వి.ఆర్.పురం: శ్రీరామనవమి సమీపించిన నేపథ్యంలో శ్రీరామగిరి దేవాలయ నిర్వాహకులు గురువారం ఐటీడీఏ పీవో అపూర్వ భరత్‌ను కలసి ఏర్పాట్ల గురించి చర్చించారు. భక్తుల సౌకర్యార్థం అధికారులు తీసుకోవలసిన చర్యల గురించి వివిధ శాఖలకు ఆదేశాలు ఇస్తామని పీవో వారికి తెలిపారు. పోలవరం ప్రాజెక్టు ముంపు వల్ల దేవాలయం కనుమరుగయ్యే పరిస్థితి నెలకొన్నందున శ్రీరామగిరిని ద్వీప దేవాలయం (ఐలెండ్ టెంపుల్)గా అభివృద్ధి చేయాలని ఈ సందర్భంగా నిర్వాహకులు వినతిపత్రం ఇచ్చారు. అనంతరం శ్రీరామనవమి వేడుకల పోస్టర్‌ను పీవో ఆవిష్కరించారు. ఉత్సవ ఆహ్వాన పత్రికను నిర్వాహకులు ఆయనకు అందజేశారు. పీవోను కలిసిన వారిలో అర్చకులు సౌమిత్రి పురుషోత్తమాచార్యులు, వెంకన్నదొర, చైర్మన్ సుదర్శన్, సర్పంచ్ పులి సంతోష్ కుమార్, ఈవో సాయిబాబు, దేవదాయ ధర్మాదాయ శాఖ ఈఈ లక్ష్మీకుమార్, నాయకులు శ్రీనివాస్, లక్ష్మణరావు, రామారావు, రాజేంద్రప్రసాద్, అంజన్‌రావు, శ్రీరామ్మూరి తదితరులున్నారు.