డోలీ మోతలు లేకుండా చర్యలు | - | Sakshi
Sakshi News home page

డోలీ మోతలు లేకుండా చర్యలు

Published Wed, Mar 12 2025 8:10 AM | Last Updated on Wed, Mar 12 2025 8:05 AM

డోలీ మోతలు లేకుండా చర్యలు

డోలీ మోతలు లేకుండా చర్యలు

పాడేరు: జిల్లాలో డోలీ మోతల నివారణకు చర్యలు చేపడుతున్నామని కలెక్టర్‌ ఎ.ఎస్‌ దినేష్‌కుమార్‌ తెలిపారు. శ్రీకాకుళం జిల్లా కొవ్వాడ న్యూక్లియర్‌ పవర్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా సంస్థ రూ.కోటి వ్యయంతో సమకూర్చిన ఏడు అంబులెన్సులను ఐటీడీఏ కార్యాలయం వద్ద మంగళవారం ఆయన ప్రారంభించారు. ఈసందర్భంగా జరిగిన సమావేశంలో కలెక్టర్‌ మాట్లాడుతూ కార్పొరేట్‌ సంస్థలు సామాజిక బాధ్యతగా వితరణగా ఇచ్చిన అంబులెన్సులను వైద్య సేవలకు వినియోగిస్తున్నామని చెప్పారు. జిల్లాలో 370 గ్రామాలకు రహదారులు లేవని రానున్న రెండు మూడు సంవత్సరాల్లో రోడ్ల నిర్మాణానికి చర్యలు చేపడతామని చెప్పారు. ఐటీడీఏ నుంచి అంబులెన్సులకు అయిల్‌ సరఫరా చేస్తున్నట్టు తెలిపారు. సినీనటుడు సోనూసూద్‌ రెండు అంబులెన్సులను వితరణ చేశారని చెప్పారు. జిల్లాకు 1,650 సెల్‌ టవర్ల మంజూరుకాగా 1,000 టవర్ల నిర్మాణం పూర్తి చేసినట్టు తెలిపారు. అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం మాట్లాడుతూ ప్రజారోగ్యానికి అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. గోమంగి, రూడకోట, గన్నెల, ఉప్ప తదితర పీహెచ్‌సీలకు అంబులెన్సులు మంజూరు చేయాలన్నారు. ఐటీడీఏ ఇన్‌చార్జి పీవో, జేసీ ఎం.జె అభిషేక్‌ గౌడ్‌ మాట్లాడుతూ ఈ ఏడు అంబులెన్సులను కోరుకొండ, ఈదులపాలెం, జి.మాడుగుల, జీకే.వీధి, ఉప్ప, ఆర్‌.వి.నగర్‌, రాజేంద్రపాలెం పీహెచ్‌సీలకు కేటాయించినట్టు చెప్పారు. పాడేరు మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వైద్య రంగానికి పెద్దపీట వేస్తోందన్నారు. కొవ్వాడ న్యూక్లియర్‌ పవర్‌ కార్పొరేషన్‌ అసోసియేట్‌ డైరెక్టర్‌ కె.వి.ఎస్‌.బి.వి. ప్రసాద్‌ మాట్లాడుతూ గిరిజన ప్రాంతంలో వైద్య సేవలు అందించడానికి వీలుగా ఏడు అంబులెన్సులను మంజూరు చేశామని తెలిపారు. ఈకార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్‌ జమాల్‌ బాషా, డీఐవో ఎం.హేమలత, ఎన్‌పీసీఐల్‌ అడిషనల్‌ చీఫ్‌ ఇంజినీరు బి.రవికుమార్‌ హెచ్‌ఆర్‌ మేనేజర్‌ ప్రదీప్‌కుమార్‌, లగిశపల్లి సర్పంచ్‌ పార్వతమ్మ పాల్గొన్నారు.

కలెక్టర్‌ దినేష్‌కుమార్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement