
నెత్తుటి మరకలు
విశాఖ నగరిపై
● వరుస హత్యలతో ప్రజల్లో భయాందోళనలు ● మహిళలపై అఘాయిత్యాలతో పెరుగుతున్న అభద్రతా భావం ● తల్లీ కూతుళ్లపై ప్రేమోన్మాది ఘాతుకంతో మరోసారి ఉలిక్కిపడ్డ నగరం ● కూటమి సర్కారు హయాంలో విశోకపట్నం
సాక్షి, విశాఖపట్నం/అల్లిపురం: ప్రశాంత విశాఖ నగరం నెత్తుటి మరకలతో ఎర్రబడుతోంది. వరుస నేరాలతో ఉలిక్కి పడుతోంది. తరచూ లైంగికదాడులు, హత్యలు, దొంగతనాలు, దాడుల భయం నీడలా వెంటాడుతోంది. సిటీ ఆఫ్ డెస్టినీగా పిలుచుకునే సుందర విశాఖ నగరంలో రోజూ ఏదో ఒక నేర నమోదుతో ప్రజల్లో కలవరం మొదలైంది. కూటమి పాలనలో అరాచక శక్తులకు, అడ్డాగా మారిందనే ఆందోళన అందరిలోనూ కనిపిస్తోంది. ఒక విషాదం తర్వాత మరొకటి జరుగుతుండటంతో నగరంలో ఏం జరుగుతుందోనన్న భయం అందరిలోనూ నెలకొంది. మూడు వారాల క్రితం పెదగదిలిలో ఐదు నెలల కుమార్తెని కన్నతల్లి హత్య చేసిన ఘటన మరవక ముందే.. కొమ్మాదిలో ఘోరం అందర్ని కలచివేసింది. పెళ్లికి అంగీకరించడం లేదనే కోపంతో ప్రేమోన్మాది నవీన్.. విచక్షణా రహితంగా చెలరేగిపోయాడు. మిట్ట మధ్యాహ్నం అందరూ చూస్తుండగానే.. రెండు చాకులతో తల్లీ కూతుళ్లపై ఉన్మాదంతో చెలరేగిపోయాడు. ఈ దాడిలో తల్లి మృత్యుఒడికి చేరుకోగా.. కుమార్తె ప్రాణాలతో పోరాడుతోంది. ఈ ఘటన విశాఖనే కాదు యావత్ రాష్ట్రాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఉమ్మడి విశాఖ జిల్లాలోనే హోం మంత్రి ఉన్నా.. మహిళల భద్రత గాల్లో దీపంలా మారిపోయింది. శాంతి భద్రతలు కనుమరుగయ్యే పరిస్థితి ఏర్పడింది.
అంతలోనే మరో అమానుషం
ప్రేమోన్మాది ఘాతుకం జరిగిన కొద్ది గంటల్లోనే మరో అమానుష ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కంచరపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో మతిస్థిమితం లేని మహిళకు చెరకు రసం ఇస్తానని చెప్పి నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి ఓ దుండగుడు అత్యాచారం చేశాడు. మహిళ తల్లిదండ్రులు ఈ విషయాన్ని ఆలస్యంగా తెలుసుకొని పోలీసుల్ని ఆశ్రయించారు. గత నెల 26న 8 ఏళ్ల చిన్నారిపై పలుమార్లు లైంగిక వేధింపులకు పాల్పడిన కీచకుడి ఘటన యావత్ నగరాన్ని శోకసంద్రంలో ముంచేసింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెరుగుతున్న నేరాలతో నగర ప్రజలు భయంభయంగా నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు.
అప్పట్లో ‘దిశ’తో రక్షణ
గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం దిశ యాప్ ద్వారా మహిళలకు రక్షణ కల్పించింది. యాప్‌పై పూర్తి అవగాహన కల్పించటంతో మహిళలు యాప్‌ను వినియోగించుకుని రక్షణ పొందేవారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత దిశ చట్టాన్ని నీరుగార్చారు. మహిళలకు రక్షణ లేకుండా పోతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఒక మహిళ హోంమంత్రిగా ఉండి కూడా మహిళలపై దాడులు జరుగుతున్నా పట్టించుకోక పోవటంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కేవలం మాటలతోనే సరిపెడుతున్నారు తప్ప క్షేత్రస్థాయిలో శాంతిభద్రతల కొరవడ్డాయని ఆందోళన వ్యక్తమవుతోంది. మహిళలు ఒంటరిగా ప్రయాణించాలన్నా, ఎక్కడికై నా వెళ్లాలన్నా భయపడుతున్నారు. మహిళ రక్షణ కోసం ఉపన్యాసాలు ఇచ్చిన ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఇప్పుడు ఎందుకు మాట్లాడటం లేదని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.