
యువతిపై స్నేహితుడి దాడి
● ఫొటోలను ఇంటర్నెట్‌లో అప్‌లోడ్ చేస్తానని బెదిరింపు
● బతిమాలగా ఫొటోలు అప్పగించేందుకు అంగీకారం
● చెప్పిన చోటికి వెళ్లగా యువతిపై వెదురు కర్రలతో దాడి
● అడ్డతీగల సీహెచ్‌సీకి
బాధితురాలి తరలింపు
అడ్డతీగల: మండలంలో పాపంపేట శివారున చేపల చెరువు సమీపాన యువతిపై ఓ యువకుడు దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన సంఘటన గురువారం రాత్రి చోటుచేసుకుంది. గంగవరం మండలం దొరమామిడికి చెందిన బాధితురాలు పుడిగి దుర్గాభవాని కథనం ప్రకారం.. పాపంపేటకు చెందిన మడకం బాబీతో ఆమెకు పరిచయం ఉంది. ఆ పరిచయంతో తీసుకున్న ఫొటోలను ఇంటర్నెట్‌లో అప్‌లోడ్ చేస్తానంటూ తరచూ భవానీని బెదిరించేవాడు. ఫొటోలను అప్పగించమని ఆమె అనేకసార్లు కోరింది. ఫొటోలను తొలగిస్తానని చెప్పి పాపంపేట రమ్మని చెప్పగా కామాడి కృష్ణ అనే వ్యక్తి సహాయంతో గురువారం అక్కడికి వెళ్లింది. వెళ్లిన వెంటనే తనని బైక్‌పై తీసుకొని వెళ్లి పాపంపేట శివారున వెదురుకర్రలతో దాడి చేసి విచక్షణారహితంగా కొట్టాడని వాపోయింది. తాను చనిపోయి ఉంటానని భావించి వెళ్లిపోయాడని పేర్కొంది. తన ఆచూకీ వెతుక్కుంటూ వచ్చిన కామాడి కృష్ణ తీవ్రంగా గాయపడిన తనని అడ్డతీగల పోలీస్‌స్టేషన్‌కి తీసుకొచ్చి విషయం చెప్పిన తరువాత సీహెచ్‌సీకి తీసుకొచ్చారని వివరించింది. దుర్గాభవానీకి తలపై తీవ్రగాయమవ్వడంతో వైద్యులు 10 కుట్లు వేశారు. అడ్డతీగల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.