
నిర్వాసితుల అభీష్టం మేరకు పునరావాసం
చింతూరు: నిర్వాసితుల అభీష్టం మేరకు పునరావాసం, పరిహారం అందించేందుకు చర్యలు చేపడుతున్నామని ఐటీడీఏ పీవో, ఆర్‌అండ్‌ఆర్ అధికారి అపూర్వభరత్ తెలిపారు. పోలవరం ముంపులో భాగంగా ప్రాధాన్యతా క్రమంలో చేర్చిన 32 గ్రామాలకు చెందిన పీసా కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలతో గురువారం ఆయన ఐటీడీఏ కార్యాలయంలో అభిప్రాయ సేకరణ చేపట్టారు. గ్రామాల వారీగా పునరావాసం ఎక్కడ కావాలి? భూమికి భూమి వంటి అంశాలపై ఆయన నిర్వాసితులను అడిగి తెలుసుకున్నారు. పునరావాస కాలనీలకు తరలివెళ్లిన అనంతరం జీవనోపాధికి చేపట్టాల్సిన చర్యలు, వ్యవసాయ రాయితీలు, పరికరాలు, స్వయం ఉపాధికి రుణాలు వంటి అంశాల గురించి వారితో చర్చించారు. 18 ఏళ్లు దాటిన యువతకు ఎలాంటి నైపుణ్య శిక్షణ అవసరమో అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పీవో మాట్లాడుతూ పరిహారం జాబితాల్లో పేర్లు లేనివారు ఎలాంటి ఆందోళనకు గురికావద్దని, సరైన ఆధారాలు చూపిస్తే పరిహారం అందేలా చేస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటికే కొన్ని గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించామని, మిగతా గ్రామాల్లో కూడా ఈ నెల 20 తరువాత గ్రామ సభలు నిర్వహించి అభ్యంతరాలను పరిశీలిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో నాలుగు మండలాలకు చెందిన స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, తహసీల్దార్లు, ఎంపీడీవోలు పాల్గొన్నారు.
● ఐటీడీఏ పీవో అపూర్వ భరత్