సీలేరు: సీలేరు కాంప్లెక్సు పరిధిలోని ఎగువ సీలేరు జలవిద్యుత్ కేంద్రంలో 24 గంటల్లో అత్యధికంగా 5.126 మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తిని చేసి సీలేరు జలవిద్యుత్ కేంద్రం ఆల్ టైం రికార్డును నెలకొల్పిందని ఏపీ జెన్‌కో కాంప్లెక్సు చీఫ్ ఇంజనీర్ వాసుదేవరావు తెలిపారు. ఆయన గురువారం మాట్లాడుతూ.. సీలేరు జలవిద్యుత్ కేంద్రంలో 1967లో ఉత్పత్తిని ప్రారంభించారని, అప్పటి నుంచి జలవిద్యుత్ కేంద్రంలో 24 గంటల్లో 3 నుంచి 4 మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తి మాత్రమే జరిగేదని అన్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి 26న 4.949 మిలియన్ యూనిట్ల ఉత్పత్తిని సాధించి రికార్డు నెలకొల్పగా, మార్చి 24 ఉదయం 6 గంటల నుంచి 25వ తేదీ ఉదయం 6 గంటల వరకు 24 గంటల్లో 5.126 మిలియన్ యూనిట్లు ఉత్పత్తి చేసి జలవిద్యుత్ కేంద్రం 58 ఏళ్ల చరిత్రలో అత్యధిక రికార్డును నెలకొల్పిందన్నారు. ఈ ఏడాది కేంద్ర విద్యుత్ అథారిటీ సీలేరు జల విద్యుత్ కేంద్రానికి 477 మిలియన్ యూనిట్లు టార్గెట్ నిర్దేశించగా ఆ లక్ష్యాన్ని ఫిబ్రవరి 27 నాటికి పూర్తి చేసి, జెన్‌కో ఉన్నతాధికారుల మన్ననలను పొందిందన్నారు. సీలేరు కాంప్లెక్సు పరిధిలోని పొల్లూరు, డొంకరాయి, ఎగువ సీలేరు, మాచ్‌ఖండ్ జలవిద్యుత్ కేంద్రాలకు 2024–25 సంవత్సరానికి 2286.14 మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తిని టార్గెట్‌గా సెంట్రల్ విద్యుత్ అథారిటీ నిర్దేశించదని, సీలేరు కాంప్లెక్సుకు నిర్దేశించిన లక్ష్యాన్ని మించి విద్యుదుత్పత్తిని చేసిందని గురువారం సీఈ వాసుదేవరావు తెలిపారు.
24 గంటల్లో 5.126 మిలియన్
యూనిట్ల విద్యుదుత్పత్తి