సరికొత్త హంగులతో వైఎస్సార్ స్టేడియం
విశాఖ స్పోర్ట్స్: ఐపీఎల్ ప్రస్తుత సీజన్‌కు విశాఖలోని వైఎస్ రాజశేఖరరెడ్డి ఏసీఏ–వీడీసీఏ స్టేడియం సిద్ధమవుతోంది. మరో సారి ఢిల్లీ క్యాపిటల్స్ సెకండ్ హోం గ్రౌండ్‌గా విశాఖ స్టేడియాన్ని ఎంచుకోవడమే కాకుండా తొలి మ్యాచ్‌ను ఇక్కడే ఆడి సీజన్‌కు శ్రీకారం చుట్టనుంది. 27,251 మంది అభిమానులు ప్రత్యక్షంగా మ్యాచ్‌ను వీక్షించే అవకాశం ఉన్న వైఎస్సార్ స్టేడియంలో డీసీ తొలి మ్యాచ్ లక్నో సూపర్ జెయింట్స్‌తో 24వ తేదీ రాత్రి ఏడున్నర గంటలకు ఆడనుంది. అలాగే ఈ నెల 30వ తేదీ ఆదివారం సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్ మధ్యాహ్నం మూడున్నరకే ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌ల నిర్వహణకు వీలుగా స్టేడియంలో ఆధునిక హంగులు సమకూరుస్తున్నారు. ఆటగాళ్ల గ్రీన్‌రూమ్స్‌తో సహా డగౌట్స్‌ను ఆధునికీకరించారు. మ్యాచ్‌ల్లో డ్రెస్సింగ్ రూమ్‌కి చాలా ప్రాధాన్యం ఉన్నా.. టీ–20లో ఆటగాళ్లు కూర్చునేందుకు మైదానానికి ఇరువైపులా ఉండే డగౌట్స్ ప్రత్యేకతను సంతరించుకుంటాయి. డీసీ మేనేజ్‌మెంట్ సూచనల మేరకు ఏసీఏ ప్రత్యేక దృష్టి పెట్టి సాధారణ ప్రేక్షకులతో పాటు కార్పొరేట్‌కు పెద్దపీట వేసింది. అందుకు అనువుగా 34 వీఐపీ కార్పొరేట్ బాక్స్‌లతో పాటు రెండు టీమ్ బాక్స్‌లను ఆధునికీకరించింది. ఫైర్ ఫైటింగ్ ఎక్విప్‌మెంట్‌తో సహా నాలుగు లిఫ్ట్‌ల్లో ఒకేసారి 64 మంది వెళ్లే విధంగా తీర్చిదిద్దింది. దాదాపు రూ.40 కోట్ల వరకు వెచ్చించి స్టేడియంలో సౌకర్యవంతమైన సీటింగ్ ఏర్పాట్లతో పాటు అభిమానులకు బాత్‌రూమ్‌లను సైతం మూడింతలు పెంచి సౌకర్యాలు కల్పించింది. స్టేడియంలో ఫ్లడ్‌లైట్లు ఏర్పాటు చేసి 14 ఏళ్లు దాటిపోవడంతో.. వాటి స్థానంలో రూ.9.5 కోట్లు వెచ్చించి ఆధునిక టెక్నాలజీతో పూర్తి నైట్ మ్యాచ్‌కు అనువుగా ఆధునికీకరించింది. పెవిలియన్ ఎండ్ సౌత్ బ్లాక్‌లో ఆటగాళ్ల రూమ్, డగౌట్‌కు పైన 1,640 మంది కూర్చునే కార్పొరేట్ బాక్స్‌లు అన్ని హంగులతో సిద్ధమయ్యాయి. ఆటగాళ్లకు దగ్గరగా ఉండే అప్పర్ వెస్ట్, జి, ఐ స్టాండ్స్‌లోనూ సిట్టింగ్ ఏర్పాట్లను మెరుగుపరిచారు. స్టేడియంలో మొత్తంగా కార్పొరేట్ బాక్స్‌లతో సహా 22 స్టాండ్స్ ఉన్నాయి. ఈ రెండు మ్యాచ్‌లకు టికెట్లను త్వరలో ఆన్‌లైన్‌తో పాటు ఆఫ్‌లైన్‌లో విక్రయించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
సరికొత్త హంగులతో వైఎస్సార్ స్టేడియం
Comments
Please login to add a commentAdd a comment