
తీర్మానాలు లేకుండా ఏ పనులు చేయకూడదు
ఎమ్మెల్సీ అనంతబాబు
రంపచోడవరం: తీర్మానాలు లేకుండా ఏ విధమైన పనులు చేయకూడదని ఎమ్మెల్సీ అనంత ఉదయభాస్కర్(అనంతబాబు) అన్నారు. రంపచోడవరం మండల పరిషత్ సర్వసభ్య సమావేశం ఎంపీపీ బందం శ్రీదేవి అధ్యక్షతన గురువారం జరిగింది. సమావేశంలో జెడ్పీటీసీ పండా వెంకటలక్ష్మి, ఎంపీటీసీలు పాల్గొన్నారు. అన్ని శాఖల పనితీరుపై ఎమ్మెల్సీ సమీక్షించారు. మండలంలో జరుగుతున్న అభివృద్ధి పనులపై శాఖల వారీగా సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల అమలు, ప్రారంభోత్సవాల్లో ప్రజాప్రతినిధులకు ప్రాధాన్యం ఇవ్వాలని, ప్రోటోకాల్ ఉల్లంఘన జరిగితే కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్తామని తెలిపారు. మూడు నెలలకు ఒకసారి జరిగే మండల పరిషత్ సమావేశానికి అధికారులు విధిగా హాజరు కావాలని సూచించారు. ఈ సమవేశంలో చర్చించిన సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు. సమావేశంలో వైస్ ఎంపీపీ పండా కుమారి, ఎంపీటీసీలు ఉలవల లక్ష్మి, తుర్రం వెంకటేశ్వర్లుదొర, కుంజం వంశీ, నర్రి పాపారావు,కృష్ణకుమారి, ఖాజావలీ తదితరులు పాల్గొన్నారు.