
ఆన్‌లైన్ పరీక్షల్లో జియాన్ గోల్‘మాల్’!
పెందుర్తి: పోటీ పరీక్షల్లో వేలాది మంది అభ్యర్థుల విలాపానికి.. అడ్డదారిలో కొలువు దక్కించుకున్న వారి విలాసానికి వేదికగా చినముషిడివాడలోని జియాన్ డిజిటల్ కేంద్రం ఆరోపణలు మూటగట్టుకుంది. ఇక్కడ ప్రతిభ కంటే పైసాకే ఎక్కువ ప్రాధాన్యత అని ఇటీవల జరిగిన కొన్ని ఘటనలే నిదర్శనం. ఈ కేంద్రంలో జరిగే ప్రతి పోటీ పరీక్షలోనూ అడ్డదారుల్లో అభ్యర్థులకు సహకారం అందుతోందని బాధిత అభ్యర్థులు ఘంటాపథంగా చెబుతున్నారు. ఆ ఆరోపణలకు బలాన్ని చేకూర్చుతూ ఈ నెల 11న భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్(భెల్) సూపర్‌వైజర్ ట్రైనీ ఇంజనీర్ ఆన్‌లైన్ పరీక్షలో మాల్ ప్రాక్టీస్ ఘటన వెలుగుజూసింది. గత నెల 25న ఇదే కేంద్రంలో జరిగిన అసిస్టెంట్ ఎన్విరాన్‌మెంటల్ ఇంజినీర్ పరీక్షలోనూ ఇదే తరహా మాల్ ప్రాక్టిస్ జరిగిందని కొంత మంది అభ్యర్థులు ఏపీపీఎస్సీ చైర్‌పర్సన్‌కు ఫిర్యాదు చేశారు.
మాల్ ప్రాక్టీస్‌కు సంపూర్ణ సహకారం
చినముషిడివాడ జియాన్ డిజిటల్స్‌లో ఏడేళ్లుగా దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ ప్రభుత్వ, ప్రైవేటు రంగ సంస్థల్లో ఉద్యోగాలకు ఆన్‌లైన్ పరీక్షలు జరుగుతున్నాయి. గత రెండేళ్లుగా కేంద్రంలో ఆన్‌లైన్ పరీక్షల్లో అవకతవకలు జరుగుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఇక్కడ కొందరు బ్రోకర్ల అవతారం ఎత్తి ఉద్యోగాన్ని బట్టి బేరం కుదుర్చుకుంటున్నారు. ఆ తర్వాత ఆన్‌లైన్ పరీక్ష కేంద్రం నిర్వాహకులతో ఒప్పందం చేసుకుని, పరీక్ష సమయానికి ఏం చేయాలనే అంశంపై ముడుపులిచ్చిన అభ్యర్థులకు ముందుగానే ట్రైనింగ్ ఇస్తున్నారని ఆరోపణ. సదరు అభ్యర్థికి కేటాయించిన కంప్యూటర్ పాడవడం మొదటి ప్లాన్ అయితే, ముందుగానే జవాబు పత్రాన్ని అడ్మిట్ కార్డుపై ముద్రించడం రెండో ప్రణాళిక. ఇలా ఏదో ఒకటి అమలు చేసి డబ్బులు కట్టిన అభ్యర్థికి అధిక మార్కులు వచ్చేలా చేసి, మిగిలిన వారికి తీవ్ర అన్యాయం చేస్తున్నారన్నది ప్రధాన ఆరోపణ.
ఒక్కో స్థాయిలో ఒక్కో వ్యవహారం
వాస్తవంగా పరీక్ష కేంద్రంలో నిర్ణీత సమయంలో అభ్యర్థి తన అడ్మిట్ కార్డు నెంబర్ ఎంటర్ చేయగానే ప్రశ్నాపత్రం ప్రత్యక్షమవుతుంది. ముందుగా లీక్ అయ్యే అవకాశం ఉండదు. అయితే ఆయా ప్రశ్నాపత్రాన్ని రూపొందించిన బృందంలోని వ్యక్తులు బయటకు ఇస్తే మాత్రం బ్రోకర్లు దాన్ని సొమ్ము చేసుకుంటారు. ఇక ఆన్‌లైన్ పరీక్ష పర్యవేక్షణ చేసే ఇన్విజిలేటర్లు, ఇతర సిబ్బందిని డిజిటల్ కేంద్రమే ఏర్పాటు చేస్తుంది. టీసీఎస్ ఆధ్వర్యంలో సీసీ కెమెరాల పర్యవేక్షణ అంతా కేంద్రానిదే. ఇక్కడి నిర్వాహకులు తమకు డబ్బులు చెల్లించిన అభ్యర్థికి కంప్యూటర్ పాడైందన్న సాకుతో సీసీ కెమెరాల పర్యవేక్షణ లేని మరో కంప్యూటర్‌ను కేటాయిస్తారు. అక్కడ పేపర్‌ను మొబైల్లో రికార్డు చేసుకుని, వీలైనంత వేగంగా దానికి కీ రూపొందిస్తారు. ఆ కీని అభ్యర్థికి అందించి, కష్టపడి చదివిన వారికి అన్యాయం చేస్తున్నారు. జియాన్ డిజిటల్ కేంద్రంలో ఇలాంటి వ్యవహారాలు చాలా జరిగినట్లు బలమైన ఆరోపణలు ఉన్న నేపథ్యంలో ఈ మాల్‌ప్రాక్టీస్ వ్యవహారం నిగ్గు తేల్చేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. వెస్ట్ జోన్ ఏసీపీ పృధ్వితేజ విచారణాధికారిగా కేసు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. భెల్, టీసీఎస్‌ల నివేదికలు కూడా ఈ కేసులో అత్యంత కీలకం కానున్నాయి. కాగా జియాన్ డిజిటల్ కేంద్రంలో ఆన్‌లైన్ పరీక్షలు జరిగే సమయంలో ఏనాడూ పోలీస్ బందోబస్తు కోసం అభ్యర్థించిన దాఖలాల్లేకపోవడం కొనమెరుపు.
జియాన్ కేంద్రంగా జరిగిన పరీక్షల్లో
మాల్ ప్రాక్టీస్‌పై ఆరోపణలు
ఉద్యోగ స్థాయిని బట్టి అభ్యర్థుల నుంచి
రూ.లక్షల్లో వసూలు!
‘భెల్’తో పాటు ఇతర పరీక్షల అవకతవకలపై
ఏపీపీఎస్సీకి ఫిర్యాదులు
అన్ని పరీక్షల కాపీయింగ్‌పై ఉన్నతస్థాయిలో
సమగ్ర విచారణ