ.లక్షా 60 వేల రుణం మంజూరు అయిందని, అప్పుడు బ్యాంక్ అధికారులు కేవలం 90 వేలు మాత్రమే గ్రూప్‌కు రుణం సొమ్ము అందించారని చెప్పారు. గ్రూప్ సభ్యులు ఇప్పటి వరకు సుమారు రూ.66 వేల రుణం సొమ్ము దశలా వారీగా చెల్లించారని, గ్రూప్ సభ్యులు కేవలం రూ.24 వేలు మాత్రమే రుణం బకాయి ఉన్నారన్నారు. తాజాగా గ్రామీణ వికాస్ బ్యాంక్ మేనేజర్ మదర్ థెరిసా గ్రూపు సభ్యులకు రూ.89,642 బకాయి ఉన్నారని, వెంటనే చెల్లించాలని నోటీసులు ఇవ్వడం జరిగిందని అన్నారు. దీంతో గ్రూప్ సభ్యులు భయాందోళన చెందుతున్నారని, ప్రతి నెల క్రమం తప్పకుండా బ్యాంక్‌లో తీసుకున్న రుణానికి సంబంధించిన సొమ్ము చెల్లిస్తున్నా నోటీసులు ఎలా జారీ చేశారని బ్యాంక్ మేనేజర్‌ను ప్రశ్నించగా పొంతనలేని సమాధానాలు చెబుతున్నారని ఆయన చెప్పారు. బ్యాంక్ ఉన్నతాధికారులు స్పందించి తప్పుడు నోటీసులు ఇచ్చిన బ్యాంక్ అధికారులపై చర్యలు తీసుకోవాలని, లేకుంటే బ్యాంక్ ముందు గ్రూప్ సభ్యులతో కలిసి ఆందోళన చేస్తామని ఆయన హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment