వేసవిలో తాగునీటి ఎద్దడి లేకుండా చర్యలు
కలెక్టర్ దినేష్‌కుమార్
సాక్షి, పాడేరు : జల్‌జీవన్ మిషన్ కింద మంజూరు చేసిన తాగునీటి పనులు అరకొరగా చేసి చేతులు దులుపుకొంటే సంబంధిత శాఖ అధికారులపై చర్యలు తప్పవని కలెక్టర్ దినేష్‌కుమార్ హెచ్చరించారు. జల్‌జీవన్ మిషన్ పథకం కింద తాగునీటి పథకాల కోసం ఇప్పటికే రూ.143 కోట్లు ఖర్చుచేసినట్టు చెప్పారు. ఐటీడీఏ పీవోలు, ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు, ఎంపీడీవోలతో శుక్రవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడుతూ పనులు పూర్తి చేసిన గ్రామాలకు తాగునీరు అందడం లేదని ఫిర్యాదులు వస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. వేసవిలో తాగునీటి ఎద్దడి లేకుండా ప్రణాళికలు రూపొందించాలన్నారు. జల్‌జీవన్ మిషన్ పథకం ద్వారా ఇంటింటికీ తాగునీరు అందించాల్సిన బాధ్యత ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులపై ఉందని చెప్పారు. ఎంపీడీవోలు తాగునీటి పథకాలను పర్యవేక్షించాలని ఆదేశించారు. పథకాల నిర్మాణాల్లో స్థానిక ప్రజాప్రతినిధులను భాగస్వామ్యం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఐటీడీఏ పీవోలు అభిషేక్ గౌడ, కట్టా సింహాచలం, అపూర్వభరత్, ఆర్‌డబ్ల్యూఎస్ ఈఈ జవహర్‌కుమార్, జిల్లా పంచాయతీ అధికారి లోవరాజు పాల్గొన్నారు.
నేడు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ప్రారంభం
జిల్లాలో రంపచోడవరం పీఎంఆర్‌సీ భవనం,పాడేరులోని ఏపీఆర్ స్కూల్ ఎదుట ఉన్న భవనంలోను స్టాంప్స్ అండ్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను శనివారం ప్రారంభించనున్నట్టు కలెక్టర్ దినేష్‌కుమార్ తెలిపారు. ఆ కార్యాలయాల ద్వారా రిజిస్ట్రేషన్ సేవలను జిల్లాలో ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు. శుక్రవారం ఆయన అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ఈనెల 8వతేదీన తహసీల్దార్ కార్యాలయాల్లో భూముల రికార్డులను డిజిటిలేషన్ చేయాలన్నారు. మే 1వ తేదీ నుంచి సంబంధిత గ్రామ పంచాయతీల నుంచి లేఅవుట్, భవన నిర్మాణాలకు ఆన్‌లైన్‌లో ఆమోదం తీసుకోవాలన్నారు.జిల్లా వ్యాప్తంగా భూముల మార్కెట్ విలువలను రిజిష్టర్ కార్యాలయం ఐజీఆర్‌ఎస్.ఏపీ.ఇన్ వెబ్‌సైట్లో పొందుపరిచినట్టు కలెక్టర్ తెలిపారు. ఈకార్యక్రమంలో జేసీ డాక్టర్ అభిషేక్‌గౌడ,ఐటీడీఏ పీవోలు సింహాచలం, అపూర్వభరత్,సబ్‌కలెక్టర్‌లు సౌర్యమన్‌పటేల్,కల్పశ్రీ,జిల్లా రిజిష్టర్ ఉపేంద్రరావు,సబ్ రిజిస్ట్రార్ రమేష్,డీపీవో లవరాజు,డీఎల్‌పీవో కుమార్, తహసీల్దార్‌లు, ఎంపీడీవోలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment