
బాలికల విద్యకు బాసట
● కేజీబీవీల్లో 6 నుంచి ఇంటర్ వరకు ఉచిత విద్య ● ప్రవేశాలకు ఈ నెల 11 తుది గడువు
విశాఖ విద్య: బాలికా విద్యను ప్రోత్సహించేందుకు ఏర్పాటు చేసిన కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయా(కేజీబీవీ)లు మెరుగైన ఫలితాలిస్తున్నాయి. కార్పొరేట్‌కు దీటుగా అత్యుత్తమ విద్యా బోధన అందిస్తూ బాలికల భవితకు భరోసా కల్పిస్తున్నాయి. 11 నుంచి 17 ఏళ్ల వయస్సున్న బాలికలకు ఇక్కడ 6 నుంచి ఇంటర్ వరకు ఉచిత విద్య అందిస్తున్నారు. అనాథ బాలికలు, దారిద్య్రరేఖకు దిగువనున్న కుటుంబాలకు చెందిన బాలికలకు కేజీబీవీ ప్రవేశాల్లో ప్రాధాన్యత ఇస్తారు.
నాడు–నేడుతో సకల హంగులు
అనాథలు, నిరుపేద వర్గాలకు చెందిన బాలికల కోసం ప్రత్యేకంగా కేజీబీవీలను ఏర్పాటు చేశారు. వీటి ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకుని గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో నాడు–నేడు కార్యక్రమంలో భాగంగా కేజీబీవీల్లో సకల హంగులు కల్పించారు. టోఫెల్ కంటెంట్‌తో డిజిటిల్ విద్యాబోధన, ట్యాబుల వినియోగంతో ఇక్కడి విద్యార్థినులు చదువులతో పాటు, వివిధ పోటీ పరీక్షల్లో సత్తా చాటేలా గత ప్రభుత్వం అవకాశాలు కల్పించింది.
బోధనలో ‘స్మార్ట్’
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం విద్యారంగానికి ఇచ్చిన ప్రాధాన్యత నేపథ్యంలో పాఠశాల స్థాయిలోనే సాంకేతిక విప్లవం మొదలైంది. స్మార్ట్ పాఠాల బోధనతో కేజీబీవీల్లో వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. సైన్స్ ప్రాజెక్టుల రూపకల్పనలో కేజీబీవీ విద్యార్థినులు కార్పొరేట్ విద్యార్థులతో పోటీ పడుతున్నారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరుస్తున్నారు.
ఉమ్మడి జిల్లాలో 42 కేజీబీవీలు
విశాఖ జిల్లాలో 3, అనకాపల్లి జిల్లాలో 20, అల్లూరి సీతారామరాజు జిల్లాలో 19 కేజీబీవీలు ఉన్నాయి. వీటిలో 2025–26 విద్యా సంవత్సరానికి 6వ తరగతి, ఇంటర్ ప్రవేశాల దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. ఆసక్తిగల బాలికలు ఈ నెల 11లోగా http:/apkgbv.apcfss.in వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఒక్కో విద్యాలయంలో 6వ తరగతిలో 40 సీట్లు, ఇంటర్‌లో 40 సీట్లు అందుబాటులో ఉన్నాయి. 7, 8, 9 తరగతుల్లో మిగిలి ఉన్న సీట్లలో కూడా ప్రవేశం పొందవచ్చు.
సద్వినియోగం చేసుకోవాలి
కేజీబీవీల్లో ప్రవేశాలపై దృష్టి సారించాం. విద్యార్థినుల బంగారు భవిష్యత్ కోసం శతథా కృషి చేస్తున్నాం. అర్హులైన విద్యార్థినులు వీటిని సద్వినియోగం చేసుకోవాలి. పూర్తి వివరాలకు వెబ్‌సైట్ లేదా కేజీబీవీల ప్రిన్సిపాళ్లను సంపద్రించవచ్చు.
– డాక్టర్ జోగ చంద్రశేఖర్‌రావు, ఏపీసీ, సమగ్ర శిక్ష, విశాఖ జిల్లా

బాలికల విద్యకు బాసట